సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ
- సీసీడీసీసీ ప్రారంభత్సోవంలో సైబరాబాద్ కమిషనర్
సాక్షి, సిటీబ్యూరో: జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో నేరాలు-ట్రాఫిక్ నియంత్రణ కోసం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ‘ కేంద్రీయ నేరస్తుల వివరాలు సేకరణ విభాగం’ (సీసీడీసీసీ)ను ఏర్పాటు చేశారు. దీనిని నగర అదనపు పోలీసు కమిషనర్ సం దీప్‌శాండిల్యాతో కలిసి సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రా రంభించారు. సీసీడీసీసీలో రెండు కమిషనరేట్లకు చెందిన నేరస్తులందరి పూర్తి వివరాలు (కుటుంబం, బంధువులు, స్నేహతులు) సేకరించి అందుబాటులో పెడతారు. వీటితో పాటు ఫొటోలు, వేలి ముద్రలనూ కూడా ఉంచుతారు.
దొంగతనాలు, ఇతర నేరాలు చేసి పట్టుబడిన నేరస్తుల వివరాలు సేకరించడం సీసీడీసీసీ ముఖ్య ఉద్దేశమని కమిషనర్ ఆనంద్ తెలిపారు. ఈ వివరాలను అన్ని ఠాణాలతో పాటు ప్రత్యేక దర్యాప్తు విభాగాలకు, అవసరమైన అన్ని జిల్లాలకు పంపిస్తామన్నారు. ఇలా చేయడం వల్ల తరచూ నేరస్తుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు వారిని పట్టుకోవడమూ సులభమవుతుందన్నారు. నేరాగాళ్లపై పోలీసులకు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే మంచి ఫలితాలొస్తాయన్నారు.
కేవలం నేరాలే కాకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే విషయంలోనూ ఇప్పటి నుంచి రెండు కమిషనరేట్ల పోలీసులు సమన్వయంతో పని చేస్తారన్నారు. సైబరాబాద్‌లో నేరం చేసి సిటీలో.. నగరంలో నేరం చేసి సైబరాబాద్‌లో తలదాచుకుంటున్న వారిని సీసీడీసీసీలోని వివరాల ఆధారంగా ఇట్టే పట్టేయడానికి వీలవుతుందని నగర అదనపు పోలీసు కమిషనర్ సందీప్‌శాండిల్యా అన్నారు. ఇదిలా ఉండగా.. నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై వాల్‌పోస్టర్‌ను కమిషనర్ ఆనంద్ విడుదల చేశారు.
సొంత భద్రతపై దృష్టి పెట్టాలి: సీవీ ఆనంద్
నేరాల జరగుకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సొంత భద్రతపై దృష్టి పెట్టుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళ్లలో వాకింగ్‌కు వెళ్లేటప్పడు, పిల్లలకు టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి స్కూళ్లకు, ఒంటరిగా ఆలయానికి వెళ్లేటప్పుడు స్నాచర్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి.