విజయనగరం : ఆంధ్రప్రదేశ్లోని జరుగుతున్న రాజకీయ కుయుక్తులను రాష్ట్రపతికి వివరిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ నెల 25వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలసి ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతికి తెలియజేస్తామన్నారు. గురువారం విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి విలేకర్లతో మాట్లాడుతూ... ఈ నెల 23న సేవ్ డెమోక్రసీ పేరుతో నిరసనలతోపాటు జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ ఉన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ టీడీపీ నేతలను కోలగట్ల ప్రశ్నించారు.తాను, తన కొడుకు శాశ్వతంగా అధికారంలో ఉండాలన్న దురద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దోచుకున్న నగదుతో ఎమ్మెల్యేలను కొనగలరేమోగాని...ప్రజలను మాత్రం కొనలేరన్నారు. తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు పార్టీని వీడితే గగ్గోలు పెడుతున్న మీరు... ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబును కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు.