కాపు గర్జనకు బెదిరింపులు | Kapu Garjana ill-timed, says tdp | Sakshi
Sakshi News home page

కాపు గర్జనకు బెదిరింపులు

Published Sat, Jan 30 2016 8:43 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

కాపు గర్జనకు బెదిరింపులు - Sakshi

కాపు గర్జనకు బెదిరింపులు

⇒ బస్సులు ఇవ్వనిరాకరిస్తున్న ఆర్టీసీ
⇒ లారీలు, జీపులపైనా ఆంక్షలు
⇒ వేదికకు 5 కిలోమీటర్ల దూరంలో వాహనాల నిలిపివేత


సాక్షి, హైదరాబాద్: కాపుల రిజర్వేషన్ల సాధనకు మాజీ మంత్రి, కాపునాడు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈనెల 31న తునిలో నిర్వహించ తలపెట్టిన కాపు గర్జనకు అధికార తెలుగు దేశం ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నట్టు కాపునాడు రాష్ట్ర కమిటీ ఆరోపించింది. కాపు ఓట్లతో రాజ్యాధికారాన్ని చేపట్టి తమనే అణగదొక్క చూస్తున్నారని శుక్రవారం ధ్వజమెత్తింది. రాష్ట్ర నలుమూలల నుంచి తూర్పుగోదావరి జిల్లా తునికి తరలివచ్చేందుకు సమాయత్తమవుతున్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపుకులస్తులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆటంకాలు కల్పిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని కాపు ప్రముఖులను పరోక్షంగా బెదిరిస్తూ ప్రజలు తరలిపోకుండా చూస్తున్నారు.

 

ఆర్టీసీ బస్సుల్ని అద్దెకు ఇవ్వకుండా అధిక వ్యయ ప్రయాసలకు గురిచేస్తున్నారనే దానికి ప్రత్యక్ష తార్కాణమే ఏలూరు ఆర్టీసీ డిపోమేనేజర్ కార్యాలయం ఎదుట శుక్రవారం కాపుల ఆందోళన. ఆర్టీసీ అధికారి ఎంతకీ వినకపోవడంతో ఓ యువ కాపు నాయకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయిల్ డబ్బాతో హల్‌చల్ చేశారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొన్నట్టు కాపునాడు నేతలు రామనీడు మురళీ, ఆరేటి ప్రకాశ్, అడపా నాగేందర్, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు ఆరోపించారు. దీంతో రాయలసీమ జిల్లాల వాసులు పెద్దఎత్తున జీపులు, మినీ వ్యాన్లు, ప్రైవేటు టూరిస్టు బస్సులను అద్దెకు తీసుకున్నట్టు బలిజ, కాపు రిజర్వేషన్ పోరాట కమిటీ కన్వీనర్ సింగంశెట్టి సోమశేఖర్ చెప్పారు. రిజర్వేషన్లు తమకేసే భిక్ష కాదని, ఇది తమ హక్కని, అస్తిత్వం కోసం చిరు జాతులు పోరాటం చేస్తున్నట్టే తాము పోరాటానికి దిగామని, దీనిపై ఆంక్షలు విధిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.

 

ప్రజలు వేదిక వద్దకు చేరుకోకుండా పోలీసులు ఐదారు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపేలా ఆంక్షలు విధించారు. జాతీయ రహదారికి ఆనుకుని వి.కొత్తూరుకు సమీపంలో బహిరంగ సభ వేదిక ఏర్పాటైనందున సహజంగానే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ఈసాకుతో జనాన్ని తరిమికొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కూడా నిర్వాహకులు ఆరోపించారు. సభకు ఎటువంటి బందోబస్తు చేయకుండానే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం.

మీటింగ్‌కు వెళ్లకండి- టీడీపీ నేతల హుకుం
రాజకీయాలకు అతీతంగా రిజర్వేషన్ల సాధన కోసం తలపెట్టిన కాపు ఐక్య గర్జనను విఫలం చేసేందుకు తెలుగుదేశం నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన మంత్రివర్గంలోని కాపులను మీటింగ్ ఛాయలకు కూడా వెళ్లవద్దని ఆదేశించారు. గర్జనను విఫలం చేసే పనిని గ్రామాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను పురమాయించారు. మీటింగ్‌కు వెళ్లే వారికి జన్మభూమి కమిటీల ద్వారా గుర్తించే పని అప్పగించారు. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్, రేషన్ బియ్యం వంటి వాటిల్లో కోత వేస్తామన్న సంకేతాలను ఇప్పిస్తున్నారు.

80 ఎకరాల్లో సభాస్థలి...
తునికి ఆరు, అన్నవరానికి పది కిలోమీటర్ల దూరంలోని వెలమకొత్తురుకు సమీపంలో 80 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదిక సిద్ధమైంది. ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు, మరికొందరు కాపు నేతల స్వీయ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు ఐదు లక్షల మంది తరలివస్తారన్న అంచనాతో ఏర్పాట్లు జరిగినప్పటికీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అంతకుమించి వచ్చే అవకాశం ఉంది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇక్కట్లు తప్పేలా లేవు. నిర్వాహకులు ఇప్పటికే ఈ విషయాన్ని అడిషనల్ ఎస్పీకి తెలిపారు. తదనుగుణంగా పోలీసు సిబ్బందిని నియమించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

తరలివస్తున్న ప్రముఖులు..
రిజర్వేషన్లు కోరే ప్రతి కాపు కుటుంబం నుంచి ఒక్కరైనా తరలిరావాలన్న నినాదం ఇవ్వడంతో అసంఖ్యాకంగా జనం బయలుదేరి వస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడి జనంతో కిటకిటలాడుతోంది. తుని, అన్నవరంలో వీధుల్లో సందడి పెరిగింది. దీనికి తగ్గట్టు తరలివచ్చే వారిలో ఎక్కువ మంది ప్రముఖులు ఉండడంతో వసతి పెద్ద ఇబ్బందిగా మారింది. తరలివస్తున్న నేతల్లో మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు, కే కేశవరావు, మాజీ మంత్రులు బొత్సా సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సినీ ప్రముఖులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement