
ఓవర్ టేక్ చేయబోయి..
కేశినేని ట్రావెల్స్ బస్సు బోల్తా.. 23 మందికి గాయాలు
ఇటిక్యాల: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో 23 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కాశీ లింగం, ప్రయాణికుడు చేతన్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది.
తెల్లవారుజామున 5.10 నిమిషాలకు ఇటిక్యాల మండలం కొండేరు గ్రామం వద్దకు చేరుకుంది. బస్సు డ్రైవర్ ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోతుండగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అతి వేగంగా ఉండడంతో బస్సు డివైడర్‌ను తాకుకుంటూ కొంతదూరం వెళ్లి మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరిగిందో తెలియలేదు. వారు తేరుకునేలోపే బస్సు తలకిందులుగా పడిపోయి ఉంది.
కొంతమంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చారు. గద్వాల డీఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో కోదండాపురం ఎస్‌ఐ మహేశ్వర్‌రావు, ఇటిక్యాల ఏఎస్‌ఐ ఆనంద్‌లు ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.