కోనప్ప ఫస్ట్
పనితీరులో మెజారిటీ ప్రజల పట్టం
ఉమ్మడి జిల్లాలో 70.90 శాతం జనం మెచ్చిన ఎమ్మెల్యే
♦ 32.70 శాతంతో అట్టడుగున మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్ .దివాకర్‌రావు
♦ తొలి సర్వేలో 17 శాతం నుంచి ఇప్పుడు 62.90 శాతానికి చేరిన కోవ లక్ష్మి
♦ ఎమ్మెల్యేలపై అధికార పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాలు విడుదల
♦ ఉమ్మడి జిల్లాలో సగటున ఎమ్మెల్యేల పనితీరు 53.4 శాతం
♦ ఎమ్మెల్యేలపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను వివరించిన సీఎం కేసీఆర్
♦ ప్రజల మనిషిగా మన్ననలు పొందాలని సూచన
సాక్షి, మంచిర్యాల: తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నిౖకైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతల జాతకాన్ని ముఖ్య మంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఉంటే వారి సగటు పనితీరు 50.4 శాతంగా నమోదైంది. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలకు ప్రజా మద్దతు 40 శాతం లోపుగానే ఉండగా, మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు మెరుగైన రీతిలో ప్రజల మన్ననలు పొందుతున్నారు.
మొత్తం పది మంది ఎమ్మెల్యేల్లో సిర్పూర్ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప ప్రజాభిమానంలో అందరికన్నా ఓ మెట్టు పైనున్నారు. అదే సమయంలో మంచిర్యాల శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్‌రావు అట్టడుగున పదో స్థానంలో నిలవడం గమనార్హం. శాసనసభ్యుల పనితీరుపై టీఆర్‌ఎస్ తరపున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా జరిపించిన ఓ సర్వేలో వెల్లడైన నిజాలివి. ప్రజలు ఆయా శాసనసభ్యులకు ఇచ్చిన మార్కులను ఆ పార్టీ గురువారం వెల్లడించింది.
తొలి సర్వేకు రెండో సర్వేకు భారీ తేడా!
టీఆర్‌ఎస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16 సంవత్సరంలో ఆ పార్టీ మొదట సర్వే జరిపించింది. తొలి సర్వేలో మంచి మార్కులు కొట్టుకున్న వారు కూడా రెండో సర్వేలో దారుణంగా వెనుకబడడం గమనార్హం. ఒకటో సర్వేలో నిర్మల్ ఎమ్మెల్యే, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 96 శాతం ప్రజల మద్ధతుతో తొలిస్థానంలో నిలిస్తే, మరో మంత్రి జోగు రామన్న 67.50 శాతంతో రెండోస్థానంలో నిలిచారు. అప్పటి సర్వేలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కేవలం 17.10 శాతం ప్రజల మద్ధతు మాత్రమే పొందారు.
ఈసారి ఈ లెక్కలు తిరగబడ్డాయి. తొలిసర్వేలో మూడోస్థానంలో ఉన్న కోనేరు కోనప్ప తన పనితీరును మరింత మెరుగుపరుచుకొని 70.90 శాతం ప్రజల మద్ధతుతో తొలిస్థానంలో నిలిచారు. ఇంద్రకరణ్‌రెడ్డికి ఈసారి సర్వేలో 58.40 శాతం మద్ధతు లభించగా, మరో మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖలకు 39.90 శాతం చొప్పున ప్రజల మద్ధతు లభించింది. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తొలి సర్వేలో 48.50 శాతం పనితీరుతో కొంత మెరుగ్గా ఉండగా, ఈసారి అది 32.70 శాతంతో చివరి స్థానానికి పడిపోయింది.
అభివృద్ధి పనులతో ప్రజల్లో నిలవాలి : సీఎం కేసీఆర్
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనస్సులో నిలవడం ద్వారా చిరస్థాయిగా పేరు ప్రఖ్యాతులు పొందాలని సీఎం కేసీఆర్ సూచించారు. బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పది మంది ఎమ్మెల్యేల పనితీరుపై తాను నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించిన సీఎం 60 శాతానికి పైగా ప్రజల మద్ధతు పొందిన ఎమ్మెల్యేలను అభినందించారు. మిగతా వారు కూడా పనితీరు మెరుగుపరుచుకొని ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలన్నారు. ప్రజల మద్ధతే పనితీరుకు కొలమానమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టుల పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.