
గోపాల్‌పేట: ఎరువు మరింత బరువెక్కింది. యాసంగి సాగు వేళ రైతులకు మరింత భారంపడింది. ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటా పెరుగుతుండడంతో పెట్టుబడి అధికమవుతోంది. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1నుంచి కంపెనీలు అమల్లోకి తీసుకురానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిసరుకు పెరగడంతో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు ఆయా కంపెనీలు చెబుతున్నాయి. జిల్లాలో సుమారు 1,19,700 మంది రైతులు ఉన్నారు. పెరిగిన ఎరువుల ధరలతో రబీలో రైతులపై రూ.2.50కోట్ల అదనపు భారం పడనుంది. ఒక్కోరైతుపై రూ.వెయ్యి నుంచి రూ.ఐదువేల మేర భారం పడుతుందని అంచనా..
పెరిగిన ధరలు ఇలా
డీఏపీ బస్తా పాత ధర రూ.1081ఉండగా కొత్తధర రూ.1215కి చేరింది. కాంప్లెక్స్ ఎరువులైన 14–35–14 పాత ధర రూ.1122ఉండగా కొత్తధర రూ.1240కి చేరింది. 20–20–0–13 పాత ధర రూ.873ఉండగా కొత్త ధర రూ.930కి చేరింది. 10–26–26 పాతధర రూ.1044 ఉండగా, కొత్తధర రూ.1150కి చేరింది. 28–28–0 పాత ధర రూ.1122 ఉండగా కొత్త ధర రూ.1240కి చేరింది. 16–20–0–13 పాత ధర రూ.821 ఉండగా కొత్త ధర రూ.880కు చేరింది. డీఏపీ(5 శాతం జింక్)పాత ధర 1107 ఉండగా కొత్త ధర రూ.1240కి చేరింది. 20–20–0–13 పాత ధర రూ.925 ఉండగా కొత్తధర 980కి చేరింది. యాసంగిలో ఇప్పటికే రైతులు ఎరువులను కొనుగోలు చేసి పంటలకు వేశారు. మళ్లీ ఇప్పుడు కొనుగోలుచేసే రైతులపై పెరిగిన భారం పడనుంది. కంపెనీలు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి ప్రకటించలేదు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు.
ఎరువు ధరలు తగించాలి
రోజు రోజుకు వ్యవసాయం సాగుఖర్చులు పెరిగిపోతున్నాయి. కూలీల కొరత, పెరుగుతున్న ఎరువులు, విత్తనాల ధరలు రైతులకు భారంగా మారింది. ఖరీఫ్‌లో సరైన వర్షాలు లేక పంటలు ఎండి దిగుబడి తగ్గిపోయింది. కేఎల్‌ఐ నీళ్లు పుష్కలంగా చెరువులు, కుంటల్లో ఉండడంతో యాసంగిలో ఎక్కువగా వరి, వేరుశనగ సాగు చేశారు. ఈ పరిస్థితుల్లో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచడంతో రైతులకు భారం పడుతుంది. -శ్రీనువాసులు, రైతు, గోపాల్‌పేట
పాత ధరలకే విక్రయించాలి
కొత్తస్టాకు ధరలు ముద్రిం చి వస్తాయి. అప్పటి వరకు పాత స్టాకును పా త ధరలకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు విక్రయించొద్దు.. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువు బస్తా ల ధరలు పెరగడంతో యాసంగిలో జిల్లా రైతాంగంపై సుమారు రూ.2.50కోట్ల భారం పడనుంది. –నూతన్‌కుమార్, టెక్నికల్ ఏడీఏ, వనపర్తి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment