ఎఫ్‌ఎంబీ చిత్రపటాలతో భూముల కంప్యూటరీకరణ | land computarizationfmb pictures | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎంబీ చిత్రపటాలతో భూముల కంప్యూటరీకరణ

Published Thu, Feb 16 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

ఎఫ్‌ఎంబీ చిత్రపటాలతో భూముల కంప్యూటరీకరణ

ఎఫ్‌ఎంబీ చిత్రపటాలతో భూముల కంప్యూటరీకరణ

ఎన్‌ఆర్‌ఎస్‌ఏ డైరెక్టర్‌ కృష్ణమూర్తి
రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : గ్రామీణ, వ్యవసాయ భూముల ఎఫ్‌ఎంబీ చిత్రపటాలను కంప్యూటరీకరించే కార్యక్రమం ఏపీ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (ఏపీఎస్‌ఏసీ) ద్వారా చేపడుతున్నారని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీఎన్‌వీ కృష్ణమూర్తి తెలిపారు. ఈ విలువైన సమాచారాన్ని డిజిటలైజేషన్‌ ద్వారా కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ‘డిస్సెమినేషన్‌ ఆఫ్‌ జియోస్పేషియల్‌ టెక్నాలజీ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఏపీ’ అనే అంశంపై ఏపీఎస్‌ఏసీతో కలసి నన్నయ వర్సిటీ  గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధిలో భాగంగా ‘జియో స్పేషియల్‌ టెక్నాలజీ’ ప్రాముఖ్యతను, వినియోగాన్ని సరళతరంగా విద్యార్థులకు తెలియజేసేందుకు, ఆ దిశగా ఉద్యోగావకాశాలపై అవగాహన పొందడానికి దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో రిమోట్‌ సెన్సింగ్, జియోస్పేషియల్‌ వంటి అధునాతన సాధనాలను ఉపయోగించి, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నష్టాలను నివారించవచ్చన్నారు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల విజ్ఞానాన్ని, టెక్నాలజీలో వస్తున్న ఆధునికతను జోడించి కొత్త విషయాలు కనుగొనవచ్చన్నారు. పరిశోధనలు, ఉద్యోగ రంగాలలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా యువతను తయారు చేయవచ్చన్నారు. ఏపీ అభివృద్ది కోసం అనేక రంగాలలో వినూత్న పథకాలను రూపొందించడంలో, వాటి కార్యాచరణ, అమలులో సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. అలాగే ఉపగ్రహ, సాంకేతిక విజ్ఞానాన్ని ఎక్కడెక్కడ ఏవిధంగా ఉపయోగించవచ్చునో ప్రజలకు, విద్యార్థులకు తెలియజేసేందుకు ఇటువంటి వర్క్‌షాపులు ఉపయోగపడతాయన్నారు.  ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులు వినియోగంలో ఏపీఎస్‌ఏసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభివృద్ధిని సాధించడంలో మన దేశానికి ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ వంటి జాతీయ సంస్థలు, ఏపీఎస్‌ఏసీ వంటి రాష్ట్ర స్థాయి సంస్థలు కీలకపాత్రను పోషిస్తున్నాయని నన్నయ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ.నరసింహరావు అన్నారు. ఏపీఎస్‌ఏసీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కేవీ రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నన్నయ వర్సిటీ డీన్‌ ఆచార్య ఎస్‌.టేకి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, సహాయాచార్యులు డాక్టర్‌ కేవీ స్వామి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement