అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న లక్కిరెడ్డిపల్లె సీడీపీఓ అరుణశ్రీని కమిషనర్ చక్రపాణి శుక్రవారం సస్పెండ్ చేశారు.
లక్కిరెడ్డిపల్లె: అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న లక్కిరెడ్డిపల్లె సీడీపీఓ అరుణశ్రీని కమిషనర్ చక్రపాణి శుక్రవారం సస్పెండ్ చేశారు. శనివారం జిల్లా అధికారులు సస్పెన్షన్ ఆర్డర్‌ను ఇవ్వడానికి లక్కిరెడ్డిపల్లె ఐసీడిఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో సంప్రదించారు. స్పందించకపోవడంతో చివరకు ఆమె ఉంటున్న ఇంటి బయట గోడకు అతికించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అరుణశ్రీ లక్కిరెడ్డిపల్లెలో విధులు చేపట్టాక అంగన్‌వాడీ వర్కర్ల నుంచి ఆయాల వరకు బెదిరింపు ధోరణితో వ్యవహరించేవారు. అంగన్‌వాడీ కేంద్రాలకు అందాల్సిన పౌష్టికాహారాన్ని కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు పీడీ కూడా ఆమెకు తలొగ్గి పని చేసే నేపథ్యంలో ఇక్కడి అవినీతి భాగోతాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకురాలు ప్రభావతమ్మ తెలిపారు. కడప ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీడీపీఓగా పనిచేస్తున్న రెడ్డి రమణమ్మ కమిషనర్ ఉత్తర్వుల మేరకు లక్కిరెడ్డిపల్లె ఇన్‌ఛార్జ్ సీడీపీఓగా భాధ్యతలు చేపట్టారు.