కలకలం
కలకలం
Published Sat, Jul 30 2016 12:18 AM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM
నేరగాళ్లకు షెల్టర్‌జోన్‌గా కర్నూలు
– జిల్లాలో తెలంగాణ ఎంసెట్ ప్రకంపనలు
– కర్నూలులో దలదాచుకున్న ఓ అకాడమీ డైరెక్టర్లు
– రంగంలోకి దిగిన అక్కడి సీఐడీ అధికారులు
– కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు
– అదుపులో ఇరువురు వ్యక్తులు
తెలంగాణ ఎంసెట్ లీకేజీ వ్యవహారం జిల్లాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడి సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేయడం.. ఇప్పటికే పలువురిని విచారించి అరెస్టు చేయడం తెలిసిందే. తాజాగా లీకేజీతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను సీఐడీ అధికారులు కర్నూలులో అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నేరగాళ్లకు జిల్లా షెల్టర్ జోన్‌గా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
సాక్షి, కర్నూలు:
తెలంగాణ సీఐడీ అధికారులు కర్నూలులో తనిఖీలు నిర్వహించడం జిల్లాను కుదిపేస్తోంది. ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు కర్నూలులోని ఓ హోటల్‌లో తలదాచుకున్న సమాచారంతో అధికారులు శుక్రవారం ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. ఓ అకాడమీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లను వీరి ప్రయాణిస్తున్న కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీపై అక్కడి సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేయడం తెలిసిందే. విచారణ అనంతరం ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోగా.. లోతుగా విచారణ చేపట్టేందుకు పలువురు అనుమానితుల జాబితాను కూడా సిద్ధం చేశారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన రెసోనాన్స్ మెడికల్ అకాడమీ డైరెక్టర్లు వెంకటరమణ, తరుణ్‌తేజ్‌లు ఉన్నారు. వీరిని విచారించేందుకు ఇళ్ల వద్దకు చేరుకోగా పరారైనట్లు గుర్తించారు. ఏ వాహనంలో వెళ్లారనే సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. హైదరాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారిలో వెళ్లినట్లు టోల్‌గేట్లలోని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా కర్నూలు నగరం బళ్లారి చౌరస్తా సమీపంలోని ఓ హోటల్‌లో బస చేసినట్లు సమాచారం తెలుసుకున్నారు. ఆ మేరకు శుక్రవారం ఉదయాన్నే నగరానికి చేరుకొని నిమిషాల వ్యవధిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.
షెల్టర్ జోన్‌గా కర్నూలు
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా కర్నూలు జిల్లా పతాక శీర్షికల్లో నిలుస్తోంది. బెంగళూరు, చెన్నై రాష్ట్రాలకు సులభంగా తరలిపోవడానికి కర్నూలు జిల్లా ముఖద్వారం కావడంతో.. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు పోలీసుల కళ్లుగప్పి కర్నూలుకు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచే అనుకున్న ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అండర్‌వరల్డ్ డాన్ అబుసలేం, అతని ప్రియురాలు మోనికాబేడీలకు కర్నూలు నగరంలో నివాసం ఉంటున్నట్లుగా చిరునామా సృష్టించి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అదేవిధంగా హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఏడాదిన్నర క్రితం ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు కాల్పులకు పాల్పడిన అనంతరం కర్నూలు బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో తలదాచుకోవడం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఓ మెడికల్ అకాడమీ డైరెక్టర్లు కూడా కర్నూలులో తలదాచుకోవడం చూస్తే నగరం నేరగాళ్లకు షెల్టర్ జోన్‌గా మారుతుందనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది.
Advertisement