అయితే... ఓకే!
హిట్ క్యారెక్టర్
సుడి తిరగడమంటే ఇదే. రిటైరైపోయి కూర్చున్న కొండవలస లక్ష్మణరావును ఒకే ఒక్క పాత్ర సూపర్ కమెడియన్‌ను చేసేసింది. ఈ 13 ఏళ్లలో వందల పాత్రలు పోషించిన కొండవలసకు మొదటే దొరికిన బంగారు కొండ ఈ పొట్రాజు పాత్ర. ‘నేనొప్పుకోను... అయితే ఓకే...’ అంటూ కొండవలస ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో చేసిన వాయిస్ కామెడీని అనుస(క)రించని వాళ్లు లేరని చెబితే... మీకూ ఓకే కదా!
సినిమా పేరు : ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు (2002)
డెరైక్ట్ చేసింది : వంశీ
సినిమా తీసింది : వల్లూరిపల్లి రమేశ్
మాటలు రాసింది : శంకరమంచి పార్థసారథి
అతని పేరు సుబ్బరాజే కానీ, అందరూ పొట్రాజు అని పిలుస్తుంటారు. అలాగని పొట్టిగా ఏం ఉండడు. సన్నగా రివటలా ఉంటాడు. రివట రాజు అంటే బాగుండేదేమో! ఈ పొట్రాజు ఇంటిముందు ఎప్పుడూ వచ్చే పోయే జనాలే. అలాగని బాగా పాపులరనుకునేరు. ‘అప్పు’లర్. అంటే అప్పులు బాగా చేసేస్తుంటాడన్నమాట. వసూలు చేసుకోవడానికొచ్చేవాళ్లు, కొత్తగా అప్పిచ్చేవాళ్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కొత్త వందరూపాయల నోటులాగా తళతళలాడిపోతూ ఉంటుంది. ఈ పొట్రాజు అప్పుల గురించి రాస్తే నవలవుతుంది. తీస్తే సినిమా అవుతుంది. అతగాడి పెళ్లాంతో చెప్తే గొడవవుతుంది.
ఈ పొట్రాజుకి ఒక్కగానొక్క పెళ్లాం. పేరు సరోజిని. గొట్టాల బిజినెస్సు. గొట్టమంటే ఇనుప గొట్టమో, ప్లాస్టిక్కు గొట్టమో అనుకునేరు. మీరు భలేటోళ్లే. అవి తినే గొట్టాలు. కొంతమంది పనోళ్లను పెట్టుకుని పాపం ఆవిడే సంసారాన్ని ఈదుకుంటూ వస్తోంది. ఏం చేస్తుంది మరి... మొగుడేమో ఖాళీగా పనిపాటూ లేకుండా తిరుగుతూ ఉంటే. దానికితోడు ప్రతిదానికీ ‘నేనొప్పుకోను’ అంటూ అడ్డు తగులుతూ ఉంటాడు. సరోజిని ఒక్కటిచ్చుకున్నాక ‘అయితే... ఓకే’ అంటాడు. పోనీ... అలాగని తిన్నగా ఉంటాడా అంటే అదీ లేదు. ఏదో ఒక కోతి పని చేసో, వెదవ గొప్పలకు పోయో సరోజిని గల్లాపెట్టె ఖాళీ చేస్తూ ఉంటాడు.
ఫర్ ఎగ్జాంపుల్...
ఓ కొరియరబ్బాయ్ వచ్చి ‘‘ఇక్కడ రాజుగారెవరండీ?’’ అనడిగాడు వినయంగా. ‘‘ఇక్కడ హోల్ అండ్ సోల్ రాజుని నేనే. ఏంటి విషయం?’’ అడిగాడు మన పొట్రాజు. ‘‘మీకోసం మీ ఫ్రెండు కృష్ణంరాజుగారు కేక్ పంపించారండీ’’ అనగానే, పొట్రాజు చాలా సంబరపబడి ‘‘అయితే నాకే’’ అని ఆ పార్శిల్ లాక్కున్నంత పనిచేశాడు. ‘‘కృష్ణంరాజని నాకు క్లోజ్‌ఫ్రెండ్. ఇద్దరం చిన్నప్పుడు గూటీబిళ్ల ఆడుకునేవాళ్లం’’ అని గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు. బెల్లం చుట్టూ మూగిన ఈగల్లాగా చుట్టుపక్కల పోర్షనోళ్లంతా చేరి కేక్‌ని కసాబిసా తినేశారు. ఈ తినుడు ప్రక్రియ ఇలా జరుగుతూ... జరుగుతూ ఉండగా కొరియరబ్బాయ్ కంగారుగా బింగారుగా వచ్చేశాడు.
‘‘అయ్యో... ఆ కేక్ మీక్కాదు. పక్క వీధిలో రాజుగారికి. అబద్దం చెప్పి కేక్ అంతా తినేస్తారా... ఆయ్’’ అంటూ పొట్రాజు చొక్కా పట్టుకున్నాడు.
ఆరొందలిస్తే తప్ప వదల్లేదు వాడు.
సరోజినికి చిర్రెత్తుకొచ్చి మొగుణ్ణి ఒక్క తాపు తన్నింది.
‘‘అయితే ఓకే...’’ అంటూ బురదలో బోర్లా పడ్డాడు పొట్రాజు.
ఇలా ఉంటాయండీ... మన పొట్రాజుగారి చేష్టలు.
ఇందులో పెద్ద ఇదేముందనుకుంటున్నారా? అయితే మీకింకో సీన్ చూపించాలి. అప్పుడుగాని అర్థం కాదు... పొట్రాజు ఫుల్ సైజ్ పిక్చరు.
ఆ కాలనీలో సత్యానందమని ఓ పెద్దమనిషి ఉన్నాడు.
పేరుకి పెద్దమనిషి కానీ, చేసేవన్నీ చిన్న పనులే... చిల్లర పనులే.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే స్వాతి రూమ్‌లో, రహస్యంగా ఆమెకు తెలీకుండా నైట్ వాచ్‌మేన్‌గా పని చేసే అనిల్‌ని అద్దెకు దించుతాడీ సత్యానందం. రూమ్‌లో పగలు అనిల్ ఉంటాడు. రాత్రిళ్లు స్వాతి ఉంటుంది. స్వాతి రెంట్ ఓనర్‌కి. అనిల్ రెంట్ సత్యానందానికి. అన్నీ ఇలాంటి తిరకాసులే చేస్తుంటాడతను.ఆ రోజు వంట్లో బాగోక స్వాతి ఎర్లీగా రూమ్‌కొచ్చేస్తుంది. ఆ టైమ్‌కి రూమ్‌లో అనిల్ గుర్రుపెట్టి నిద్దరోతూ ఉంటాడు.సత్యానందం, అతని బామ్మర్ది చిట్టిబాబు ఓ గొప్ప అవుడియా వేసి అనిల్‌ని గోనె సంచిలో దాచేస్తారు. అందరికీ ఆ గోనె సంచెలో పనసకాయలున్నాయని చెబుతారు.
కరెస్టుగా అదే టైమ్‌లో ఎంటరయ్యాడు పొట్రాజు.చిట్టిబాబుకి ఇంకో అవుడియా వచ్చింది. వెంటనే అప్లయ్ చేసి పారేశాడు. పొట్రాజుకి ఓ బంపర్ ఆఫరిచ్చాడు. 400 రూపాయలకే బ్రహ్మాండమైన పనసకాయలు. దాంతో సరోజిని దగ్గర తెగ గప్పాలు కొట్టేసి గంటలో 800 తీసుకొచ్చి ఇస్తానని తెగ బిల్డప్పులిచ్చి... డబ్బులు తెచ్చి చిట్టిబాబుకిచ్చాడు పొట్రాజు. కట్ చేస్తే - పనసకాయల్లేవ్. ఎమ్టీ గోనెసంచె ఎక్కిరిస్తోంది. లబోదిబోమన్నాడు పొట్రాజు. సరోజిని మళ్లీ తన కాలికి పని చెప్పింది.
‘‘నేనొప్పుకోను... నేనొప్పుకోను’’ అంటూ ఎగిరిపడి... ఫైనల్‌గా ‘‘అయితే ఓకే’’ అన్నాడు పొట్రాజు. అయినా బుద్ధి రాలేదు పొట్రాజుకి. ఉంగరం రిపేరు చేయించుకురమ్మని కంసాలి దగ్గరకు పంపించింది సరోజిని. దార్లో ఆ ఉంగరాన్ని చిట్టిబాబు లాగేసుకుని, ‘‘నాకివ్వాల్సిన డబ్బుకి చెల్లు’’ అన్నాడు. పొట్రాజుకి గుండెల్లో రాయి పడింది. సరోజిని మళ్లీ తన్నడం ఖాయం. అందుకే గూట్లో పెట్టానని, ఎవరో దొంగిలించి ఉంటారని అబద్దమాడేశాడు. పాపం పిచ్చి సరోజిని నమ్మేసింది. కానీ ఇక్కడ కథ వేరే మలుపు తిరిగింది. చిట్టిబాబులో పరివర్తన కలిగి ఉంగరం వెనక్కిచ్చేద్దామని వచ్చాడు. దాంతో పొట్రాజు అడ్డంగా బుక్కయిపోయాడు.
ఇంకేముంది... మళ్లీ సేమ్ సీన్. ఆమె ఎగిరి తన్నడం... అతను ఎక్కడో పడటం...
ఈసారి పొట్రాజు బుర్ర ఐమాక్స్ లెవెల్లో పనిచేసింది. ఉంగరం నుంచి నక్లెస్ దాకా డెవలప్ అయిపోయాడు.సరోజిని బీరువాలో పెట్టిన నెక్లెస్ కొట్టేసి సేటు అప్పు తీర్చేద్దామని బయలుదేరాడు. అక్కడికెళ్లాక... సేటు గుడ్లురిమాక... నాలుగు తగిలించాక తెలిసింది... కాదు తేలింది... అది గిల్టు నెక్లెస్ అని. సేటు మనుషులు కనిపిస్తే చంపేసేట్టున్నారు. పాపం పొట్రాజుకి ఎక్కడ దాక్కోవాలో తెలియలేదు. అందుకే క్రిస్మిస్ తాతలాగా మారువేషం వేసుకుని తన ఇంటి చుట్టుపక్కలే సంచరిస్తున్నాడు. ఇక్కడ సరోజినీ ఏమో - రెండ్రోజులుగా భర్త కనబడక కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పొట్రాజు ఇక సీన్‌లోకి ఎంటరవుదామనుకునేసరికి - ‘గోపాలుడు- భూపాలుడు’... ‘రాముడు-భీముడు’... ‘హలో బ్రదర్’... ‘అదుర్స్’... సినిమాల్లోలాగా డబుల్ ఫోజింగ్‌లో ఇంకో పొట్రాజు ప్రత్యక్షమైపోయాడు.
‘‘ఈడెవడు... నాకు జిరాక్సులాగున్నాడు’’ అంటూ పొట్రాజు అగ్గగ్గలాడిపోయాడు. ఆ జిరాక్స్ గాడి మీద సరోజిని తెగ ప్రేమ ఒలకబోసేస్తోంది. తానే రియల్ మొగుణ్ణి అని చెప్పినా పొట్రాజుని పట్టించుకోవడం లేదు. పాపం... పొట్రాజు ఎలకల బోనులో ఇరుకున్న కోడిలాగా గిలగిల్లాడిపోయాడు.‘‘ఓరి దేవుడో... నా బతుకిలా అయిపోయింది. ఇక నేను బతికి లాభం లేదు’’ అని పొట్రాజు క్రై చేస్తూ... పిట్టగోడెక్కి సూసైడింగ్‌కి ట్రై చేస్తున్న టైమ్‌లో సత్యానందం ఎంటరయ్యాడు. ‘‘ఒరేయ్ పొట్రాజు... ఈడు నిజంగా జిరాక్సే. నీకు బుద్ధి రావాలనే ఇలా చేశాం’’ అంటూ ఆ జిరాక్సుగాడి ముఖం మీద నుంచి మాస్క్ తీసేశారు.
దాంతో పొట్రాజు సికింద్రాబాద్ సిటీబస్సులో సీటు దొరికినంతగా సంబరపడిపోయాడు.సరోజినిని దగ్గరకు తీసుకున్నాడు. భర్త ప్రేమ చూసి సరోజిని కూడా పులకించిపోయింది. ‘‘మూడ్రోజుల నుంచి డూప్లికేట్‌గాడు ఇంట్లోనే ఉన్నాడుగా...’’ అంటూ సరోజిని చెవిలో ఏదో గొణిగాడు పొట్రాజు. టీవీ సీరియల్ మధ్యలో పవర్‌కట్ వస్తే ఎంత కోపం వస్తుందో, సరోజినికి అంత కోపం వచ్చేసింది. ఒక్క తన్ను తన్నింది. పొట్రాజు బొక్క బోర్లా పడ్డాడు. కుయ్యో... మొర్రో..!
ఇంతకూ సరోజిని చెవిలో పొట్రాజు ఏమన్నాడంటారు?అయ్యో... మేం చెప్పకూడదు... మీరు వినకూడదు. సెన్సార్ కట్. అయితే మీకు ఓకే కదా!
- పులగం చిన్నారాయణ