వావ్‌! బెండర్‌ఫుల్‌ | Ladies Finger Dish Varieties In Sakshi Food | Sakshi
Sakshi News home page

వావ్‌! బెండర్‌ఫుల్‌

Published Sun, Sep 20 2020 8:49 AM | Last Updated on Sun, Sep 20 2020 9:02 AM

Ladies Finger Dish Varieties In Sakshi Food

బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా... అని సామెత  బ్రహ్మచారి సంగతేమో కానీ... బెండకాయను మాత్రం లేతగా ఉండగానే వండాలి దీనిలో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషకాలతోపాటు  అయోడిన్‌ కూడా ఉండటం వల్ల అనేక వ్యాధులను దరిచేరనివ్వదు అన్నట్లు ఓపిక ఉండి వండాలేకానీ బెండతో రకరకాల వెరయిటీలు చెయ్యొచ్చు రుచి చూశారంటే బెండర్‌ఫుల్‌ అనాల్సిందే!

బెండకాయ 65
కావలసినవి: అల్లం – చిన్న ముక్క; పచ్చిమిర్చి – 4; వెల్లుల్లి రెబ్బలు – 4; బెండకాయలు – అర కిలో; సెనగ పిండి – పావు కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పల్లీలు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూను; పచ్చి కొబ్బరి – పావు కప్పు.

తయారీ:

  • అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
  • బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పూర్తిగా పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
  • ఒక ప్లేటులో బెండకాయ ముక్కలు, సెనగ పిండి, బియ్యప్పిండి, జీలకర్ర పొడి, మిరప కారం, కొద్దిగా నీళ్ళు వేసి కలపాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పల్లీలు వేసి డీప్‌ ఫ్రై చేసి పక్కన ఉంచాలి
  • అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి
  • అదే నూనె మరోసారి కాగాక బెండకాయ ముక్కలను పకోడీలుగా వేసి, మీడియం మంట మీద సుమారు పావు గంట సేపు  వేయించి దింపాలి
  • గరం మసాలా, వేయించి ఉంచిన పల్లీలు , పచ్చి కొబ్బరి తురుము ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా కలపాలి.


బెండకాయ రైస్‌
కావలసినవి: బెండకాయ ముక్కలు – పావు కేజీ; ఎండు కొబ్బరి – పావు కప్పు; పుట్నాల పప్పు – అర కప్పు; కారం – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; పల్లీలు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 6; ఆవాలు – ఒక టీ స్పూన్‌; జీలకర్ర – ఒక టీ స్పూన్‌; పచ్చి సెనగ పప్పు; మినప్పప్పు – ఒక టీ స్పూన్‌; ఎండు మిర్చి – 3; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; అన్నం – పావు కేజీ బియ్యం ఉడికించాలి.

తయారీ:

  • మిక్సీలో ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేయాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక బెండకాయ ముక్కలు వేసి వేయించి, మూత ఉంచాలి
  • రెండు నిమిషాల తర్వాత మూత తీసి, చిటికెడు ఉప్పు జత చేసి ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి
  • అదే బాణలిలో పల్లీలు వేసి వేయించాలి
  • ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి
  • అన్నం జత చేయాలి
  • పుట్నాల కారం జత చేసి అన్నీ కలిసే వరకు బాగా కలపాలి
  • వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి, మూడు నిమిషాల తరువాత దింపేయాలి.


బెండకాయ మసాలా కర్రీ
కావలసినవి: నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; బెండకాయలు – పావు కిలో; జీలకర్ర – ఒక టీ స్పూన్‌; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్‌; పసుపు – కొద్దిగా; మిరప కారం – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్‌; ధనియాల పొడి – ఒక టీ స్పూన్‌; గరం మసాలా – అర టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – పావు కప్పు; పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు.
తయారీ:

  • బెండకాయలను శుభ్రంగా కడిగి తడి పోయే వరకు ఆరబెట్టాక పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బెండకాయ ముక్కలు వేసి బాగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి
  • అదే బాణలిలో జీలకర్ర వేసి కొద్దిగా వేగాక ఉల్లి తరుగు వేసి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
  • పసుపు, మిరపకారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి
  • టొమాటో తరుగు జత చేసి, బాగా కలిపి మెత్తబడేవరకు ఉడికించాలి
  • పెరుగు జత చేసి, కలియబెట్టి, కొద్దిసేపు మూత ఉంచాలి
  • బెండకాయ ముక్కలు జత చేసి, ముక్కలకు మసాలా పట్టే వరకు మీడియం మంట మీద ఉడికించి, కొద్దిగా నీళ్ళు జత చేసి మరి కాసేపు ఉడికించాలి
  • కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి.


స్టఫ్డ్‌ బెండకాయ ఫ్రై
కావలసినవి: బెండకాయలు – పావు కేజీ; పల్లీలు – 100 గ్రా. (వేయించి పొట్టు తీసేయాలి); ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; జీలకర్ర – ఒక టేబుల్‌ స్పూన్‌; ధనియాలు – ఒక టేబుల్‌ స్పూన్‌; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌; నువ్వులు – ఒక టేబుల్‌ స్పూన్‌; ఎండు మిర్చి – 10; పసుపు – కొద్దిగా.

తయారీ:

  • స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక సెనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి
  • జీలకర్ర, ధనియాలు జత చేసి మరోమారు వేయించాలి
  • నువ్వులు కూడా వేసి బాగా కలపాలి ∙ఎండుమిర్చి, వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించి, మంట ఆపేయాలి
  • పల్లీలు జత చేసి కలపాలి ∙బాగా చల్లారాక ఉప్పు, పసుపు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
  • బెండకాయ తొడిమలు తీసేసి, పొడవునా ఒక వైపు చీల్చాలి ∙తయారు చేసిన మసాలా మిశ్రమాన్ని స్టఫ్‌ చేయాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక స్టఫ్‌ చేసిన బెండ కాయలు వేసి వేయించాలి
  • కొద్ది సేపటి తర్వాత మూత ఉంచి మీడియం మంటలో మగ్గనిచ్చి దింపేయాలి.


బెండకాయ పులుసు
కావలసినవి: బెండకాయ ముక్కలు – పావు కేజీ; ఉల్లి తరుగు – కప్పు; టొమాటో తరుగు – కప్పు; పచ్చిమిర్చి – 3; నూనె –3 టేబుల్‌ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర –కొద్దిగా; పసుపు – చిటికెడు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; వేయించిన ధనియాల పొడి – ఒక టీ స్పూన్‌; ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్‌ స్పూను; చింతపండు రసం – అర కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను.

తయారీ:

  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
  • పచ్చిమిర్చి, ఉల్లి తరుగు జత చేసి వేయించాలి
  • అల్లం వెల్లుల్లి ముద్ద జతచేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి మూత ఉంచాలి
  • ఒక గిన్నెలో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు చేతితో బాగా కలపాలి
  • చింతపండు రసం కూడా జత చేసి మరోసారి కలపాలి
  • ఉల్లి తరుగు బంగారు రంగులోకి వచ్చాక కరివేపాకు జత చేయాలి
  • కలిపి ఉంచుకున్న టొమాటో, చింతపండు రసం జత చేసి మూతపెట్టి, సన్నటి మంట మీద నాలుగు నిమిషాలు ఉడికించాలి
  • బెండకాయ ముక్కలు జత చేసి కలపాలి
  • రెండు కప్పుల నీళ్ళు జత చేసి, మూత ఉంచి, ఏడు నిమిషాలు మరగనివ్వాలి
  • ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి కలపాలి
  • కొత్తిమీర జత చేసి, మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి.


బెండకాయ టొమాటో కూర
కావలసినవి: నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; కరివేపాకు – ఒక రెమ్మ; ఎండు మిర్చి – 2; టొమాటో తరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; బెండకాయలు – పావు కేజీ; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను.

తయారీ:

  • స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి
  • టొమాటో తరుగు జత చేసి బాగా కలపాలి ∙ఉప్పు, పసుపు జత చేసి టొమాటో ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించాలి
  • బెండకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి, మూత ఉంచాలి
  • ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి, మిరప కారం, ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు కలపాలి
  • కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement