రబీపై కమ్ముకున్న కరువు మేఘాలు
సాక్షి, హైదరాబాద్: రైతును కాలం కాటేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్ని కుదేలు చేశాయి. ప్రస్తుతం రబీ కీలకమైన దశలో ఉండగా, పంటల సాగు ఏమాత్రం పెరగడంలేదు. బోర్లు, బావులు, చెరువులు, జలాశయాల్లో నీరు అడుగంటి పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. సర్కారు లెక్కల ప్రకారమే రాష్ట్రంలోని 18 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, పాలమూరు, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాభావం నెలకొందని సర్కారు వెల్లడించింది. దీంతో రబీ సాగు విస్తీర్ణం 27 శాతానికే పరిమితమైంది.
రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 9.95 లక్షల ఎకరాలే సాగైంది. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 1.23 లక్షల ఎకరాల్లో (దాదాపు 7%) మాత్రమే నాట్లు పడ్డాయి. 4.15 లక్షల ఎకరాల్లో ఉండాల్సిన మొక్కజొన్న కాస్త 2.19 లక్షల ఎకరాల్లోనే సాగవుతోంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.86 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగుచేస్తున్నారు. మెదక్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో పంటల సాగు 10% లోపే ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు తీవ్ర నష్టం చేసింది.
కనికరించని బ్యాంకులు
రబీ పంటల పరిస్థితి ఈ విధంగా ఉంటే.. మరోవైపు రైతులను ఆదుకోవాల్సిన బ్యాంకులు పట్టించుకోవడంలేదు. వ్యవసాయ రుణాలకు కొర్రీలు పెడుతున్నాయి. పైపెచ్చు ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో వీలున్నంత మేర.. రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా మొండికేస్తున్నాయి. రబీలో పంట రుణాల లక్ష్యం రూ.16,998 కోట్లు కాగా, వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కేవలం రూ.3,816 కోట్లే (22.45%) ఇవ్వడం గమనార్హం. రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చు కోసం ప్రైవేటుగా అప్పులు చేయాల్సి వస్తుంది. రైతుబంధు కింద ప్రభుత్వం సొమ్ము ఇస్తున్నా.. కౌలు రైతులు మాత్రం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించక తప్పడం లేదు.
దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు.. వడ్డీ వ్యాపారస్తుల వద్దే అప్పులు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఖాతా నెంబర్లలో సమస్యల కారణంగా దాదాపు 44 వేల మంది రైతుల ఖాతాల్లోకి సొమ్మే చేరలేదు. అలాగే కొత్తగా రబీలో అర్హులైన 3 లక్షల మందికి ఇప్పటికీ రైతుబంధు సొమ్ము చేరలేదు. చాలామంది రైతులు సాధారణంగా పంట రుణాలు రెన్యువల్ చేసుకుంటారు. దీన్ని సాకుగా తీసుకుని పాత వాటికి వడ్డీలు కట్టాలని కొన్నిచోట్ల, రేపు, మాపు అంటూ మరికొన్ని చోట్ల అన్నదాతలను బ్యాంకులు తిప్పుకుంటున్నాయి.
పంట బీమాకు దూరమైన అన్నదాత
ఈ నెల 31తో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా ప్రీమియం చెల్లించే గడువు ముగియనుంది. ఇందులో వరి ప్రధాన పంటగా ఉంది. అయితే బ్యాంకులు రుణాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో, చాలా మంది రైతులు బీమా పరిధిలోకి రాలేదు. రుణం ఇచ్చే సమయంలోనే పంటను బట్టి ప్రీమియాన్ని బ్యాంకులు మినహాయించుకుంటాయి. ఈసారి దీన్ని తప్పనిసరి చేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా చెల్లింపులపై చాలా మంది అన్నదాతలకు అవగాహన లేదు. రైతుల్లో చైతన్యం తీసుకురావడంలో వ్యవసాయశాఖ అత్యంత దారుణంగా విఫలమైం దనేది సుస్పష్టం. ఫలితంగా ప్రకృతి విపత్తుతో నష్టం వస్తే రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇన్పుట్ సబ్సిడీని అమలు చేయకపోవడం, ఇటు బీమా పరిధిలో లేకపోవడంతో రైతులు అప్పులపాలు కావాల్సి వస్తోంది.
కంటింజెన్సీ ప్రణాళికపైనిర్లక్ష్యం
రబీ పరిస్థితి ఆశాజనకంగా లేదని వ్యవసాయశాఖ వర్గాలే చెబుతు న్నాయి. బోర్లు బావులు చెరువుల్లో నీళ్లు అడుగంటడంతో వరి అనుకున్నంత మేరకు సాగు అయ్యే పరిస్థితి లేదని చెబుతున్నారు. అయితే రబీలో వర్షాభావం నెలకొంటే, వరి సాగయ్యే పరిస్థితి లేకుంటే అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి. సాధారణంగా రబీలో వరి సాగు కాని చోట్ల ఆరుతడి పంటలే వేస్తారు. జొన్న, మినుములు, నువ్వులు వంటి వాటిని సాగు చేస్తారు. కానీ అదనపు విత్తనాల సరఫరాపై వ్యవసాయశాఖ దృష్టిసారించకపోవడం వల్లే ఈ సమస్యలు ఎదురయ్యాయి. కేవలం రబీలో అవసరమయ్యే విత్తనాలకే పరిమితమయ్యారు కానీ వర్షాభావం నెలకొంటే ఏం చేయాలన్న దానిపై ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం.. తాజా దారుణ పరిస్థితికి అద్దంపడుతోంది.
ఖరీఫ్ పంట నష్టాన్ని కేంద్రానికి నివేదించరా?
ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏకంగా 24.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు సకాలంలో నీరందక ఎండిపోవడంతో నష్టం వాటిల్లినట్లు ఏకంగా వ్యవసాయశాఖే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఇందులో ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, కందులు, పత్తి, పెసర, జొన్నలు, మినుములు, సోయాబీన్ వంటివి ఉన్నాయి. ఖరీఫ్‌లో 1.03 కోట్ల ఎకరాలలో పంటలు సాగు చేయగా, 24.72 లక్షల ఎకరాలు అంటే, దాదాపు 25% పంట నష్టం జరిగింది. ఎండల తీవ్రత, వర్షాభావం, గులాబీ పురుగు కారణంగా పత్తి దిగుబడి పడిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంత నష్టం జరిగినా.. కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నివేదిక ఇస్తే రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితి బాగోలేదన్న చర్చ జరుగుతుందని, దీనివల్ల ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రానికి నివేదిక ఇచ్చుంటే.. కనీసం రూ.700 కోట్ల మేర అయినా రైతులకు పరిహారం అందే అవకాశముండేదని అధికారులంటున్నారు.