
కొర్రపాడు’ను చుట్టుముట్టిన గండికోట జలాలు
కడప రూరల్ : గండికోటకు 12 టీఎంసీల నీరు రాకముందే ముద్దనూరు మండలం కొర్రపాడు గ్రామాన్ని జలాలు చుట్టుముట్టాయి. ఫలితంగా ఆ గ్రామంలో ఉన్న దాదాపు 500 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రధానంగా తాగునీరు కలుషితమైంది. దీంతో వారికి కాస్త స్వచ్ఛ నీరైనా తాగే వెసులుబాటు లేకపోయింది. ఫలితంగా ఆ గ్రామస్తులు చాలా మంది తట్టు, విష జ్వరాలు తదితర వ్యాధులతో మంచాన పడ్డారు. అలాగే చుట్టుముట్టిన నీళ్ల కారణంగా రాకపోకలు దాదాపుగా స్తంభించినట్లైంది. కాగా ఎక్కువ మంది ఇంటికి ఒకరిద్దరు చొప్పున విషజ్వరాల బారిన పడగా, అలాగే తట్టు బారిన పడిన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇటీవల ఈ గ్రామాన్ని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సాగునీటి సాధన సమితి జిల్లా నాయకులు చంద్రమౌళీశ్వర్‌రెడ్డి సందర్శించారు. గ్రామస్తుల ఆరోగ్య స్థితిగతులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు విన్నవించారు. ఆ మేరకు ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ముగ్గురు నర్సులు, ఒక వైద్యుడు వచ్చి వైద్య సేవలు అందించారు. అయితే వారి దగ్గర సరిపడ మందులు లేకపోవడంతో ఉన్న వాటినే సర్దుబాటు చేశారు. అలాగే 11 మందికి తట్టు ఉన్నట్లుగా నమోదు చేసుకున్నారు. అయితే ఆ సంఖ్య ఎక్కువగానే ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ గ్రామాన్ని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సాగునీటి సాధన సమితి జిల్లా నాయకుడు చంద్రమౌళీశ్వర్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి వద్ద తమ ఇబ్బందులను వివరించారు. తమకు తక్షణమే తాగునీటిని అందించాలని కోరారు. అలాగే వైద్య పరీక్షలు సత్వరమే అందేలా చూడాలని విన్నవించారు. కాగా, గండికోటకు 12 టీఎంసీలు వస్తేనే కొర్రపాడు గ్రామానికి జలాలు రావాలి. అయితే ఇప్పుడే ఆ గ్రామాన్ని ఆ జలాలు చుట్టుముట్టడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధికారులు నష్టపరిహారం కోసం సర్వే చేపడుతున్న తరుణంలో ఇలా జలాలు రావడం ఏమిటని గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి కొర్రపాడు గ్రామస్తులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.