జలదిగ్బంధంలో చిక్కుకున్న సంగమేశ్వర ఆలయ దృశ్యమిది.
కృష్ణార్పణం..!
Published Sun, Aug 7 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
– నీట మునిగిన పుష్కర పనులు
– కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్లపాలు
– ప్రభుత్వానికి కొరవడిన ముందు చూపు
– జల దిగ్బంధంలో సంగమేశ్వరం
– వరదలో కొట్టుకుపోయిన నాణ్యత
– పైకి తేలుతోన్న నాసిరకం పనులు
సాక్షి, కర్నూలు:
ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పుష్కర పనులు నీటిపాలయ్యాయి. కృష్ణమ్మ వరద తాకికి నిర్మాణాలు కొట్టుకుపోతున్నాయి. పదిహేను రోజుల క్రితం వరకు కృష్ణమ్మ ఎక్కడ అంటూ వేయి కనులతో వేచి చూశారు.. ఇప్పుడు.. ఇదిగో నేను రానే వచ్చానంటూ పరవళ్లలో నదీమతల్లి తరలి వచ్చింది. జూరాల నుంచి ఆదివారం సాయంత్రానికి 1.47 లక్షల క్యూసెక్కుల వరదనీరు దిగువకు వెళ్తోంది. ఎగువనున్న ఆల్మట్టి నుంచి 1.62 లక్షల క్యూసెక్కులు.. నారాయణపూర్ జలాశయం నుంచి 1.49 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వస్తోంది. దీంతో పుష్కరాలకు ఇంకా నాలుగు రోజులు ఉండగానే నది పరవళ్లు తొక్కుతోంది. పనుల్లో జాప్యం కారణంగా పుష్కర నిర్మాణాలు కృష్ణమ్మ వరదలో కొట్టుకుపోతున్నాయి. మరోవైపు..నాసిరకం పనుల జాడ పైకి తేలుతోంది.
కొట్టుకుపోతున్న నిర్మాణాలు!
కృష్ణా నదీ వరద నీటితో సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం మునిగిపోయింది. ఇక్కడ అభివృద్ధి పనులన్నీ నీటి పాలయ్యాయి. పుష్కర ఘాట్లలో ఏర్పాటు చేసిన టైల్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. సిమెంట్ పూత కూడా కొట్టుకుపోయింది. సరైన ప్రణాళిక వేసుకోకపోవడం.. ముందస్తు అంచనా లేకపోవడంతో నష్టం వాటిల్లినటై ్లంది. శ్రీశైలం డ్యాం దిగువన ఉన్న లింగాలగట్టు లోలెవల్ ఘాట్ కాంక్రిటు నిర్మాణాలు నీటిలో మునిగిపోయాయి. నీళ్లు ఉండగా సిమెంట్ నిర్మాణాలు చేపట్టడంతో కొట్టుకుపోతున్నాయి.
నాణ్యతకు తూట్లు!
కష్ణా పుష్కర పనులకు చాలా ఆలస్యంగా ఏప్రిల్ 7న పాలనామోదం లభించింది. నామినేషన్ పద్ధతిలో పనులు చేజిక్కించుకునేందుకు ఆలస్యం చేశారనే విమర్శలు వచ్చాయి. లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్న అంచనాలతో ప్రభుత్వం జిల్లాలో పుష్కర పనుల కోసం దాదాపు రూ. 160 కోట్లకుపైగా నిధులు వెచ్చించింది. అయితే పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం.. హడావుడి చేపట్టండటంతో పనుల్లో నాణ్యత లోపించింది. వరద నీటిలో నాణ్యత కొట్టుకుపోయింది.
వర్షంతో అవస్థలు..
వారం రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో పుష్కర పనులకు ఆటంకం కలుగుతోంది. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులకు చెదురు మదురు వర్షాలు అడ్డంకిగా మారతున్నాయి. టెండర్లు కొంత ముందుగా నిర్వహించి పనులు ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కాదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement