వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్ సందీప్ శాండిల్య
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించిన బుర్కా గ్యాంగ్ మిస్టరీ వీడిపోయింది. ఓ తండ్రికి మగబిడ్డ కావాలనే ఆశతోనే ఈ కిడ్నాప్ చేసిన ఫాహీమా బేగం, అజీమ్ ఖాన్, ప్రవీణ్ బేగమ్‌లను రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య శనివారం మీడియాకు వివరలు వెల్లడించారు. గోడేఖబర్‌కు చెందిన వాహీద్‌కు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మగ సంతానం కలిగినా అతను ఐదు నెలల వయస్సులో చనిపోవడంతో మగపిల్లవాడిని దత్తత ఇస్తే తీసుకుంటానని తన సోదరి పర్వీన్ బేగం, బావ అజ్జులకు తెలిపాడు.
దీంతో అజ్జు చింతల్‌మెట్‌లోని తన బంధువు ఫహీం బేగంను సంప్రదించాడు. అమె మగపిల్లాడిని దత్తత ఇచ్చేవారి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో వాహీద్ మగపిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకవచ్చినా అభ్యంతరం లేదని, చట్టపరంగా దత్తత డీడ్‌ను రెడీ చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఈనెల 3న ఫాహీమా బేగం బుర్కా ధరించి అదే ప్రాంతంలో ఆడుకునేందుకు వెళుతున్న ఖలీమ్(4), అతని సోదరి రేష్మా(6)లను అనుసరించి, కుర్‌కురే ఇప్పిస్తానని తన వెంట తీసుకెళ్లింది.
పిల్లలతో కలిసి ఆటో ఎక్కి సిఖ్‌చావనీకి చేరుకుంది. అక్కడ రేష్మాకు రూ.10 ఇచ్చి ఇచ్చి షాపునకు పంపించింది. పాప అటు వెళ్లగానే ఖలీమ్‌ను తీసుకుని కిషన్‌బాగ్‌లోని తన స్నేహితుడు అజీమ్ ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత రూ.15 వేలకు వాహీద్‌కు బాలుడిని అప్పగించింది. దీంతో వారు నాంపల్లి కోర్టుకు వెళ్లి దత్తత తీసుకున్నట్లు ఓ అగ్రిమెంట్ డీడ్‌ను తయారుచేశారు.
ఆటోపై అక్షరాల ఆధారంతో
స్థానికుల సహాయంతో ఇంటికి చేరిన రేష్మా బురఖాలో వచ్చిన మహిళ తమ్ముడిని ఎత్తుకెళ్లిపోయిందని చెప్పడంతో తల్లి జబీన్ బేగం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీకెమెరాలు పరిశీలించగా, చింతల్‌మెట్ నుంచి సిఖ్‌చావాని ప్రాంతానికి ఆటోలో పిల్లాడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆటోపై ఉన్న జాన్ అనే అక్షరాల అధారంగా ఆటో డ్రైవర్ ఆచూకీ తెలుసుకుని ఆటో డ్రైవర్‌ను విచారించిన పోలీసులు అతని పాత్ర లేదని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత బురకాలో ఉన్న మహిళ కోసం శ్రమించిన పోలీసులకు దొరికిన ఓ చిన్న ఆధారం అదుపులోకి తీసుకున్నారు.