కొడంగల్ : నియోజకవర్గ విభజనకు నిరసనగా గురువారం పట్టణంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. అఖిలపక్షం, నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. ఉపాధి హామీ పథకం మేటీలు, కూలీలు సిరుసని శ్యాంసుందర్, నాయికోటి శ్రీనివాస్, కిష్టప్ప, ఆశప్ప, కాశప్ప, శ్రీనివాస్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. వారికి పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కేఎన్‌పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
నియోజకవర్గాన్ని ఒకటిగా ఉంచి పాలమూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొడంగల్‌ను డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు. కొడంగల్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇందనూర్ బషీర్, చంద్రప్ప, సోమశేఖర్, రమేష్‌బాబు, సురేష్‌లతో పాటు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలను, దుకాణాలను మూసివేయించారు. తెలంగాణా ప్రభుత్వం కొడంగల్‌కు చేసిన అన్యాయానికి అఖిల పక్షం నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపారు.