ఔను.. ఇక్కడి నుంచే ఆయన...
రాయవరం : ‘ఐతే ఓకే’ అనే డైలాగ్ ఆయన సినీ జీవితాన్ని మలుపునిచ్చింది. ‘ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రంలోని ఈ డైలాగ్‌ను మరువని సినీ ప్రేక్షకులు కొండవలస లక్ష్మణరావును చిరకాలం గుర్తుంచుకుంటారు. నాటకరంగంలో స్టేజి ఆర్టిస్ట్‌గా ఉన్న కొండవలస ఆ సినిమా నుంచే హాస్యనటుడుగా సినీ ప్రస్థానం మొదలెట్టారు. ఆయన సినీ జీవితానికి బీజం పడింది ఈ జిల్లాలోనే అని చెప్పవచ్చు.
ఆయనను గుర్తించింది దర్శకుడు వంశీయే..
ద్రాక్షారామలో నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో అల్లదే.. మా ఊరండీ అనే నాటకం 2001లో ప్రదర్శించారు. ఆ నాటకాన్ని సినీ దర్శకుడు వంశీ తిలకించారు. ‘నాటకం నచ్చలేదు.. కానీ నీ నటన బాగుంది’ అని కితాబిచ్చి వంశీ వెళ్లిపోయినట్లుగా కొండవలస పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తన నటనతో వంశీ మనోఫలకంపై ముద్ర వేసుకున్న కొండవలసకు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా కొండవలస సినీ జీవితానికి ద్రాక్షారామ వేదికైందని చెప్పవచ్చు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ, నటనలో తనకంటూ ఒక ప్రత్యేకశైలిని ఏర్పరచుకోవడంతో పాటు ‘ఐతే..ఓకే’ అనే మేనరిజం జనం నోళ్లలో నానిపోయేలా ఆయన నటించారు.
గోదావరితో అనుబంధం
కొండవలస లక్ష్మణరావు నటించిన పలు చిత్రాలు జిల్లాలో చిత్రీకరించారు. ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా పాటల చిత్రీకరణ రాజమండ్రి, పోలవరంలో సాగాయి. ఆ సమయంలో కొండవలస ఇక్కడకు వచ్చారు. తర్వాత జిల్లాలో చిత్రీకరించిన కబడ్డీ కబడ్డీ, దొంగరాముడు అండ్ పార్టీ తదితర చిత్రాల్లో కొండవలస నటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు గోదావరి ప్రాంతంతో అనుబంధం ఏర్పడింది. సినిమా షూటింగ్‌లకే కాకుండా జిల్లాలో జరిగిన అనేక నాటక ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా వచ్చారు.
దాతృత్వానికీ ధనికుడే..
వాస్తవానికి మధ్య తరగతి కుటుంబానికి చెందిన కొండవలస దాతృత్వానికి ధనికుడని చెప్పవచ్చు. జిల్లాలో పలు నాటక పరిషత్‌లకు హాజరైన సందర్భంలో ఆయన పేద కళాకారులకు నగదు బహుమతులు అందజేసి, సత్కరించారు. రాయవరంలో వీఎస్‌ఎం నాటక కళాపరిషత్ ద్వారా నిర్వహించే నాటక పోటీల సందర్భంగా ప్రతి ఏటా ఆయన పేద వృద్ధ కళాకారులకు నగదు బహుమతులు అందజేసేవారు.
ఏసురాజు పెసరట్టు ఆయనకు ఇష్టం
ఆత్రేయపురం : గోదావరి తీరాన షూటింగ్ జరిగిన సమయంలో ఆత్రేయపురం కాలువ రేవులో ఉన్న ఏసురాజు హోటల్‌కు కొండవలస వెళ్లేవారు. అక్కడ పెసరట్టు ఉప్మా అంటే కొండవలసకు ఎంతో ఇష్టం ఏర్పడింది. షూటింగ్ సమయంలో సరదాగా వచ్చి, తృప్తిగా పెసరట్టు తిని వెళ్లేవారని ఏసురాజు తెలిపారు. కళావాణి సంస్థ అధ్యక్షుడు సఖినేటి రామకృష్ణంరాజుకు కొండవలసతో మంచి సంబంధాలున్నాయి. గోపి గోపికా గోదావరి, బెండు అప్పారావు ఆర్‌ఎంపీ, సరదాగా కాసేపు, కత్తి పద్మారావు తదితర సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్లో కొండవలసతో కలిసి సఖినేటి నటించారు. రావులపాలెం కేంద్రంగా నిర్వహిస్తున్న సీఆర్‌సీ నాటక కళా పరిషత్‌లో ప్రతిఏటా పేద కళాకారులను సత్కరించి, రూ.2 వేల నగదును కొండవలస అందజేసేవారు.
మూర్తీభవించిన మానవత్వం
కొండవలస లక్ష్మణరావు నటుడే కాదు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి. ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో భార్యాభర్తలుగా కలిసి నటించాం. అంతకు ముందు పరిషత్‌ల ద్వారా పలు నాటకాల్లో నటించాం. మంచి వ్యక్తిత్వం కలిగిన లక్ష్మణరావు ఎంతో మంది కళాకారులకు తన శక్తికొద్దీ సాయపడ్డారు.
- వై.సరోజ, సినీ నటి, ద్రాక్షారామ
నాటకమంటే ప్రాణం
నాటకరంగం నుంచి సినీ రంగంలో ప్రవేశించినా.. ఆయన నాటక రంగాన్ని వీడలేదు. కళాపరిషత్‌లు నాటక పోటీలకు ఆహ్వానిస్తే తప్పనిసరిగా వీలుచూసుకుని హాజరయ్యేవారు. రాయవరంలో కళాపరిషత్‌కు కూడా కొండవలస వచ్చి తన సూచనలు, సలహాలు ఇవ్వడం మర్చిపోలేం.
- మంతెన అచ్యుతరామరాజు, వీఎస్‌ఎం నాటక కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి, రాయవరం