వణికిస్తున్న ‘క్యాంట్’
వణికిస్తున్న ‘క్యాంట్’
Published Wed, Oct 26 2016 10:00 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– తుపాను హెచ్చరికలతో అన్నదాతల్లో ఆందోళన
– నేటినుంచి వర్షాలు కురిసే అవకాశం
– జిల్లాలో వరి, మొక్కజొన్న, పొగాకు పంటలకు పొంచివున్న ప్రమాదం
జంగారెడ్డిగూడెం :
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన క్యాంట్ తుపాను కదలికలు జిల్లా రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. బుధవారం సాయంత్రం విశాఖ పట్నానికి 520, మచిలీపట్నంకు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకతమైన తుపాను తీరం వైపు దూసుకొస్తున్నట్టు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ తుపాను ఏ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందనేది ఇంకా స్పష్టం కాలేదు. దీని ప్రభావంతో కురిసే వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రానుండటం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లింది. మిగిలిన కొద్దిపాటి పంట అయినా చేతికి వస్తుందనుకుంటున్న తరుణంలో తుపాను ముప్పు సమీపిస్తుండటంతో కన్నీటిపర్యంతం అవుతున్నారు.
తీరగ్రామాల్లో అప్రమత్తం
తుపాను ప్రభావంతో గురువారం నుంచే భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన తుపాను హెచ్చరికల కేంద్రం తీరప్రాంత గ్రామాలను, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులను అప్రమత్తం చేయాలని సూచించింది. దీంతో జిల్లాలోని తీర గ్రామాల్లో ప్రజలను స్థానిక అధికారులు అప్రమత్తం చేశారు. జాలర్లను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో వివిధ పంటలు వేసిన రైతులు కలత చెందుతున్నారు.
వర్షాలొచ్చినా నష్టమే
తుపాను ఎక్కడ తీరం దాటుందనే విషయాన్ని పక్కన ఉంచితే.. దీని ప్రభావంతో కురిసే భారీ వర్షాల వల్ల వరి పంటకు తీవ్ర నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2.28 లక్షల హెక్టర్లలో వరి పంట వేశారు. ఇందులో 17 శాతం విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంట వివిధ దశల్లో చేతికి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కోసిన పంటను కళ్లాలపై కుప్పలు కోసి ఒబ్బిడి చేస్తున్నారు. ఒకవేళ భారీ వర్షాలు పడితే కళ్లాలపై ఉన్న పంట, వరికుప్పలు, చేతికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వరికి lష్టం జరిగే అవకాశం ఉంది. ఇటీవల వేసిన మొక్కజొన్న పంటకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. దాదాపు చేతికి వచ్చే స్థితిలో ఉన్న మిరప పంటకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. ఉద్యాన పంటలైన అరటి, పందిళ్లపై సాగుచేస్తున్న కూరగాయ తోటలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ఈ పంటలన్నీ నేలవాలే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న వర్జీనియా పొగాకుకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలో ఇప్పటివరకు 5వేల హెక్టార్లలో రైతులు వర్జీనియా నాట్లు వేశారు. 110 హెక్టార్లలో నాట్లు వేశారు. వర్షతీవ్రత అధికంగా ఉంటే నష్టం సంభవించే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
Advertisement
Advertisement