ఉత్సాహం..ఉరకేలేస్తూ...
ఏయూక్యాంపస్ : రక్తదాన చైతన్యం వెల్లివిరిసింది. యువతరం ఉత్సాహంగా తరలి వచ్చింది. వేలాది మంది ప్రాణాలకు రక్షగా ఉంటామని ప్రతిన బూనింది. తమ శక్తిని, రక్తాన్ని సమాజ హితానికి వినియోగిస్తామంది. ఆంధ్రవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవ మందిరంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి యూత్ పోటెత్తింది.
రక్తదానం అవశ్యం...
విస్తరిస్తున్న నగరంలో నిత్యం రక్తం కోసం వందలాది మంది రోగులు ఎదురుచూస్తుంటారు. వీరికి పూర్తిస్థాయిలో అవసరమైన రక్తం అందడం లేదు. దీనిని నివారించే దిశగా యువతరం కదలి వచ్చింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం, ఎన్‌సీసీ సంయుక్తంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి రెండు వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా రక్తం కొరత వలన ఎదురవుతున్న సమస్యలను పరిష్కారం చూపడానికి కదిలారు.
సాంస్కృతిక సమ్మేళనం...
రక్తదాన శిబిరాన్ని వినూత్నంగా నిర్వహించారు. విద్యార్థులకు అక్కడికక్కడే రక్తదాన అవసరాన్ని తెలిపే విధంగా వివిధ ప్రశ్నలతోక్విజ్ నిర్వహించారు. వక్తత్వం, స్లోగన్ రచన పోటీలు జరిపారు. దీనితో పాటు విద్యార్థులు వివిధ శాస్త్రీయ, జానపద నత్యాలు చేశారు. దశావతార రూపకం ఎంతో ఆకట్టుకుంది. సాంస్కతిక సత్తాను చాటుతూ, రక్తదాన ప్రాధాన్యతను వివరించే దిశగా ఈ కార్యక్రమం సాగింది. యువత ఎంతో ఉత్సాహంగా నత్యాలు చేస్తూ గడిపారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను నిర్వాహకులు అందజేశారు.