విజయవాడ : బెజవాడలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రౌడీయిజం మరోమారు విజృంభించింది. రూ.200 మామూలు ఇవ్వలేదని ఓ కూలీపై నలుగురు కలిసి దాడిచేసిన ఘటన కలకలం రేపింది. మాచవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన కన్నూరి బుల్లబ్బాయి 20 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం నగరానికి వచ్చాడు. నగరంలోని మొగల్రాజపురంలోని బోయపాటి మాధవరావు వీధి చర్చి వద్ద ఉంటున్నాడు. భవన నిర్మాణ పనులకు వెళ్తూ రోజుకూలీగా జీవనం సాగిస్తున్నాడు.
ఈ నెల ఆరోతేదీన మొగల్రాజపురం కొండపై నివసించే నానాజీ ఇంటిపని నిమిత్తం పాకలపాటి సురేష్ ఇంటి ముందు ఇసుక కుప్పను వేశారు. అదేరోజు సాయంత్రం నానాజీ ఇసుకను తన ఇంటి వద్దకు మోయటానికి బుల్లబ్బాయితో కిరాయి మాట్లాడుకున్నాడు. బుల్లబ్బాయి ఇసుక మూటలను కొండపైకి మోస్తున్న సమయంలో పాకలపాటి సురేష్ వచ్చి తన ఇంటి ముందు ఇసుకగుట్ట వేయటానికి మీరెవరు.. ఇసుక గుట్ట వేసినందుకు, ఇంటి ముందు నుంచి రవాణా చేస్తున్నందుకు తనకు రూ.200 మామూలు ఇవ్వాలంటూ బుల్లబ్బాయిపై రుబాబు చేశాడు.
దీనిని గమనిస్తున్న స్థానికులు సురేష్‌కు నచ్చజెప్పటానికి ప్రయత్నించినా వినకుండా బుల్లిబాబుపై దౌర్జన్యానికి ఒడిగట్టాడు. అతనితోపాటు మరో నలుగురు కలిసి పెద్దపెద్ద బాదులు, కర్రలతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బుల్లబ్బాయిని చితకబాదారు. ఈ దాడిలో బుల్లబ్బాయి తలకు, కన్నుకు తీవ్ర గాయాయ్యాయి. ఈ వ్యవహారం అంతా అదే ప్రాంతంలో ఉన్న ఓ కిరాణా దుకాణం ముందు ఉన్న సీసీ టీవీలో నమోదైంది. దీనిపై వెంటనే బాధితుడు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై సురేష్‌తో పాటు గోపయ్య, కుమార్, కల్యాణ్ అనే వ్యక్తులు దాడిచేశారని పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమెదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
సురేష్‌పై గతంలో ఫిర్యాదులు
సురేష్‌పై గతంలోనూ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయని స్థానికులు తెలిపారు. అధికార పార్టీ నేతల అందదండలతో స్థానికంగా ఉండే చిరు వ్యాపారుల నుంచి రూ.20, రోజువారీ కూలీల వద్ద రూ.30 కూడా మామూళ్లు వసూలు చేసేవాడని పలువురు వివరించారు.
కేసును నీరుగార్చే ప్రయత్నం
బాధితుడు బుల్లబ్బాయి ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిందితులు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్తకు అనుచరులని, స్థానిక టీడీపీ నేతలు జోక్యం చేసుకుని నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు సోమవారం మాచవరం పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. దాడి చేసిన నేపథ్యంపై సీసీ టీవీ ఫుటేజ్ సాక్ష్యంగా ఉన్నా నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం దారుణంగా ఉందని పేర్కొన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయకుంటే ఉద్యమిస్తామని తెలిపారు.
నిందితులపై రౌడీషీట్ తెరుస్తాం
నిందితుల కోసం గాలింపు చర్యలు ఉధృతం చేశాం. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తాం. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుల్లో మొదటి ముద్దాయిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయి. వీటిని పరిశీలించి ప్రధాన నిందితులైన సురేష్, గోపయ్యలపై రౌడీషీట్ తెరుస్తాం.
- ఉమామహేశ్వరరావు, సీఐ
మామూలు ఇవ్వలేదని...
Published Tue, May 10 2016 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM
Advertisement
Advertisement