దెయ్యం బాబోయ్.. దెయ్యం
పెదబయలు కేజీబీవీలో విద్యార్థినుల ఆందోళన
(అరకులోయ): మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు గత కొద్ది రోజులుగా దెయ‍్యమంటూ హడలిపోతున్నారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు టెన్త్ విద్యార్థినులకు దెయ్యం ఆవహించిందంటూ గురువారం పాఠశాల అంతటా టైర్లు పొగపెట్టారు. విద్యార్థినుల భయాందోళనలతో పాఠశాల ప్రత్యేక అధికారి, సిబ్బంది కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఆరోగ్యం బాగాలేదేమోనని ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యసేవల అనంతరం పాఠశాలకు తీసుకు వస్తే దెయ్యం అంటూ అరుపులు, కేకలతో బాలికలు పరుగులు తీస్తున్నారు. గతంలోనూ ఇలాగే ఇక‍్కడ ప్రచారం జరిగింది.
ఆందోళనలో బాలికలు..
పెదబయలు పీహెచ్‌సీ వైద్యాధికారి అప్రోజ్ సుల్తాన్ గురువారం సాయంత్రం కేజీబీవీకి వచ్చి ఓ విద్యార్థినిని పరిశీలించి పాడేరు ఏరియా ఆస్పత్రికి తరిలించాలని సూచించారు. ఇక‍్కడి పరిస్థితిని గిరిజన సంక్షేమశాఖ డీడీకి తెలిపారు. ఈమేరకు ఆమె విద్యార్థినులకు పాడేరు ఏరియ ఆస్పత్రికి తరలించాలని స్పెషలాఫీసర్‌ను ఆదేశించినట్టు సమాచారం. గురువారంరాత్రి స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు జర్సింగి సూర్యనారాయణ, సందడి కొండబాబు, సీతగుంట పాఠశాల హెచ్‌ఎం అప్పారావు పాఠశాలకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడి ధైర‍్యం చెప్పారు. దీనిపై పాఠశాల ప్రత్యేక అధికారి సుధారాణి మాట్లాడుతూ మూడు రోజుల నుంచి ముగ్గురు విద్యార్థినులు ఒకే లక్షణాలతో బాధపడుతున్నారన్నారు. గతంతోనూ పలువురు ఇదే లక్షణాలతో ఇబ్బంది పడ్డారన్నారు. స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లినా నయం కాలేదని తెలిపారు.