ప్రచారం తప్ప ప్రజా సమస్యలు పట్టవు
జన్మభూమి గ్రామసభల్లో తిరస్కారాలే ఉదాహరణ
సీఎం చంద్రబాబుపై కన్నబాబు ధ్వజం
ముమ్మిడివరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితం అవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ఐ.పోలవరం మండలం మురమళ్లలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లలో చంద్రబాబు ప్రజా సమస్యలను విస్మరించి రాష్ట్రంలో పాలనను భ్రష్టు పట్టించారన్నారు. తనకు తాను పాలనా దక్షుడిగా చెప్పుకుంటున్న చంద్రబాబును అన్నివర్గాల ప్రజలూ వ్యతిరేకిస్తున్నారన్నారు. జన్మభూమి గ్రామసభలలో ప్రజాప్రతిని«ధులను, అ«ధికారులను వివిధ సమస్యలపై ప్రజలు నిలదీస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని కన్నబాబు అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి నిరోధకుడంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని ప్రధాని మోదీకి సూచించింది తానే నని మొదట్లో గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నగదు రహిత లావాదేవీలంటూ డిసెంబర్ నెల పింఛన్లను బ్యాంకు ఖాతాలకు జమచేయడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇప్పటికీ చాలా మందికి డిసెంబర్ నెల పింఛన్లు అందలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.650 కోట్ల సొమ్ము జమ చేశారని కన్నబాబు అన్నారు. అయితే బ్యాంకుల చుట్టూ తిరిగుతున్నా ఆ సొమ్ము ఇప్పటికీ పూర్తిగా రైతుల చేతికి రాలేదన్నారు. ఫలితంగా రబీ పెట్టుబడులకు, సంక్రాంతి పండుగ ఖర్చులకు సొమ్ములు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. రైతుల ఇబ్బందుల దృష్యా బ్యాంకుల్లో ఉన్న వారి సొమ్మును సింగిల్ పేమెంట్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే విశ్వరూప్, పితాని బాలకృష్ణ, మండల కన్వీనర్లు పిన్నంరాజు వెంకటపతిరాజు , (శ్రీనురాజు) జగతా పద్మనాభం, నల్లా నరసింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, సీనియర్ నాయకులు పెన్మత్స చిట్టిరాజు, జిన్నూరి బాబి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కాశి బాలమునికుమారి పాల్గొన్నారు.