సత్తెన్న సొమ్ముపై రాజకీయ పెత్తనం!
సత్తెన్న సొమ్ముపై రాజకీయ పెత్తనం!
Published Tue, Feb 7 2017 10:30 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
-ఇప్పటికే వృథాగా కిర్లంపూడి, శంఖవరం కల్యాణ మంటపాలు
- తాజాగా కోరుకొండలో డార్మెట్రీహాలు నిర్మాణానికి పాలకవర్గం తీర్మానం
అన్నవరం : సత్యదేవుడు కొలువైన అన్నవరంలో దేవస్థానం కల్యాణ మంటపం ఒక్కటీ లేదు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో ఇతర ప్రాంతాల్లో దేవస్థానం కల్యాణ మంటపాలు, డార్మెట్రీ హాళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాలిలాఉన్నాయి...
అన్నవరంలో దేవస్థానం కల్యాణ మంటపాలు లేకపోవడంతో ప్రైవేట్ లాడ్జిలకు చెందిన కల్యాణ మంటపాలలోనే సామాన్యులు వివాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ వత్తిడుల కారణంగా 1999–2001 సంవత్సరాల మధ్య జిల్లాలోని కిర్లంపూడి, శంఖవరాలలో రెండు కల్యాణ మంటపాలు అధికారులు నిర్మించారు. ఒక్కొక్క దానికి రూ.కోటికి పైగా వ్యయమైంది. వాటిలో పెద్దగా వివాహాలు జరగక, నిర్వహణకు సరిపడా ఆదాయం కూడా రాక లీజు కిచ్చేందుకు దేవస్థానం టెండర్లు కూడా పిలిచింది.
ఈసారి కోరుకొండలో..
ఈ చేదు అనుభవం ఉన్నప్పటికీ...తాజాగా కోరుకొండలో దేవస్థానం స్థలంలో రూ.35 లక్షల వ్యయంతో డార్మెట్రీ నిర్మాణానికి పాలకవర్గం తీర్మానించింది. కోరుకొండ ప్రాంత ప్రజాప్రతినిధి ఇటీవల అన్నవరం వచ్చి ఈఓ కే నాగేశ్వరరావుతో ఈ నిర్మాణ విషయమై సుదీర్ఘంగా చర్చించి ఒప్పించినట్టు సమాచారం. వాస్తవానికి కల్యాణ మంటపం నిర్మించడానికే ప్రతిపాదనలు పెట్టారు. అయితే కల్యాణ మంటపం నిర్మాణం అంటే వివాదమవుతుందని భావించి ఈ రకంగా మార్పు చేశారు. 84 అడుగుల పొడవు 33 అడుగుల వెడల్పుతో ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పొడవుగా రెండు హాల్స్ కలిపి ఒక భవనంగా నిర్మించి ఒక దాంట్లో కిచెన్, డైనింగ్‌హాల్, మరో దాంట్లో వివాహాలు చేసుకునేందుకు గాను ప్లాన్ సిద్ధం చేశారు. కమిషనర్ అనుమతికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మొదట్లో అంతే!
గతంలో కిర్లంపూడి, శంఖవరంలో కల్యాణ మంటపాలు నిర్మించేటపుడు కూడా మొదట తక్కువ మొత్తంతోనే ప్లాన్ సిద్ధం చేసి అనుమతులు పొంది, ఆ తరువాత రూ.కోటి వరకూ ఖర్చు చేశారు. ఇప్పుడు కూడా ఈ డార్మెట్రీ హాలు నిర్మాణం పూర్తయ్యేటప్పటికీ సుమారు రూ.60 లక్షల వరకూ ఖర్చవుతుందని సమాచారం.
ఈవో నో కామెంట్
అన్నవరంలో కాకుండా ఎక్కడెక్కడో రూ.లక్షలు ఖర్చు పెట్టి నిర్మిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఈఓ కే నాగేశ్వరరావును సంప్రదించగా మాట్లాడేందుకు నిరాకరించారు.
Advertisement