కృష్ణా జలాలు సీమకే కేటాయించాలి
- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ముచ్చుమర్రి (పగిడ్యాల): కృష్ణా జలాలను రాయలసీమకే కేటాయించాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ముచ్చుమర్రిలోని తన స్వగృహంలో ఏర్పాటు ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ముచ్చుమర్రిలోని ప్రతి వీధి తిరిగిన చరిత్ర ఉందన్నారు. అయితే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ స్కీంలో వంద శాతం మోటార్లు పనిచేయవని.. కేవలం 500 క్యూసెక్కుల నీరు మాత్రమే కేసీలోకి విడుదల చేస్తూ రాయలసీమ సస్యశ్యామలం అయిపోతుందని ప్రగల్బాలు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కర్ణాటక రాష్ట్రం ఎగువన అక్రమ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తూ జలదోపిడికి పాల్పడుతున్నా..అరికట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్రేవుల రిజర్వాయర్‌ను నిర్మించాలని సర్వే చేసి రూ. 240 కోట్లకు ప్రతిపాదనలు పంపినా ఫలితం శూన్యమన్నారు. అప్పట్లో 69 జీవోను ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని వెంటనే రద్దు చేయాలన్నారు. సిద్దేశ్వరం, మల్లేశ్వరం మధ్యన అలుగు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిని ఫ్రీజోన్ చేసి జనాభా ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యుడు నాగభూషణం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పుల్యాల నాగిరెడ్డి, కార్యకర్తలు నారాయణరెడ్డి, కరణం జయరాఘవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.