కాపు నేతలతో భేటీకానున్న ముద్రగడ
►హామీల అమలుపై సీఎం లిఖితపూర్వక హామీకి డిమాండ్
► నేటి సాయంత్రం వరకూ గడువు ఇచ్చిన ముద్రగడ
►లేకుంటే రేపటి నుంచి తిరిగి ఆమరణ నిరాహార దీక్ష
► దీక్ష సన్నాహాల్లో ఆయన అనుచరగణం, నేడు సమావేశం
► పరిణామాలను ఎదుర్కొనడానికి సన్నద్ధమవుతున్న పోలీసులు
► కిర్లంపూడిలో గతంలో కన్నా రెట్టింపు బలగాల మోహరింపు
జగ్గంపేట : కాపులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో పోరాడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఆ క్రమంలోనే శుక్రవారం నుంచి మళ్లీ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నారు. దీంతో అటు ఆయన అనుచరగణం, ఇటు పోలీసు యంత్రాంగం వ్యూహ ప్రతివ్యూహాలలో నిమగ్నమయ్యాయి. గురువారం ఉదయం ఆయన 13 జిల్లాల కాపు నేతలతో సమావేశం కానున్నారు.
కాపు రుణాల కోసం రూ.500 కోట్లు తక్షణం విడుదల చేయాలని, ఏటా రూ.1,000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని, దరఖాస్తుదారులందరికీ రుణాలు మంజూరు చేయూలని, మంజూరులో జన్మభూమి, పెద్దల కమిటీలకు ప్రమేయం లేకుండా చేయాలని, ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులకు వరుస సంఖ్య ఆధారంగా రుణాలు ఏ మండలానికి ఆ మండలంలో పంపిణీ చేయాలని, జీవో నం:10 ప్రకారం ప్రతి యూనిట్‌కు రూ.2 లక్షల రుణం ఇవ్వాలని, మంజునాథ కమిషన్ నివేదికను 9 నెలల లోపు ఇప్పించాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్లపై ముఖ్యమంత్రి సంతకంతో అధికారికంగా హామీ పత్రాన్ని గురువారం సాయంత్రం లోపు ఇవ్వాలని గడువు పెట్టారు. ప్రభుత్వం నుంచి గాని, ముఖ్యమంత్రి నుంచి గాని సానుకూల స్పందన రాకపోతే శుక్రవారం ఉదయం కిర్లంపూడిలోని తన నివాసంలో ఉదయం 10 గంటల నుంచి తిరిగి ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నారు.
ఈసారి ఒక్కరే దీక్ష..
ఈ నేపథ్యంలో ముద్రగడ దీక్ష అనివార్యమైతే చేపట్టాల్సిన కార్యాచరణలో ఆయన అనుచరగణం నిమగ్నమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ముద్రగడ నివాసంలో 13 జిల్లాలలోని ముఖ్య నాయకులు, న్యాయవాదులు, మేధావులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీక్షతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహ రచనలో వారుండగా.. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఎలా వ్యవహరించాలి అనే ప్రతివ్యూహంలో పోలీసు యంత్రాంగం తలమునకలవుతోంది.
ముద్రగడ నిర్ణయూన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఐజీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. గత నెల 5న ముద్రగడ భార్యతో కలిసి దీక్ష చేపట్టగా ప్రస్తుతం ఆయన ఒక్కరే దీక్ష చేపట్టనున్నారు. దీక్ష సమయంలో కిర్లంపూడికి కాపునేతలుగాని, ఇతర మద్దతుదారులుగాని రాకుండా కట్టడి చేసేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించనున్నారు. గత నెలలో దీక్షకు సుమారు 1,200 మంది పోలీసు సిబ్బంది బందోబస్తుకు రాగా ఈసారి రెట్టింపు స్థాయిలో బలగాలను దింపనున్నట్టు తెలుస్తోంది. కిర్లంపూడి సత్యదేవా కల్యాణ మండపాన్ని పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు.
పోలీసు బలగాలకు అవసరమైన షామియానాలు, భోజన సదుపాయాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా జగ్గంపేట సీఐ సత్యనారాయణ బుధవారం ముద్రగడను ఆయన నివాసంలో కలిసి పోలీసు బందోబస్తు తదితర విషయాలపై చర్చించారు. అనంతరం సీఐ ‘సాక్షి’తో మాట్లాడుతూ గతంలో కంటే ఎక్కువ పోలీసు బలగాలు బందోబస్తుకు రానున్నాయన్నారు.
కలకలం రేపిన లేఖ
కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చే స్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఆమర ణ నిరాహారదీక్షకు దిగనున్న నేపథ్యంలో ముద్రగడను ఉదే ్దశించి, ఆయన శ్రేయోభిలాషి రాసినట్టున్న లేఖ కలకలం రేపింది. ‘ముద్రగడ గురించి మొన్న ఇంటెలిజెన్స్ ఐజీ మీటింగ్ జరిగిందని, 11వ తారీఖుకు ముందే ముద్రగడను అరెస్టు చేసి జైలుకు పంపమని సీఎం చెప్పారని, కిర్లంపూడిలో కర్ఫ్యూ పెట్టి దిగ్బంధిస్తారని, అరుునా భయపడకుండా సిద్ధంగా ఉండాలని’ ఆ లేఖ సారాంశం. బలరామ్ అనే పేరుతో రాసిన లేఖ కిర్లంపూడికి చెందిన కొందరు విలేకరులకు బుధవారం పోస్టులో అందింది. కలకలం రేపిన ఈ లేఖపై కిర్లంపూడిలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.