ఫలించిన వ్యూహం
తెలంగాణలో తొలి పుష్కర మహోత్సవం పాలమూరు జిల్లా ప్రధాన వేదికగా అత్యంత వైభవంగా ముగిసింది. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులు పడిన ఆరునెలల శ్రమ ఫలితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దాదాపు 1.84 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించే అవకాశం లభించింది.
-
రెండు కోట్ల మంది భక్తుల పుష్కరస్నానం
-
మారుమూల ఘాట్లలోనూ లక్షలాదిగా..
-
ప్రధాన ఘాట్లపై తగ్గిన ఒత్తిడి
-
ఖండంతరాలకు జోగుళాంబ ఖ్యాతి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణలో తొలి పుష్కర మహోత్సవం పాలమూరు జిల్లా ప్రధాన వేదికగా అత్యంత వైభవంగా ముగిసింది. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులు పడిన ఆరునెలల శ్రమ ఫలితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దాదాపు 1.84 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించే అవకాశం లభించింది. కృష్ణా పుష్కరాలు జిల్లాలో ఏ ఒక్క ప్రాంతానికి ఘాట్‌కు పరిమితం కాకుండా అధికారులు దూరదృష్టితో ప్రతిఘాట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో పుష్కరఘాట్లన్నీ భక్తులతో పోటెత్తాయి. ఏర్పాట్లు, ప్రాధాన్యంలోనూ అన్ని ఘాట్లను సమదష్టితో చూశారు. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఘాట్లకు సైతం వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలనుంచి తరలివచ్చారు. ప్రధాన పుష్కరఘాట్లపై రద్దీ తగ్గించి భక్తుల తొక్కిసలాట లేకుండా చేయాలన్న అధికారుల వ్యూహం, ముందస్తు ప్రణాళిక విజయవంతమైనట్లయింది.
12 రోజులు జనసంద్రంగా..
ఈ నెల 12న ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు భక్తుల పుణ్యస్నానాలు, దైవ దర్శనాలతో మంగళవారం సాయంత్రం వరకు వైభవంగా జరిగాయి. అంబరాన్నంటిన ఏర్పాట్ల మధ్య భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పునీతులయ్యారు. కష్ణా పుష్కరాల వేడుకల్లో అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయ ఖ్యాతిని చాటారు. పుష్కరాల్లో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కర ఘాట్లు, ఆలయాలు, రహదారుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి యాత్రికులకు మరిచిపోలేని అనుభవాన్ని మిగిల్చింది. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లు 12 రోజుల పాటు భక్తులతో కిటకిటలాడాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 12న అలంపూర్ నియోజకవర్గంలోని గొందిమల్ల పుష్కర ఘాట్‌లో పుష్కర స్నానమాచరించి జోగుళాంబ అమ్మవారి దర్శనంతో పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కష్ణా పుష్కర మహోత్సవం జరిగిన 12 రోజుల వేడుకల్లో జిల్లాలోని పుష్కర ఘాట్లలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు చేశారు. జిల్లాలోని 25 ప్రధాన పుష్కర ఘాట్లతోపాటు లోకల్ ఘాట్లు భక్తుల పుణ్యస్నానాలతో కిక్కిరిశాయి. మొత్తం పుష్కర ఘాట్లలో 1,84,94,164 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
ప్రధాన ఘాట్‌ల వారీగా పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
ఘాట్‌పేరు భక్తుల వివరాలు
కృష్ణ 8,13,843
పస్పుల 5,67,842
గొందిమల్ల 14,16,539
నదిఅగ్రహారం 6,36,500
బీచుపల్లి 38,17,120
రంగాపూర్ 44,62,332
సోమశిల 35,53,183
పాతాళగంగ 3,27,751