- సిద్దిపేటలో ఏడుగురికి చికిత్స
- సాయంత్రానికి కోలుకున్న విద్యార్థినులు
- నీరు, ఆహారం కలుషితమే కారణం
నంగునూరు : నంగునూరు మండలం నర్మేటలోని కేజీబీవీలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఏడుగురిని సిద్దిపేట ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విద్యార్థినుల కథనం ప్రకారం... నర్మేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని పరీక్షించిన పాఠశాల ఏఎన్‌ఎం వారికి మందులు అందజేశారు. విరేచనాలు తగ్గకపోవడంతో బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఎస్‌ఓ హమీదా తీవ్రంగా నీరసించిన మానస, అరుంధతి, అంజలి, రేణుక, జ్యోతి, స్వాతి, రమ్యలను 108 అంబులెన్స్‌లో సిద్దిపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఫ్లూయిడ్ ఎక్కించాలని వైద్యులు చెప్పడంతో ఎంసీహెచ్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. సాయంత్రం విద్యార్థులు కోలుకోవడంతో వారు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కస్తూర్బా విద్యాలయంలో మంచినీటి సమస్య ఉండడంతో పిల్లలు బోరు నీటిని తాగుతున్నారని చెప్పారు. అలాగే నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్నారు. మెనూ పాటించడం లేదని పాఠశాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించినా స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరుతున్నారు.