ముందస్తు నీళ్లు ఇస్తేనే మేలు
ముందస్తు నీళ్లు ఇస్తేనే మేలు
Published Sat, May 13 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM
అమలాపురం : ముందస్తు ఖరీఫ్ సాగు చేపట్టాలన్న డెల్టా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. సుదీర్ఘకాలంగా తాము చేస్తున్న పోరాటానికి స్పందించి ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు 15 రోజుల ముందే సాగునీరు విడుదలకు ఇరిగేషన్ అధికారులు అంగీకరించారు. తాజాగా ముందుస్తుగా కాలువలకు సాగునీరందించేందుకు ఇరిగేషన్ ఎడ్వజరీ బోర్డు (ఐఏబీ) సమావేశ తీర్మానం ఉంటేకాని నీరు విడుదల చేయలేరని ఇరిగేషన్ అధికారులే చెబుతుంటుంటే ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. డెల్టాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు జూన్ ఒకటికి పంట కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 15 తరువాత సాగునీరు ఇవ్వడం వల్ల అక్టోబరులో పంట దెబ్బతింటుందని, రబీ సాగు చివరి కాలంలో నీరందకపోవడం, మూడో పంట అపరాల సాగు లేక పోవడం వంటి విపత్కర పరిస్థితులకు కారణమవుతోందని రైతులు ఆందోళన. సాగునీరు ఆలస్యమైనందున గతేడాది కోనసీమలో సుమారు 40 వేల ఎకరాల్లో సాగు చేయని సంగతి తెలిసిందే. ఇందుకు రైతులు చెప్పిన కారణం జూన్ 15 తరువాత నీరు ఇవ్వడం వల్ల సాగు చేయడం లేదనే. రైతులు డిమాండ్‌ను ‘సాక్షి’ పలు సందర్భాలలో వెలుగులోకి తీసుకురావడంతో స్పందించి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సిఫార్సు మేరకు అధికారులు జూన్ ఒకటి నుంచి కాలువలకు నీరివ్వాలని నిర్ణయించారు. అధికారులు నిర్ణయంతో ముందస్తు సాగుకు అటు రైతులు, ఇటు వ్యవసాయశాఖాధికారులు సైతం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తీరా చూస్తే ఇరిగేషన్ ఎడ్వజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో ముందస్తు సాగునీరు విడుదలకు తీర్మానం చేయలేదని, అప్పటి సమావేశంలో జూన్ 15 నాటికే నీరు ఇవ్వాలని తీర్మానించినట్టు అధికారులు చెబుతున్నారు. దీనితో ముందస్తు సాగునీరు విడుదలపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గోదావరి ప్రాజెక్టు కమిటీ ప్రతినిధులు ఐఏబీలో తీసుకున్న నిర్ణయాన్ని కాదని, ముందస్తు సాగునీరు విడుదల చేయాలంటే సాధ్యం కాదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఇరిగేషన్ అధికారి ‘సాక్షి’తో అన్నారు. అలా చేయాలంటే మరోసారి ఐఏబీ సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దీమాతోనే ఈ ఏడాది ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ఆరంభించారు. ఎప్పటిలానే ఈ సారి కూడా సాగునీరు ఆలస్యంగా విడుదలైతే ఖరీఫ్ దూరంగా ఉండాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement