విద్యార్థుల సేవలో..
► పాఠశాలకు రంగులు వేయించిన సామాన్యుడు
► సొంత డబ్బుతో విద్యావలంటీర్ నియామకం
ఎలిగేడు : విద్యార్థులకు సేవ చేస్తూ.. పలు కార్యక్రమాలు చేపడుతున్నాడు మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కాంపెల్లి ప్రభాకర్. ఆయన వృత్తిరీత్యా పేయింటర్. ఆయన భార్య కాంపెల్లి విజయ ర్యాకల్‌దేవుపల్లి ఎంపీటీసీగా గెలుపొందారు. సొంతూరులో ప్రాథమికోన్నత పాఠశాలకు ఆర్వీఎం నిధులు కేటాయించి అదనపు తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. తన సొంత డబ్బులతో ఆ గదులకు పేయింటింగ్ వేయించాడు. గదుల్లో వివిధ దేశపటాలు, సందేశాత్మక చిత్రాలను వేశాడు. పాఠశాలలో పూలకుండీని ఏర్పాటు చేశాడు. గోడలపై నీతి సూక్తులను సైతం రాశాడు.
వివిధ స్థాయిలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల నుంచి సహాయం తీసుకుని, దాతల సహాయ సహకారాలతో విద్యార్థిని, విద్యార్థులకు ఖరీదైన స్కూల్ యూనిఫాంలు, టైబెల్టులు, షూస్, లంచ్ బాక్సులను సైతం అందించాడు. తన సొంత ఖర్చులతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు వీలుగా ఆటో సౌకర్యం ఏర్పాటు చేశాడు. నర్సాపూర్‌లో ఆంగ్ల బోధనకు సైతం ఒక ప్రయివేటు టీచర్‌ను ఏర్పాటు చేసి వేతనం సైతం చెల్లిస్తున్నాడు. ర్యాకల్‌దేవుపల్లి ప్రాథమికోన్నత, రాములపల్లి ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు రూ.60వేలతో తరగతి గదులకు రంగులు వేశాడు.
తనవంతు సేవ చేయాలని..
ప్రయివేటు పాఠశాలల మోజులో పడి తమ పిల్లలను తల్లిదండ్రులు పంపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్న తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షించేలా ఏదైనా చేయాలని ఆలోచన మెదిలింది. దేవాలయాలకన్న మిన్నగా పాఠశాలలే. అందుకు వాటిని అందంగా తీర్చిదిద్దాలని నా ఆకాంక్ష.
కాంపెల్లి ప్రభాకర్, పేయింటర్