'ముద్రగడకు ఏమైనా జరిగితే ఊరుకోం'
తెనాలి రూరల్:
రాష్ట్రంలో హిట్లర్, మావో పాలన సాగుతోందని.. ప్రభుత్వ పెద్దల కళ్లు, చెవులు మూసుకుపోయాయని కాపు జాగృతి నేత హరిదాసు గౌరీశంకర్ దుయ్యబట్టారు. కాపుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2019లో టీడీపీని ఏపీలో ఖాళీ చేయించేందుకు కాపులంతా ఐక్యంగా పోరాడతారని చెప్పారు.
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాపు జాగృతి నేతలు అన్నారు. రాష్ట్ర కన్వీనర్, సుప్రీంకోర్టు న్యాయవాది జల్లా సతీష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కాపులను ఇళ్ల నుంచి బయటకు రానీయని పరిస్థితులను ప్రభుత్వం కల్పించిందన్నారు.
మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొండా ఉమ తదితర టీడీపీ నాయకులు కాపు కుల ద్రోహులని విమర్శించారు. ముద్రగడ కుటుంబంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, కాకినాడ ఏఎస్పీ దామోదర్, డీఎస్పీ పల్లంరాజులను వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించడం దారుణమన్నారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు దంతాల కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుపై వానపడిన చందంగా వ్యహరిస్తోందని విమర్శించారు.