‘స్కౌట్స్ అండ్ గైడ్స్’లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానం
మచిలీపట్నం (కోనేరు సెంటర్) :
స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిషనర్ ఎస్.శ్రీదేవి తెలిపారు. కృష్ణాజిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంపస్‌లో విద్యార్థినుల తృతీయ సోఫాన్ శిక్షణ ముగింపు కార్యక్రమం ఆదివారం స్థానిక జెడ్పీ సెంటర్‌లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు, పుష్కరాలు వంటి పుణ్యకార్యాలు, మొక్కలు పెంచడం వంటి సామాజిక కార్యక్రమాల్లో శిక్షణ పొందిన విద్యార్థులు సమాజానికి సేవలు అందించటం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణకు విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రతి విద్యార్థి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి క్రమశిక్షణ కలిగిన రంగాల్లో శిక్షణ పొంది సమాజానికి మంచి సేవలను అందించేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం స్కౌట్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి కరింశెట్టి కైలాసపతి, లయన్స్ జిల్లా చైర్మన్ పంచపర్వాల సత్యనారాయణ, రజియాబేగం, ఐ.శ్రీనివాసరావు, కె.శర్మ, విద్యార్థులు పాల్గొన్నారు.