Kondavalasa lakshmana rao
-
కొండవలసకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: ప్రముఖ సినీ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు(69) అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ బల్కంపేటలోని ఈఎస్ఐ హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు. శ్రీనగర్‌కాలనీలోని ఆయన స్వగృహం నుంచి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో శ్మశానవాటికకు తీసుకువచ్చారు. కొండవలస చితికి కుమారుడు మణీధర్ నిప్పంటించారు. కుటుంబసభ్యులు, బంధువులు, సినీప్రముఖులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అమెరికాలో ఉన్న కొండవలస కుమార్తె మాధురిప్రియ రాక ఆలస్యం కావడంతో భౌతికకాయాన్ని శ్రీనగర్‌కాలనీ నాగార్జుననగర్‌లోని తన నివాసంలో ఉంచారు. గురువారం కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలను జరిపించారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కొండవలస తమ మధ్య లేకపోవడం తీరనిలోటని పలువురు సినీ ప్రముఖులు అన్నారు. అంత్యక్రియల్లో సినీ ప్రముఖులు తనికెళ్ళ భరణి, శివాజీరాజా, కోడి రామకృష్ణ, ఎల్బీ శ్రీరాం, చలపతిరావు, కాదంబరి కిరణ్, వైజాగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొండవలసకు ఒక కుమర్తె, కుమారుడు ఉన్నారు. -
కొండవలస నా ఆత్మబంధువు
-నట శిక్షకుడు సత్యానంద్ విశాఖపట్నం : ప్రముఖ రంగస్థల, సినీ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు నా ఆత్మబంధువుని, అలాంటి హాస్యప్రియున్ని కోల్పోవడం చాలా విచారకరమని సినీ దర్శకుడు, స్టార్‌మేకర్ ఎల్. సత్యానంద్ పేర్కొన్నారు. లక్ష్మణరావు మరణ వార్త తెలియగానే ఆవేదనకు గురయ్యానన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ లక్ష్మణరావు మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు నాటక రంగంలో ఆయనతో కలసి ప్రయాణం చేసానన్నారు. ప్రముఖ నాటక రచయిత అత్తిలి కృష్ణయ్య రచించిన ‘యుగ సంధ్య’అనే నాటికలో లక్ష్మణరావు కొర్లలయ్య పాత్ర ప్రదర్శిస్తే తాను బాలనటుడుగా రాముడి పాత్ర ప్రదర్శించానని తెలిపారు. అప్పట్లో లక్ష్మణరావు పోర్టులో ఉద్యోగం చేస్తున్న సమయంలో కృష్ణయ్య నాట్య భారతి సంస్థ ద్వారా లక్ష్మణరావుతో కలసి 20 నాటికలకు పైగా ప్రదర్శించామన్నారు. తూర్పు లేఖలు, యుగసంధ్య, దారితప్పిన ఆకలి, సారాంశం, టామీ టామీ, నిజం, వంటి ప్రాచుర్యం పొందిన నాటికల్లో ఆయనతో కలిసి నటించానని, అలాగే కొండవలస లక్ష్మణరావు స్వర రచనలో ‘స్వార్థం బలితీసుకొంది’అనే నాటకానికి తాను దర్శకత్వం వహించి ‘రామదాసు’ పాత్ర పోషించానన్నారు. తాను కూడా ఆ నాటికతోనే పాపులర్ అయ్యానని పేర్కొన్నారు. ఆ తర్వాత కొండవలస లక్ష్మణరావు కళా లహరి సంస్థ ద్వారా ప్రముఖ రంగస్థల, సినీ రచయితలు ఆకెళ్ల సూర్యానారాయణ, కాశీవిశ్వనాథ్‌తో కలసి పాపులర్ అయ్యారని తెలిపారు. తూర్పు లేఖల నాటికలో తాను సూరయ్య పాత్ర (80ఏళ్ల వయస్సు ముసలివాడిగా)ను, లక్ష్మణరావు తన కొడుకుగా (చుక్కడు)పాత్రలో నటించి మెప్పించామని చెబుతూ లక్ష్మణరావుతో తనకు గల ఆత్మీయ బంధాన్ని స్మరించుకున్నారు. -
ఔను.. ఇక్కడి నుంచే ఆయన...
రాయవరం : ‘ఐతే ఓకే’ అనే డైలాగ్ ఆయన సినీ జీవితాన్ని మలుపునిచ్చింది. ‘ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రంలోని ఈ డైలాగ్‌ను మరువని సినీ ప్రేక్షకులు కొండవలస లక్ష్మణరావును చిరకాలం గుర్తుంచుకుంటారు. నాటకరంగంలో స్టేజి ఆర్టిస్ట్‌గా ఉన్న కొండవలస ఆ సినిమా నుంచే హాస్యనటుడుగా సినీ ప్రస్థానం మొదలెట్టారు. ఆయన సినీ జీవితానికి బీజం పడింది ఈ జిల్లాలోనే అని చెప్పవచ్చు. ఆయనను గుర్తించింది దర్శకుడు వంశీయే.. ద్రాక్షారామలో నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో అల్లదే.. మా ఊరండీ అనే నాటకం 2001లో ప్రదర్శించారు. ఆ నాటకాన్ని సినీ దర్శకుడు వంశీ తిలకించారు. ‘నాటకం నచ్చలేదు.. కానీ నీ నటన బాగుంది’ అని కితాబిచ్చి వంశీ వెళ్లిపోయినట్లుగా కొండవలస పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తన నటనతో వంశీ మనోఫలకంపై ముద్ర వేసుకున్న కొండవలసకు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా కొండవలస సినీ జీవితానికి ద్రాక్షారామ వేదికైందని చెప్పవచ్చు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ, నటనలో తనకంటూ ఒక ప్రత్యేకశైలిని ఏర్పరచుకోవడంతో పాటు ‘ఐతే..ఓకే’ అనే మేనరిజం జనం నోళ్లలో నానిపోయేలా ఆయన నటించారు. గోదావరితో అనుబంధం కొండవలస లక్ష్మణరావు నటించిన పలు చిత్రాలు జిల్లాలో చిత్రీకరించారు. ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా పాటల చిత్రీకరణ రాజమండ్రి, పోలవరంలో సాగాయి. ఆ సమయంలో కొండవలస ఇక్కడకు వచ్చారు. తర్వాత జిల్లాలో చిత్రీకరించిన కబడ్డీ కబడ్డీ, దొంగరాముడు అండ్ పార్టీ తదితర చిత్రాల్లో కొండవలస నటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు గోదావరి ప్రాంతంతో అనుబంధం ఏర్పడింది. సినిమా షూటింగ్లకే కాకుండా జిల్లాలో జరిగిన అనేక నాటక ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా వచ్చారు. దాతృత్వానికీ ధనికుడే.. వాస్తవానికి మధ్య తరగతి కుటుంబానికి చెందిన కొండవలస దాతృత్వానికి ధనికుడని చెప్పవచ్చు. జిల్లాలో పలు నాటక పరిషత్‌లకు హాజరైన సందర్భంలో ఆయన పేద కళాకారులకు నగదు బహుమతులు అందజేసి, సత్కరించారు. రాయవరంలో వీఎస్ఎం నాటక కళాపరిషత్ ద్వారా నిర్వహించే నాటక పోటీల సందర్భంగా ప్రతి ఏటా ఆయన పేద వృద్ధ కళాకారులకు నగదు బహుమతులు అందజేసేవారు. ఏసురాజు పెసరట్టు ఆయనకు ఇష్టం ఆత్రేయపురం : గోదావరి తీరాన షూటింగ్ జరిగిన సమయంలో ఆత్రేయపురం కాలువ రేవులో ఉన్న ఏసురాజు హోటల్‌కు కొండవలస వెళ్లేవారు. అక్కడ పెసరట్టు ఉప్మా అంటే కొండవలసకు ఎంతో ఇష్టం ఏర్పడింది. షూటింగ్ సమయంలో సరదాగా వచ్చి, తృప్తిగా పెసరట్టు తిని వెళ్లేవారని ఏసురాజు తెలిపారు. కళావాణి సంస్థ అధ్యక్షుడు సఖినేటి రామకృష్ణంరాజుకు కొండవలసతో మంచి సంబంధాలున్నాయి. గోపి గోపికా గోదావరి, బెండు అప్పారావు ఆర్ఎంపీ, సరదాగా కాసేపు, కత్తి పద్మారావు తదితర సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్లో కొండవలసతో కలిసి సఖినేటి నటించారు. రావులపాలెం కేంద్రంగా నిర్వహిస్తున్న సీఆర్సీ నాటక కళా పరిషత్‌లో ప్రతిఏటా పేద కళాకారులను సత్కరించి, రూ.2 వేల నగదును కొండవలస అందజేసేవారు. మూర్తీభవించిన మానవత్వం కొండవలస లక్ష్మణరావు నటుడే కాదు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి. ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో భార్యాభర్తలుగా కలిసి నటించాం. అంతకు ముందు పరిషత్‌ల ద్వారా పలు నాటకాల్లో నటించాం. మంచి వ్యక్తిత్వం కలిగిన లక్ష్మణరావు ఎంతో మంది కళాకారులకు తన శక్తికొద్దీ సాయపడ్డారు. - వై.సరోజ, సినీ నటి, ద్రాక్షారామ నాటకమంటే ప్రాణం నాటకరంగం నుంచి సినీ రంగంలో ప్రవేశించినా.. ఆయన నాటక రంగాన్ని వీడలేదు. కళాపరిషత్‌లు నాటక పోటీలకు ఆహ్వానిస్తే తప్పనిసరిగా వీలుచూసుకుని హాజరయ్యేవారు. రాయవరంలో కళాపరిషత్‌కు కూడా కొండవలస వచ్చి తన సూచనలు, సలహాలు ఇవ్వడం మర్చిపోలేం. - మంతెన అచ్యుతరామరాజు, వీఎస్ఎం నాటక కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి, రాయవరం -
అయితే... ఓకే!
హిట్ క్యారెక్టర్ సుడి తిరగడమంటే ఇదే. రిటైరైపోయి కూర్చున్న కొండవలస లక్ష్మణరావును ఒకే ఒక్క పాత్ర సూపర్ కమెడియన్‌ను చేసేసింది. ఈ 13 ఏళ్లలో వందల పాత్రలు పోషించిన కొండవలసకు మొదటే దొరికిన బంగారు కొండ ఈ పొట్రాజు పాత్ర. ‘నేనొప్పుకోను... అయితే ఓకే...’ అంటూ కొండవలస ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో చేసిన వాయిస్ కామెడీని అనుస(క)రించని వాళ్లు లేరని చెబితే... మీకూ ఓకే కదా! సినిమా పేరు : ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు (2002) డెరైక్ట్ చేసింది : వంశీ సినిమా తీసింది : వల్లూరిపల్లి రమేశ్ మాటలు రాసింది : శంకరమంచి పార్థసారథి అతని పేరు సుబ్బరాజే కానీ, అందరూ పొట్రాజు అని పిలుస్తుంటారు. అలాగని పొట్టిగా ఏం ఉండడు. సన్నగా రివటలా ఉంటాడు. రివట రాజు అంటే బాగుండేదేమో! ఈ పొట్రాజు ఇంటిముందు ఎప్పుడూ వచ్చే పోయే జనాలే. అలాగని బాగా పాపులరనుకునేరు. ‘అప్పు’లర్. అంటే అప్పులు బాగా చేసేస్తుంటాడన్నమాట. వసూలు చేసుకోవడానికొచ్చేవాళ్లు, కొత్తగా అప్పిచ్చేవాళ్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కొత్త వందరూపాయల నోటులాగా తళతళలాడిపోతూ ఉంటుంది. ఈ పొట్రాజు అప్పుల గురించి రాస్తే నవలవుతుంది. తీస్తే సినిమా అవుతుంది. అతగాడి పెళ్లాంతో చెప్తే గొడవవుతుంది. ఈ పొట్రాజుకి ఒక్కగానొక్క పెళ్లాం. పేరు సరోజిని. గొట్టాల బిజినెస్సు. గొట్టమంటే ఇనుప గొట్టమో, ప్లాస్టిక్‌కు గొట్టమో అనుకునేరు. మీరు భలేటోళ్లే. అవి తినే గొట్టాలు. కొంతమంది పనోళ్లను పెట్టుకుని పాపం ఆవిడే సంసారాన్ని ఈదుకుంటూ వస్తోంది. ఏం చేస్తుంది మరి... మొగుడేమో ఖాళీగా పనిపాటూ లేకుండా తిరుగుతూ ఉంటే. దానికితోడు ప్రతిదానికీ ‘నేనొప్పుకోను’ అంటూ అడ్డు తగులుతూ ఉంటాడు. సరోజిని ఒక్కటిచ్చుకున్నాక ‘అయితే... ఓకే’ అంటాడు. పోనీ... అలాగని తిన్నగా ఉంటాడా అంటే అదీ లేదు. ఏదో ఒక కోతి పని చేసో, వెదవ గొప్పలకు పోయో సరోజిని గల్లాపెట్టె ఖాళీ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్... ఓ కొరియరబ్బాయ్ వచ్చి ‘‘ఇక్కడ రాజుగారెవరండీ?’’ అనడిగాడు వినయంగా. ‘‘ఇక్కడ హోల్ అండ్ సోల్ రాజుని నేనే. ఏంటి విషయం?’’ అడిగాడు మన పొట్రాజు. ‘‘మీకోసం మీ ఫ్రెండు కృష్ణంరాజుగారు కేక్ పంపించారండీ’’ అనగానే, పొట్రాజు చాలా సంబరపబడి ‘‘అయితే నాకే’’ అని ఆ పార్శిల్ లాక్కున్నంత పనిచేశాడు. ‘‘కృష్ణంరాజని నాకు క్లోజ్‌ఫ్రెండ్. ఇద్దరం చిన్నప్పుడు గూటీబిళ్ల ఆడుకునేవాళ్లం’’ అని గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. బెల్లం చుట్టూ మూగిన ఈగల్లాగా చుట్టుపక్కల పోర్షనోళ్లంతా చేరి కేక్‌ని కసాబిసా తినేశారు. ఈ తినుడు ప్రక్రియ ఇలా జరుగుతూ... జరుగుతూ ఉండగా కొరియరబ్బాయ్ కంగారుగా బింగారుగా వచ్చేశాడు. ‘‘అయ్యో... ఆ కేక్ మీక్కాదు. పక్క వీధిలో రాజుగారికి. అబద్దం చెప్పి కేక్ అంతా తినేస్తారా... ఆయ్’’ అంటూ పొట్రాజు చొక్కా పట్టుకున్నాడు. ఆరొందలిస్తే తప్ప వదల్లేదు వాడు. సరోజినికి చిర్రెత్తుకొచ్చి మొగుణ్ణి ఒక్క తాపు తన్నింది. ‘‘అయితే ఓకే...’’ అంటూ బురదలో బోర్లా పడ్డాడు పొట్రాజు. ఇలా ఉంటాయండీ... మన పొట్రాజుగారి చేష్టలు. ఇందులో పెద్ద ఇదేముందనుకుంటున్నారా? అయితే మీకింకో సీన్ చూపించాలి. అప్పుడుగాని అర్థం కాదు... పొట్రాజు ఫుల్ సైజ్ పిక్చరు. ఆ కాలనీలో సత్యానందమని ఓ పెద్దమనిషి ఉన్నాడు. పేరుకి పెద్దమనిషి కానీ, చేసేవన్నీ చిన్న పనులే... చిల్లర పనులే. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసే స్వాతి రూమ్‌లో, రహస్యంగా ఆమెకు తెలీకుండా నైట్ వాచ్‌మేన్‌గా పని చేసే అనిల్‌ని అద్దెకు దించుతాడీ సత్యానందం. రూమ్‌లో పగలు అనిల్ ఉంటాడు. రాత్రిళ్లు స్వాతి ఉంటుంది. స్వాతి రెంట్ ఓనర్‌కి. అనిల్ రెంట్ సత్యానందానికి. అన్నీ ఇలాంటి తిరకాసులే చేస్తుంటాడతను.ఆ రోజు వంట్లో బాగోక స్వాతి ఎర్లీగా రూమ్కొచ్చేస్తుంది. ఆ టైమ్‌కి రూమ్‌లో అనిల్ గుర్రుపెట్టి నిద్దరోతూ ఉంటాడు.సత్యానందం, అతని బామ్మర్ది చిట్టిబాబు ఓ గొప్ప అవుడియా వేసి అనిల్‌ని గోనె సంచిలో దాచేస్తారు. అందరికీ ఆ గోనె సంచెలో పనసకాయలున్నాయని చెబుతారు. కరెస్టుగా అదే టైమ్‌లో ఎంటరయ్యాడు పొట్రాజు.చిట్టిబాబుకి ఇంకో అవుడియా వచ్చింది. వెంటనే అప్లయ్ చేసి పారేశాడు. పొట్రాజుకి ఓ బంపర్ ఆఫరిచ్చాడు. 400 రూపాయలకే బ్రహ్మాండమైన పనసకాయలు. దాంతో సరోజిని దగ్గర తెగ గప్పాలు కొట్టేసి గంటలో 800 తీసుకొచ్చి ఇస్తానని తెగ బిల్డప్పులిచ్చి... డబ్బులు తెచ్చి చిట్టిబాబుకిచ్చాడు పొట్రాజు. కట్ చేస్తే - పనసకాయల్లేవ్. ఎమ్టీ గోనెసంచె ఎక్కిరిస్తోంది. లబోదిబోమన్నాడు పొట్రాజు. సరోజిని మళ్లీ తన కాలికి పని చెప్పింది. ‘‘నేనొప్పుకోను... నేనొప్పుకోను’’ అంటూ ఎగిరిపడి... ఫైనల్‌గా ‘‘అయితే ఓకే’’ అన్నాడు పొట్రాజు. అయినా బుద్ధి రాలేదు పొట్రాజుకి. ఉంగరం రిపేరు చేయించుకురమ్మని కంసాలి దగ్గరకు పంపించింది సరోజిని. దార్లో ఆ ఉంగరాన్ని చిట్టిబాబు లాగేసుకుని, ‘‘నాకివ్వాల్సిన డబ్బుకి చెల్లు’’ అన్నాడు. పొట్రాజుకి గుండెల్లో రాయి పడింది. సరోజిని మళ్లీ తన్నడం ఖాయం. అందుకే గూట్లో పెట్టానని, ఎవరో దొంగిలించి ఉంటారని అబద్దమాడేశాడు. పాపం పిచ్చి సరోజిని నమ్మేసింది. కానీ ఇక్కడ కథ వేరే మలుపు తిరిగింది. చిట్టిబాబులో పరివర్తన కలిగి ఉంగరం వెనక్కిచ్చేద్దామని వచ్చాడు. దాంతో పొట్రాజు అడ్డంగా బుక్కయిపోయాడు. ఇంకేముంది... మళ్లీ సేమ్ సీన్. ఆమె ఎగిరి తన్నడం... అతను ఎక్కడో పడటం... ఈసారి పొట్రాజు బుర్ర ఐమాక్స్ లెవెల్లో పనిచేసింది. ఉంగరం నుంచి నక్లెస్ దాకా డెవలప్ అయిపోయాడు.సరోజిని బీరువాలో పెట్టిన నెక్లెస్ కొట్టేసి సేటు అప్పు తీర్చేద్దామని బయలుదేరాడు. అక్కడికెళ్లాక... సేటు గుడ్లురిమాక... నాలుగు తగిలించాక తెలిసింది... కాదు తేలింది... అది గిల్టు నెక్లెస్ అని. సేటు మనుషులు కనిపిస్తే చంపేసేట్టున్నారు. పాపం పొట్రాజుకి ఎక్కడ దాక్కోవాలో తెలియలేదు. అందుకే క్రిస్మిస్ తాతలాగా మారువేషం వేసుకుని తన ఇంటి చుట్టుపక్కలే సంచరిస్తున్నాడు. ఇక్కడ సరోజినీ ఏమో - రెండ్రోజులుగా భర్త కనబడక కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పొట్రాజు ఇక సీన్లోకి ఎంటరవుదామనుకునేసరికి - ‘గోపాలుడు- భూపాలుడు’... ‘రాముడు-భీముడు’... ‘హలో బ్రదర్’... ‘అదుర్స్’... సినిమాల్లోలాగా డబుల్ ఫోజింగ్లో ఇంకో పొట్రాజు ప్రత్యక్షమైపోయాడు. ‘‘ఈడెవడు... నాకు జిరాక్సులాగున్నాడు’’ అంటూ పొట్రాజు అగ్గగ్గలాడిపోయాడు. ఆ జిరాక్స్ గాడి మీద సరోజిని తెగ ప్రేమ ఒలకబోసేస్తోంది. తానే రియల్ మొగుణ్ణి అని చెప్పినా పొట్రాజుని పట్టించుకోవడం లేదు. పాపం... పొట్రాజు ఎలకల బోనులో ఇరుకున్న కోడిలాగా గిలగిల్లాడిపోయాడు.‘‘ఓరి దేవుడో... నా బతుకిలా అయిపోయింది. ఇక నేను బతికి లాభం లేదు’’ అని పొట్రాజు క్రై చేస్తూ... పిట్టగోడెక్కి సూసైడింగ్కి ట్రై చేస్తున్న టైమ్‌లో సత్యానందం ఎంటరయ్యాడు. ‘‘ఒరేయ్ పొట్రాజు... ఈడు నిజంగా జిరాక్సే. నీకు బుద్ధి రావాలనే ఇలా చేశాం’’ అంటూ ఆ జిరాక్సుగాడి ముఖం మీద నుంచి మాస్క్ తీసేశారు. దాంతో పొట్రాజు సికింద్రాబాద్ సిటీబస్సులో సీటు దొరికినంతగా సంబరపడిపోయాడు.సరోజినిని దగ్గరకు తీసుకున్నాడు. భర్త ప్రేమ చూసి సరోజిని కూడా పులకించిపోయింది. ‘‘మూడ్రోజుల నుంచి డూప్లికేట్గాడు ఇంట్లోనే ఉన్నాడుగా...’’ అంటూ సరోజిని చెవిలో ఏదో గొణిగాడు పొట్రాజు. టీవీ సీరియల్ మధ్యలో పవర్‌కట్ వస్తే ఎంత కోపం వస్తుందో, సరోజినికి అంత కోపం వచ్చేసింది. ఒక్క తన్ను తన్నింది. పొట్రాజు బొక్క బోర్లా పడ్డాడు. కుయ్యో... మొర్రో..! ఇంతకూ సరోజిని చెవిలో పొట్రాజు ఏమన్నాడంటారు?అయ్యో... మేం చెప్పకూడదు... మీరు వినకూడదు. సెన్సార్ కట్. అయితే మీకు ఓకే కదా! - పులగం చిన్నారాయణ -
ఐతే ఓకే... జీవితాన్నే మార్చేసింది...
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఒక టీవీ ప్రకటన...కానీ ఒక డైలాగ్ జీవితాన్నే మార్చేసింది. ఇది కొండవలస మాట.....‘ఐతే ఓకే’..... ఇప్పుడు ఈ మాట ఎవరు అన్నా సరే మనకు ‘ఔను...వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా గుర్తొస్తుంది. అంత పాపులర్ అయిన డైలాగ్ ఇది. అలాగే కొండవలస లక్ష్మణరావు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కూడా అదే డైలాగ్. పుట్టినది శ్రీకాకుళం అయినా...ఎక్కువ కాలం నివసించినది మాత్రం మన విశాఖపట్నంలోనే....విశాఖతో ఆయనకున్న అనుబంధాన్ని సిటీప్లస్‌తో పంచుకున్నారు. పుట్టింది శ్రీకాకుళం నేను శ్రీకాకుళం జిల్లాలో పుట్టాను. నాన్నగారు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. అమ్మ గృహిణి. 9వ తరగతి వరకు శ్రీకాకుళంలో చదువుకున్నాను. 1959లో ఫస్ట్ టైం ఇక్కడకు వచ్చాను. ఏవీఎన్ కాలేజీలో డిగ్రీ చేశాను. ఆ తర్వాత 1967లో విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి 2001 వరకు వైజాగ్‌లోనే ఉన్నాను. ఎన్నో ఏరియాలు తిరిగా... నేను వచ్చిన కొత్తలో రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. 1970 వరకు అక్కడే ఉన్నాం. ఆ తర్వాత అక్కయ్యపాలెంలో అద్దె ఇంట్లోకి మారిపోయాం.పోర్టులో ఉద్యోగం వచ్చిన తర్వాత అందులో ఉన్నాం. నేను చాలా ఏరియాలు తిరిగాను. ఎక్కువగా తిరిగింది మాత్రం దొండపర్తి , అక్కయ్యపాలెం, అల్లిపురం....తర్వాత మధురవాడలో ఇల్లు కట్టుకుని వెళ్లిపోయాం. కానీ పిల్లల చదువులకు ఇబ్బంది అవుతోందని పోర్టు క్వార్టర్స్‌కు వచ్చేశాను. అక్కడే ఉంటూ 2000లో వీఆర్ఎస్ తీసుకున్నాను. అమ్మాయికి పెళ్లి చేసేసి హైదరాబాద్ వెళ్లిపోయాం. ఒక్క ఫోన్ కాల్ నేను సినిమాల్లోకి వెళ్లాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఆ ఐడియా కూడా లేదు. 1961 నుంచి 2001 వరకు నేను ఒక స్టేజ్ ఆర్టిస్ట్‌ను. అలా సమయం ఉన్నప్పుడు స్టేజ్ షోస్ చేస్తూ ఉండేవాడిని.‘అల్లదే మా ఊరండి’ అనే నాటికను ఆకెళ్ల సూర్యనారాయణ గారు రాశారు. ద్రాక్షారామం నాటక కళాపరిషత్‌లో ఆ నాటిక ప్రద ర్శిస్తున్నప్పుడు వంశీ గారు చూశారు. తర్వాత ఒకరోజు నాకు ఫోన్ చేసి ఇలా ఒక సినిమా చేయబోతున్నాను. నీకు ఒక క్యారెక్టర్ ఇస్తాను..యాక్ట్ చేస్తావా అని అడిగారు. నాకు కూడా ఆఫర్ నచ్చి చేస్తాను అని చెప్పాను. అలా నాకు ఆ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు ‘కళ్లు’ అనే సినిమాలో ఒక రౌడీ క్యారెక్టర్ చేశాను. బస్ టికెట్ బేడ... నేను విశాఖ వచ్చిన కొత్తల్లోనే నేషనల్ హైవే, నాలుగు రోడ్లు ఫార్మేషన్ జరుగుతూ ఉంది. అవన్నీ చూశాను. విశాఖపట్నంలో ఎక్కువగా విలేజస్ ఉండడం వలన బాగా డెవ లప్ అయ్యింది. ఇప్పుడు ఉన్న వన్‌టౌన్ అప్పటికే డెవలప్ అయిన ప్రాంతం. నేను ఏవీఎన్ కాలేజీకి అల్లిపురం నుంచి నడిచే వెళ్లేవాళ్లం. అప్పటికి అది డెవలప్ అవ్వలేదు కానీ కొన్ని ఇళ్లు మాత్రం ఉండేవి. అప్పట్లో ‘బేడ’ ఇస్తే ఏవీఎన్ కాలేజీకి బస్ ఉండేది. కానీ అది కూడా ఇవ్వలేని పొజీషన్లో ఉండేవాళ్లం అప్పట్లో. ఆశీల్‌మెట్ట జంక్షన్ ఇప్పుడున్నట్లు లేదు. పాత బస్టాండ్ ఒకటి ఉండేది. అప్పుడు కూడా... మేము 1968-69 టైంలో రైల్వే క్వార్టర్స్‌లో ఉన్న సమయంలో మొన్న వచ్చిన హుదూద్ తుఫాను లాంటిదే వచ్చింది. చాలా ఉధృతంగా వర్షాలు, వరదలు వచ్చాయి. అలాగే 1990లో శార దా నది పొంగి రైల్వే ట్రాక్స్ అన్నీ విరిగిపోయాయి. చాలా బీభత్సం అయ్యింది. సరిగ్గా అదే సమయంలో నేను టూర్‌కు వెళ్లి వస్తూ ఆ వరదల్లో చిక్కుకున్నాను. అన్నవరం నుంచి విశాఖపట్నం చేరుకోవడానికి 18 గంటలు పట్టింది. ఆర్టీసీ డ్రైవర్ ఎంతో చాకచక్యంతో మమ్మల్ని విశాఖపట్నం చేర్చారు. ఆ ఘటన నేను ఎప్పటికీ మరచిపోలేను. గజం రూ. 12 నేను ఇక్కడకు వ చ్చినప్పటికి గజం స్థలం 12 రూపాయలు ఉండేది. అది కూడా ఎక్కడో లోపల కాదు. అక్కయ్యపాలెంలో హైవేను ఆనుకుని ఉన్న స్థలం. మధురవాడ లో నేను ఇల్లు కట్టుకునే సమయానికి గజం రూ.35 కు కొనుక్కున్నాం. ఇప్పుడు అదే స్థలం 300 గజాలు 70 లక్షల పైనే ఉంది. అదే టాప్ నేను ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాను. ఎన్ని సినిమాలు చేసినా సరే ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా టాప్‌లో ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యింది కానీ ఇప్పటికీ ‘అయితే ఓకే’ అనే డైలాగ్ అందరికీ ఊత పదంగా మారిపోయింది. తర్వాత చేసిన నిజం, ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాలి, ఎవడి గోల వాడిది, శ్రీకృష్ణ 2006 ఇలా అన్ని సినిమాలు చాలా ఇష్టం. ప్రస్తుతం 6 సినిమాలలో నటిస్తున్నాను. ఏ సినిమాకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు.