కొండవలస నా ఆత్మబంధువు
-నట శిక్షకుడు సత్యానంద్
విశాఖపట్నం : ప్రముఖ రంగస్థల, సినీ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు నా ఆత్మబంధువుని, అలాంటి హాస్యప్రియున్ని కోల్పోవడం చాలా విచారకరమని సినీ దర్శకుడు, స్టార్‌మేకర్ ఎల్. సత్యానంద్ పేర్కొన్నారు. లక్ష్మణరావు మరణ వార్త తెలియగానే ఆవేదనకు గురయ్యానన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ లక్ష్మణరావు మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు నాటక రంగంలో ఆయనతో కలసి ప్రయాణం చేసానన్నారు.
ప్రముఖ నాటక రచయిత అత్తిలి కృష్ణయ్య రచించిన ‘యుగ సంధ్య’అనే నాటికలో లక్ష్మణరావు కొర్లలయ్య పాత్ర ప్రదర్శిస్తే తాను బాలనటుడుగా రాముడి పాత్ర ప్రదర్శించానని తెలిపారు. అప్పట్లో లక్ష్మణరావు పోర్టులో ఉద్యోగం చేస్తున్న సమయంలో కృష్ణయ్య నాట్య భారతి సంస్థ ద్వారా లక్ష్మణరావుతో కలసి 20 నాటికలకు పైగా ప్రదర్శించామన్నారు.
తూర్పు లేఖలు, యుగసంధ్య, దారితప్పిన ఆకలి, సారాంశం, టామీ టామీ, నిజం, వంటి ప్రాచుర్యం పొందిన నాటికల్లో ఆయనతో కలిసి నటించానని, అలాగే కొండవలస లక్ష్మణరావు స్వర రచనలో ‘స్వార్థం బలితీసుకొంది’అనే నాటకానికి తాను దర్శకత్వం వహించి ‘రామదాసు’ పాత్ర పోషించానన్నారు. తాను కూడా ఆ నాటికతోనే పాపులర్ అయ్యానని పేర్కొన్నారు.
ఆ తర్వాత కొండవలస లక్ష్మణరావు కళా లహరి సంస్థ ద్వారా ప్రముఖ రంగస్థల, సినీ రచయితలు ఆకెళ్ల సూర్యానారాయణ, కాశీవిశ్వనాథ్‌తో కలసి పాపులర్ అయ్యారని తెలిపారు. తూర్పు లేఖల నాటికలో తాను సూరయ్య పాత్ర (80ఏళ్ల వయస్సు ముసలివాడిగా)ను, లక్ష్మణరావు తన కొడుకుగా (చుక్కడు)పాత్రలో నటించి మెప్పించామని చెబుతూ లక్ష్మణరావుతో తనకు గల ఆత్మీయ బంధాన్ని స్మరించుకున్నారు.