ధర పతనం.. రైతుల దైన్యం
ధర పతనం.. రైతుల దైన్యం
Published Mon, Aug 22 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
కొవ్వూరు రూరల్ : బెండకాయల ధర పతనం కావడంతో రైతులు అల్లాడుతున్నారు. కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 10 కిలోలు కేవలం రూ. 50 మాత్రమే పలుకుతోంది. కొద్దిరోజులుగా ధర క్రమేపీ పతనమైంది. జిల్లాలో దాదాపు 4 వేల ఎకరాల్లో బెండ సాగులో ఉంది. కొవ్వూరు, పెరవలి, తాళ్లపూడి తదితర మండలాలతో పాటు మెట్ట, డెల్టా ప్రాంతాల్లో పలు చోట్ల సాగు చేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో 500 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పెళ్లిళ్ల సీజన్, శ్రావణమాసంలో కూరగాయల ధరలు పెరగాల్సి ఉండగా ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం.
కూలి ఖర్చులకూ దిక్కు లేదు
ప్రస్తుతం బెండకాయల ధర చూస్తే కూలి ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. ఒక బస్తా (70 కేజీలు) బెండకాయలు కోయడానికి ఆడ కూలికి రూ.130, టిఫిన్‌కు రూ.15, రవాణా ఖర్చులు రూ.25, సంచి ఖర్చు రూ.15లు కలుపుకుంటే మొత్తం రూ.185 వరకూ ఖర్చవుతోంది. ఇవి గాక మూడు నెలల కాలానికి పొలం కౌలు రూ.10 వేలు, పంట సాగుకు మరో రూ.15 వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఒక కూలి వచ్చి రోజులో 50 కేజీల వరకూ బెండకాయలను కోస్తారు. ప్రస్తుతం ఉన్న ధరను బట్టి రైతుకు రూ.250 వరకూ ఆదాయం వస్తుంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో కోత ఖర్చులు కూడా రాక పెట్టుబడులు కోల్పోతున్నామని వారు చెబుతున్నారు. నష్టాలు వస్తుండడంతో కొందరు రైతులు కాపు కాస్తున్నా బెండ పంటను తొలగిస్తున్నారు. ధర పతనం కావడంతో హోల్‌సేల్ మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని రైతులు వాపోతున్నారు.
తోటను తొలగించా
బెండకాయల ధర గిట్టుబాటు కాకపోవడంతో తోటను తొలగించాను. సాగు ఖర్చులు నష్టపోయాను. 20 రోజులుగా ధర పతనం కొనసాగుతోంది. రోజూ కష్టపడి మార్కెట్‌కు తరలించినా నష్టాలు తప్పడం లేదు – కంటిపూడి శ్రీనివాస్, రైతు, నందమూరు
రూ.50 కూడా రావడంలేదు
బెండకాయలు ప్రతి రోజు తప్పనిసరిగా కోయాలి. లేదంటే చేలోనే ముదిరిపోయి పంట దెబ్బతింటుంది. తోటను కాపాడుకోవడానికి రోజూ కోస్తుంటే ధర లేక నష్టాలు వస్తున్నాయి. ప్రస్తుతం 10 కేజీలకు రూ.50 కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. – యండపల్లి రాంబాబు, రైతు, నందమూరు
Advertisement
Advertisement