‘మోకీళ్ల’కు మోక్షం
‘మోకీళ్ల’కు మోక్షం
Published Tue, Aug 2 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
జీజీహెచ్‌లో బుధవారం పది మందికి
మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు
బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సాయంతో..
దేశ చరిత్రలోనే తొలిసారి
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల మరో కీర్తి కిరీటాన్ని ధరించబోతోంది. ఇప్పటి వరకు డాక్టర్ గోఖలే సాయంతో ఉచిత గుండె ఆపరేషన్ చేసి తన విశాల హదయాన్ని చాటిన ఆస్పత్రి.. నేడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి సంకల్పంతో ఒకేసారి పది మంది మోకీళ్లకు మోక్షం కల్పించబోతోంది. ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేక..కనీస సౌకర్యాలు కానరాక అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కొన్న రోగుల కళ్లలో ఆనంద కాంతులు వెలిగించబోతోంది. దేశచర్రితలోనే ఒకేసారి పది మందికి మోకీళ్ల ఆపరేషన్లు ఉచితంగా అందించిన వైద్యశాలగా మరో మైలురాయి దాటబోతోంది.
గుంటూరు మెడికల్: స్థానిక జీజీహెచ్‌లో బుధవారం పది మందికి ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆపరేషన్లు జరగనున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు పది మందికి మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతుండడంతో ఆర్థోపెడిక్ వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షుడు గుంటూరుకు వస్తున్నారని సమాచారం. గుంటూరు సాయిభాస్కర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఈ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్ల కోసం రూ.10 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్లను ట్రస్ట్ ద్వారా పేద రోగులకు అందిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ తొమ్మిది మందికి మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసి రూ.10 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్‌లను ఉచితంగా ఇచ్చారు. రాష్ట్ర వైద్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు జాయింట్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్‌లోనూ ఈయన పాల్గొన్నారు.
పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే...
డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మైసూర్‌లో 1994లో ఎంబీబీఎస్, దావనగిరిలో 2003లో ఆర్థోపెడిక్ సర్జరీలో పీజీ పూర్తి చేశారు. హైదరాబాద్ సన్‌షైన్ హాస్పిటల్‌లో 2003–05 వరకు డాక్టర్ గురవారెడ్డి వద్ద, అనంతరం ఇంగ్లాండ్‌లో 2005లో జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో గుంటూరులో సాయిభాస్కర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు.
2007 నుంచి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు..
బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను 2007లో ప్రారంభించారు. ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వైద్య సేవలందిస్తున్నారు. గుంటూరును జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జీలకు రాజధానిగా చేయటమే లక్ష్యమని ఆయన చెబుతున్నారు. ఆర్ధోపెడిక్ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్న ఈయన జాయింట్‌రీప్లేస్‌మెంట్ సర్జరీల్లో వస్తున్న పలు నూతన వైద్య పద్ధతులను అవలంబిస్తున్నారు.
డాక్టర్ నరేంద్రరెడ్డి సేవలు ఆదర్శం..
డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్
పేద ప్రజలకు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఉచితంగా ఆపరేషన్లు చేయటం అభినందనీయం. సుమారు రూ.20 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్‌లను సైతం ఆయనే తన ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా అందించారు. ప్రభుత్వం కూడా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిరంతరం కొనసాగించేందుకు గుంటూరుతోపాటుగా విశాఖపట్నం, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రులకు నిధులను విడుదల చేసేందకు సిద్ధంగా ఉంది. డాక్టర్ బూసిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని వైద్యులు ముందుకొస్తే పేద ప్రజలకు మరిన్ని సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందుతాయి.
Advertisement
Advertisement