ముగ్గురిని బలిగొన్న భూవివాదం | Land issue kills three | Sakshi
Sakshi News home page

ముగ్గురిని బలిగొన్న భూవివాదం

Published Sat, Oct 22 2016 1:40 AM | Last Updated on Tue, Aug 28 2018 7:16 PM

ముగ్గురిని బలిగొన్న భూవివాదం - Sakshi

ముగ్గురిని బలిగొన్న భూవివాదం

  • పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన ఇద్దరు నిందితులు 
  • కలిగిరి : భూవివాదం చినికిచినికి గాలివాన మారి..ముగ్గురు వ్యక్తుల దారుణహత్యకు దారి తీసింది. జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధుల సమాచారం మేరకు.. మండలంలోని కుమ్మరకొండూరుకు సానా మహేంద్రరెడ్డి (38), వీరారెడ్డిపాళెంకు చెందిన కొండ్రెడ్డి సుబ్బారెడ్డి (42), అనంతసాగరం మండలం వెంగంపల్లికి చెందిన సానా సుబ్బారెడ్డి (40) నెల్లూరులో స్థిర పడ్డారు. పాపనముసిలిపాళెం సమీపంలో వెంకన్నపాళెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1లో 36.64 పొలం ఉంది. ముసిపాళెం గ్రామస్తులు కొంత మంది అందులో 12.50 ఎకరాలు భూమిని కొన్నేళ్ల కింద విజయవాడకు చెందిన కంచర్ల ప్రభాకర్‌ కుటుంబ సభ్యులకు విక్రయించారు. నాలుగేళ్ల క్రితం ప్రభాకర్‌ కుమారుడు జనార్దన్‌ ఆ భూమిని సానా మహేంద్రరెడ్డి, కొండ్రెడ్డి సుబ్బారెడ్డిలకు విక్రయించాడు. ప్రస్తుతం 12.50 పొలం సానా మహేంద్ర, కొండ్రెడ్డి లక్ష్మీకాంతమ్మ పేర్లు మీద రిజిస్టర్‌ అయింది. అయితే ఆ పొలంపై తమకు కూడా హక్కులు ఉన్నాయని, పొలాన్ని తాము సాగు చేసుకుంటున్నామని పాపనముసిలిపాళెంకు చెందిన గణేశం లక్ష్మీకాంతం కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొంత కాలం వివాదాలు నడుస్తున్నాయి. కావలి ఆర్డీఓ కోర్టుతో పాటు సివిల్‌ కోర్టులోనూ కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మహేంద్ర, సుబ్బారెడ్డి, తమ స్నేహితుడు సానా సుబ్బారెడ్డితో కలిసి పొలం వద్దకు చేరుకుని అక్కడ కర్రతుమ్మ చెట్ల తొలగింపు పనులను చేపట్టారు. దీంతో ముసిలిపాళెంకు చెందిన గణేశం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, మరి కొందరు పొలం వద్దకు చేరుకుని సానా మహేంద్ర, సానా సుబ్బారెడ్డి, కొండ్రెడ్డి సుబ్బారెడ్డి కళ్లలో కారం చల్లి, అక్కడతో ఉన్న కర్రతుమ్మ కర్రలతో తలలపై తీవ్రంగా కొట్టారు. దీంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.  
     లొంగిపోయిన నిందితులు 
    హత్య అనంతరం నిందితులు గణేశం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి కలిగిరి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. విషయం తెలియడంతో ఖాదర్‌బాషా సంఘటన స్థలానికి చేరుకుని పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కావలి డీఎస్పీ ఎస్‌.రాఘవరావు, ఉదయగిరి సీఐ శ్రీనివాసరావు, కొండాపురం, వింజమూరు, జలదంకి ఎస్‌ఐలు రమేష్‌బాబు, ప్రతాప్, ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కర్రలు, కారం ఫ్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.  
    మూడు కుటుంబాల్లో విషాదం :
    పొలం కొనుగోలు చేసి వృద్ధిలోకి వద్దామని ఆశ పడి ముగ్గురు హత్యకు గురి కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. హాత్యకు గురైన వారిలో సానా మహేంద్ర, కొండ్రెడ్డి సుబ్బారెడ్డి మండల వాసులు కావడంతో పాటు సానా సుబ్బారెడ్డికి కూడా మండలంలో బంధువుత్వాలు ఉన్నాయి. హత్యకు గురైన ముగ్గురు బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని రోదించడానికి అక్కడి వారిని కలచి వేసింది. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు పోలీసులను డిమాండ్‌ చేశారు. సానా మహేంద్ర బేల్దారి పనులు చేస్తూ కొండ్రెడ్డి సుబ్బారెడ్డి గోదెలతో కుటుంబ పోషణ జరుపుకుంటూ నెల్లూరులోని కిసాన్‌నగర్‌లో ఉంటున్నారు. సానా సుబ్బారెడ్డి  కొత్తకాలువ సెంటర్‌లో ఉంటూ లారీని బాడుగకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. సానా మహేంద్రకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొండ్రెడ్డి సుబ్బారెడ్డి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సానా సుబ్బారెడ్డికి భార్య ఉంది. కుటుంబాల పెద్దలను కోల్పోవడంతో ఆ కుటుంబాలు దిక్కులేని అవుతున్నాయని బందువులు ఆవేదన వ్యక్తం చేశారు. 
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement