కల్తీ కాలనాగులు | kalti kalanagulu | Sakshi
Sakshi News home page

కల్తీ కాలనాగులు

Published Sat, Sep 17 2016 7:36 AM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM

కల్తీ కాలనాగులు - Sakshi

కల్తీ కాలనాగులు

ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం  
 నెయ్యిలో వనస్పతి.. టీ పొడిలో సింథటిక్‌ 
చోద్యం చూస్తున్న అధికారులు.. తనిఖీలకు మంగళం 
తణుకు(పశ్చిమగోదావరి జిల్లా) : జిల్లాలో ఆహారపదార్థాల కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. కొందరు వ్యాపారులు లాభార్జన కోసం నిత్యావసరాల నాణ్యతకు మంగళం పాడుతున్నారు. ఇది ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమించింది. ప్రస్తుతం ఏ పదార్థాన్ని చూసినా అది అసలుదో.. కల్తీదో తెలుసుకోవడం కష్టమవుతోంది. నిత్యావసరాలైన నెయ్యి, వంట నూనె, టీపొడి, బియ్యం, పాలు ఇలా ఒకటేమిటి ప్రతిదీ కల్తీ అవుతోంది. జిల్లా  కేంద్రంగా కల్తీ నెయ్యి, నూనెల తయారీ జరుగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. గతంలో తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ప్రాంతంలో నెయ్యి, నూనె తయారీ కేంద్రాలపై దాడి చేసిన విజిలెన్స్‌ అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు కళ్లముందు సాక్షాత్కరించాయి. వాటి నమూనాలను ప్రయోగశాలకు పంపిన అధికారులు అవన్నీ కల్తీవని తెలియడంతో నివ్వెరపోయారు.  
 
ముచ్చటైన ప్యాకింగ్‌తో మాయ 
పా్యకింగ్‌ ముచ్చటగా కనిపిస్తే చాలు ఎంత డబ్బు పోసైనా వస్తువులు కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనుకాడడం లేదు. ఈ బలహీనతనే అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కల్తీ చేసిన వస్తువులను అందంగా ప్యాకింగ్‌ చేసి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గతంలో తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై జరిగిన దాడుల్లో నెయ్యిలో ఎక్కువగా వనస్పతి కలుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. చాలా తక్కువ మోతాదులో నెయ్యిని తెచ్చి అధిక శాతం వనస్పతి కలిపి ముచ్చటగా ప్యాకింగ్‌ చేసి అమ్ముతున్నట్టు తేల్చారు.
 
రంగు పౌడర్‌తో టీపొడి
టీ పొడిలోనూ రంగు పౌడర్‌ కలిపి కల్తీ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రఖ్యాత బ్రాండ్ల టీపొడి ఖరీదు ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు విడి టీపొడి వాడకంపై దృష్టిపెట్టారు. దీంతో ఇటీవల కాలంలో మార్కెట్‌ను విడి టీపొడి ముంచెత్తుతోంది. అయితే దీనిని హోటళ్లలో వాడేసిన టీపొడిని సేకరించి అందులో రంపపు పొట్టు కలిపి తిరిగి ప్యాకింగ్‌చేస్తున్నట్టు తెలుస్తోంది. రంగు రావడంకోసం సింథటిక్‌ని వినియోగిస్తున్నట్టు సమాచారం. గతంలో ఏలూరులో ఆహార తనిఖీ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు దాడి చేసిన సమయంలో ఇదే తరహాలో తయారు చేసిన టీపొడి నిల్వలను గుర్తించారు.  
 
సన్నబియ్యం పేరుతో..
కొందరు వ్యాపారులు బియ్యాన్నీ కల్తీ చేస్తున్నారు. సన్నబియ్యం పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారు. 
కొన్ని ముతక రకాల బియ్యంలో కొంతమేర సన్నం బియ్యం కలిపి పాలిష్‌ పెట్టి అనధికార బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారు. ఎలాంటి లైసెన్సులూ, అనుమతులూ లేకుండా కనీసం సంచులపై చిరునామా ముద్రించకుండానే అమ్మేస్తున్నారు. చిల్లర వ్యాపారులకు మార్జిన్‌ ఎక్కువ ఇస్తుండటంతో వీటి అమ్మకాలకు వారూ మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ప్లాస్టిక్‌ బియ్యం పేరుతో పొరుగు రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 
 
తనిఖీలు ఎక్కడ !
కల్తీలను నిరోధించడానికి జిల్లాలో అడపాదడపా దాడులు నిర్వహిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కేంద్రాలపై జిల్లా ఆహార తనిఖీ అధికారులు, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే మొక్కుబడిగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
 
తరచూ దాడులు చేస్తున్నాం
జిల్లాలో కల్తీలను నిరోధించడానికి తరచూ తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడైనా ఫిర్యాదులు వచ్చినా స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. గతంలో నిర్వహించిన దాడులకు సంబంధించి సేకరించిన నమూనాలను ప్రయోగశాలకు పంపించి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాం.
– మాలకొండారెడ్డి, 
జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, ఏలూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement