Kaligiri
-
కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
సాక్షి అన్నమయ్య జిల్లా: కలికిరి జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేగింది. కడప జిల్లా, మైదుకూరు మండలం జీవి సత్రానికి చెందిన ప్రవీణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.ఈ నెల 12న కలికిరి జెన్టీయూలో బీటెక్ చదివేందుకు కాలేజీలో జాయిన్ అయ్యాడు. ప్రవీణ్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ఈ నెల 26న రాత్రి ఇంటికెళ్లి విషం తాగాడు. ఈ సంఘటనపై తల్లిదండ్రులు మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలికిరి సిఐ.. ప్రిన్సిపల్, తోటి విద్యార్థులను విచారించారు. ర్యాగింగ్ నిజమని తేలితే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ర్యాగింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత బంధువులు కోరుతున్నారు. -
‘కలికిరి’లో గోల్మాల్
చిత్తూరు, జేఎన్టీయూ(ఏ) పరిధిలోని కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నూతన ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఫర్నిచర్, ల్యాబ్ పరికరాల ఏర్పాటుకు సంబంధించి అధికార దుర్వినియోగం జరిగింది. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు, ఫర్నిచర్‌కు సంబంధించి ఎలాంటి టెండర్లు లేకుండానే కాంట్రాక్టర్‌కు కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ వ్యవహారంలో యూనివర్సిటీ ఖజానాకు భారీగా గండి పడింది. జేఎన్టీయూ: జేఎన్టీయూ కలికిరి ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి సంబంధించి జేఎన్టీయూ అనంతపురం–జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ యూనివర్సిటీల మధ్య 2014 ఫిబ్రవరి 5న అవగాహన ఒప్పందం కుదిరింది. భవన నిర్మాణ పనులకు సంబంధించి ప్లానింగ్, ఎక్స్కూషన్, టెండర్ సెలెక్షన్ ఆఫ్ ఏజెన్సీ, క్వాలిటీ కంట్రోల్, సూపర్విజన్, ల్యాబొరేటరీస్, సెమినార్ హాల్స్ తదితర అంశాల్లో జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఇందుకు నాలుగు శాతం కమీషన్‌ను జేఎన్టీయూ, అనంతపురం చెల్లిస్తుంది. అంటే జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ యూనివర్సిటీ కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. తిరిగి భవన నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్‌ను పిలిచారు. ఇందుకు సంబంధించి మరో ప్రైవేటు భవన నిర్మాణ సంస్థ నాలుగు శాతం ఎక్సెస్ టెండర్ కోట్ చేయడంతో పనులను అప్పగించారు. తొలుత రూ.295 కోట్లకు టెండర్లు ఖరారు చేయగా, సెమినార్ హాల్స్, ఇండోర్ స్టేడియం నిర్మాణం, ప్రాజెక్ట్ వ్యయం అంచనాల పెంపు తదితర కారణాలతో నిర్మాణ వ్యయం రూ.349 కోట్లకు చేరింది. అయితే నిర్మాణం పూర్తయిన తరువాత ఫర్నిచర్, ల్యాబ్ పరికాల ఏర్పాటుకు రూ.13 కోట్లు ఖర్చు చేశారు. వాస్తవానికి ఫర్నిచర్, ల్యాబ్ పరికరాల ఏర్పాటును ప్రత్యేకంగా టెండర్లు పిలిచి అప్పగించాల్సి ఉంది. కానీ నిబంధలకు విరుద్ధంగా రూ.13 కోట్లకు ఎలాంటి టెండర్లు లేకుండా భవన నిర్మాణ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారు. దీంతో ఎలాంటి బేరం లేకుండానే ఫర్నిచర్, ల్యాబ్ పరికరాలను అమర్చారు. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలిచి ఉంటే పోటీ పడి తక్కువ ధరకే విలువైన ఫర్నిచర్, ల్యాబ్ పరికరాలు కళాశాలకు అందేవి. తద్వారా వర్సిటీకి డబ్బు ఆదా అయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోడల్ కమిటీలో సభ్యులుగా ఉన్నా.. నూతన కళాశాల నిర్మాణానికి సంబంధించి విధి విధానాలు, నియమ నిబంధనల అమలు పర్యవేక్షణకు నోడల్ కమిటీని నియమించారు. ఇందులో జేఎన్టీయూ అనంతపురం వీసీ, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్, జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, చీఫ్ ఇంజినీర్, మరో సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యులుగా ఉన్నారు. జేఎన్టీయూ అనంతపురం.. భవన నిర్మాణ బిల్లులకు సంబంధించి నిధుల జారీ(ఫండ్స్ ట్రాన్స్ఫర్)ని జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ వర్సిటీకి ఇస్తారు. వీరు సంబంధిత కాంట్రాక్టరు లేదా భవన నిర్మాణ సంస్థకు బిల్లులు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపు, పనుల అంచనాల పెంపు, ఒప్పందంలో లేని నూతన అంశాలను ప్రస్తావించే క్రమంలో నోడల్ కమిటీ ఆమోదం తప్పనిసరి. ఫర్నిచర్ కొనుగోలుకు సంబంధించిన రూ.13 కోట్ల చెల్లింపులోనూ ఎలాంటి టెండర్లు లేకుండా అప్పటికే నిర్మాణం చేస్తున్న భవన నిర్మాణ సంస్థకు అప్పగించారు. అంటే నోడల్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. నోడల్ కమిటీలో ఉన్న జేఎన్టీయూ అనంతపురం వీసీ, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్.. ఈ ముగ్గురూ ఆమోదించినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా కోట్లాది రూపాయల పనులను ఎలాంటి టెండర్లు లేకుండా అప్పగించడం వివాదాస్పదమవుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడే నిర్ణయాలు తీసుకోవడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా ఫర్నిచర్, ల్యాబ్ పరికరాల కొనుగోలులో తమకు ఎలాంటి సంబంధం లేదని నోడల్ కమిటీలో ఉన్న జేఎన్టీయూ అనంతపురం వీసీ, రిజిస్ట్రార్ పేర్కొనడం కొసమెరుపు. -
ఈ చిన్నారికి 15 వేళ్లే
సాక్షి, నెల్లూరు(పొగతోట): ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారికి కాళ్లు, చేతులకు కలిపి 15 వేళ్లు మాత్రమే ఉన్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జీర్రావారిపాలెంకు చెందిన పి.సురేష్, సునీత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఐదు సంవత్సరాల క్రితం ప్రభుకుమార్ జన్మించాడు. పుట్టుకతోనే అతని కుడి చేతికి రెండు వేళ్లు, ఒక్కో కాలికి నాలుగేసి వేళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. ప్రభుకు దివ్యాంగుల పింఛన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే రేషన్‌కార్డు లేకపోవడంతో ముందుగా దాని కోసం దరఖాస్తు చేశారు. అయితే అధికారుల నుంచి స్పందనలేదు. దీంతో సునీత మంగళవారం ప్రభుకుమార్తో కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను వేడుకుంది. రేషన్‌కార్డు ఉంటేనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలువుతుందని త్వరగా స్పందించాలని కోరుతోంది. -
అవకతవకలకు పాల్పడితే చర్యలు
డ్వామా చీఫ్ విజిలెన్స్ అధికారి రమాంజనేయప్రసాద్ కలిగిరి: ఉపాధిహామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డ్వామా చీఫ్ విజిలెన్స్ ఆఫిసర్ బి.రామాంజనేయప్రసాద్ హెచ్చరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం సామాజిక తనిఖీ, మండల స్థాయి బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015- సెప్టెంబర్ 1 నుంచి 2016- ఆగష్టు 31వరకు మండలంలోని 23 పంచాయతీల పరిధిలో రూ.8.86 కోట్ల విలువ చేసే 3,107 పనులకు గ్రామస్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కొలతలు, చెక్‌డ్యాంలు (అలుగు) నిర్మాణాలపై ఉపాధిహామీ సిబ్బంది ఇచ్చిన వివరణపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. టీఏ నుంచి రూ.19.353 రికవరికి ఆదేశించారు. ఆరు చెక్‌డ్యామ్‌ల నాణ్యత, ప్రమాణాలు పరిశీలించాలని క్వాలీటీ కంట్రోల్‌కు సిఫార్సు చేశారు. వందల్లో రికవరి: ఉపాధిహామీ పథకం పనుల్లో సామాజిక తనిఖీలో పలు పంచాయతీల్లో రూ.వందల రికవరీలు వచ్చాయి. గ్రామాల్లో రూ.లక్షల్లో జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయని బలంగా ఆరోపణలు ఉన్నప్పటికీ రికవరీ వందల్లో ఉండటం విశేషం. డ్వామా ఏపీడీ ( ఫైనాన్స్ మేనేజర్ ) బీవీ ప్రభాకర్, జిల్లా విజిలెన్స్ అధికారి టి.శ్రీనివాసులురెడ్డి, ఏపీడీ వెంకటరావు, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి ఓవీ విజయ్‌కుమార్, ఎంపీపీ మద్దసాని వెంకటేశ్వరరావు, ఏపీఓ జ్యోతిరెడ్డి, పాల్గొన్నారు. -
అంతా..గంభీరం
భూవివాదంలో హతుల బంధువుల విచారణ మృతదేహాలను పోస్టుమార్టానికి తరలింపు ఏడుగురిపై కేసు నమోదు కలిగిరి : భూ వివాదంలో ముగ్గురి హత్యతో రణరంగమైన కలిగిరి పంచాయతీ పాపనముసిలిపాళెంలో శనివారం గంభీర వాతావరణం నెలకొంది. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటనలో గ్రామానికి చెందిన వారు బయటకు రాలేదు. స్థానికంగా ఉన్న హతుల బంధువులు సంఘట స్థలానికి చేరుకున్నారు. వారిని కావలి డీఎస్పీ ఎస్ రాఘవరావు విచారించారు. సానా మహేంద్రరెడ్డి (38), కొండ్రెడ్డి సుబ్బారెడ్డి (42), సానా సుబ్బారెడ్డి (45) మృతదేహాలను డీఎస్పీ ఎస్.రాఘవరావు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలం నుంచి నిందితులు హత్యకు ఉపయోగించిన కర్రలు, కారం పొడి ఫ్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఏడుగురు నిందితులు గుర్తింపు హతుడు సానా మహేంద్రరెడ్డి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రాఘవరావు తెలిపారు. పాపనముసిలిపాళెంకు చెందిన గణేశం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, లక్ష్మీదేవమ్మ, సుబ్బమ్మ, పద్మ, రాజశేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి హతుల కళ్లల్లో కారం చల్లి, కర్రతుమ్మ కర్రలతో కొట్టి చంపినట్లు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఇలా.. తప్పించుకున్న ఇద్దరు ముసిలిపాళెం పొలాల్లో శుక్రవారం జరిగిన హత్యల ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో తప్పించుకున్నారు. హతులు ముగ్గురు నెల్లూరులోని సత్యనారాయణపురానికి చెందిన అట్ల చినపెంచలరెడ్డిని తమ కారులో రాజుపాళెంలో పని ఉందని తీసుకువచ్చారు. అనంతరం కలిగిరిలోని పొలాల వద్దకు వెళ్లి వద్దామని శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో బయలు దేరారు. మధ్యలో వీరారెడ్డిపాళెంలో మరో వ్యక్తిని ఎక్కించుకున్నారు. కారులో ఐదుగురు పొలాల వద్దకు చేరుకున్నారు. పొలంలోకి కారు వెళ్లకపోవడంతో కాలినడక బయలు దేరారు. ముందుగా హతులు ముగ్గురు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న నిందితులు వారిపై దాడి చేయడాన్ని దూరం నుంచి చూసిన పెంచలరెడ్డితో మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. పెంచలరెడ్డి పరారవుతూ పొలంలోకి వస్తున్న హతుల్లోని ఒకరి బావమరిది కాకునూరు మల్లికార్జున్‌కు దాడి విషయం చెప్పి వెళ్లిపోయాడు. ఇలా పెంచలరెడ్డి ప్రాణాలతో తప్పించుకుని శనివారం సంఘటన స్థలానికి చేరుకున్నాడు. దాడిలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు పాల్గొనడం చూశానని పోలీసులకు చెప్పాడు. పెంచలరెడ్డి నుంచి పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో విచారణ : హత్యకు దారి తీసిన భూవివాదంపై తహసీల్దార్ రవీంద్రనాథ్‌తో కావలి డీఎస్పీ రాఘవరావు చర్చించారు. భూవివాదానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. భూమి వివరాల సమాచారాన్ని తీసుకున్నారు. ఆయన వెంట కావలి టౌన్, కావలి రూరల్, ఉదయగిరి సీఐలు ఏవీ రమణ, టి.అశోక్‌వర్దన్, జి. శ్రీనివాస్, ఎస్ఐలు ఖాదర్‌బాషా, రమేష్‌బాబు, ప్రతాప్, సిబ్బంది ఉన్నారు. -
ముగ్గురిని బలిగొన్న భూవివాదం
పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన ఇద్దరు నిందితులు కలిగిరి : భూవివాదం చినికిచినికి గాలివాన మారి..ముగ్గురు వ్యక్తుల దారుణహత్యకు దారి తీసింది. జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధుల సమాచారం మేరకు.. మండలంలోని కుమ్మరకొండూరుకు సానా మహేంద్రరెడ్డి (38), వీరారెడ్డిపాళెంకు చెందిన కొండ్రెడ్డి సుబ్బారెడ్డి (42), అనంతసాగరం మండలం వెంగంపల్లికి చెందిన సానా సుబ్బారెడ్డి (40) నెల్లూరులో స్థిర పడ్డారు. పాపనముసిలిపాళెం సమీపంలో వెంకన్నపాళెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1లో 36.64 పొలం ఉంది. ముసిపాళెం గ్రామస్తులు కొంత మంది అందులో 12.50 ఎకరాలు భూమిని కొన్నేళ్ల కింద విజయవాడకు చెందిన కంచర్ల ప్రభాకర్ కుటుంబ సభ్యులకు విక్రయించారు. నాలుగేళ్ల క్రితం ప్రభాకర్ కుమారుడు జనార్దన్ ఆ భూమిని సానా మహేంద్రరెడ్డి, కొండ్రెడ్డి సుబ్బారెడ్డిలకు విక్రయించాడు. ప్రస్తుతం 12.50 పొలం సానా మహేంద్ర, కొండ్రెడ్డి లక్ష్మీకాంతమ్మ పేర్లు మీద రిజిస్టర్ అయింది. అయితే ఆ పొలంపై తమకు కూడా హక్కులు ఉన్నాయని, పొలాన్ని తాము సాగు చేసుకుంటున్నామని పాపనముసిలిపాళెంకు చెందిన గణేశం లక్ష్మీకాంతం కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొంత కాలం వివాదాలు నడుస్తున్నాయి. కావలి ఆర్డీఓ కోర్టుతో పాటు సివిల్ కోర్టులోనూ కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మహేంద్ర, సుబ్బారెడ్డి, తమ స్నేహితుడు సానా సుబ్బారెడ్డితో కలిసి పొలం వద్దకు చేరుకుని అక్కడ కర్రతుమ్మ చెట్ల తొలగింపు పనులను చేపట్టారు. దీంతో ముసిలిపాళెంకు చెందిన గణేశం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, మరి కొందరు పొలం వద్దకు చేరుకుని సానా మహేంద్ర, సానా సుబ్బారెడ్డి, కొండ్రెడ్డి సుబ్బారెడ్డి కళ్లలో కారం చల్లి, అక్కడతో ఉన్న కర్రతుమ్మ కర్రలతో తలలపై తీవ్రంగా కొట్టారు. దీంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. లొంగిపోయిన నిందితులు హత్య అనంతరం నిందితులు గణేశం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి కలిగిరి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. విషయం తెలియడంతో ఖాదర్‌బాషా సంఘటన స్థలానికి చేరుకుని పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కావలి డీఎస్పీ ఎస్.రాఘవరావు, ఉదయగిరి సీఐ శ్రీనివాసరావు, కొండాపురం, వింజమూరు, జలదంకి ఎస్ఐలు రమేష్‌బాబు, ప్రతాప్, ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కర్రలు, కారం ఫ్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మూడు కుటుంబాల్లో విషాదం : పొలం కొనుగోలు చేసి వృద్ధిలోకి వద్దామని ఆశ పడి ముగ్గురు హత్యకు గురి కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. హాత్యకు గురైన వారిలో సానా మహేంద్ర, కొండ్రెడ్డి సుబ్బారెడ్డి మండల వాసులు కావడంతో పాటు సానా సుబ్బారెడ్డికి కూడా మండలంలో బంధువుత్వాలు ఉన్నాయి. హత్యకు గురైన ముగ్గురు బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని రోదించడానికి అక్కడి వారిని కలచి వేసింది. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు. సానా మహేంద్ర బేల్దారి పనులు చేస్తూ కొండ్రెడ్డి సుబ్బారెడ్డి గోదెలతో కుటుంబ పోషణ జరుపుకుంటూ నెల్లూరులోని కిసాన్‌నగర్‌లో ఉంటున్నారు. సానా సుబ్బారెడ్డి కొత్తకాలువ సెంటర్లో ఉంటూ లారీని బాడుగకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. సానా మహేంద్రకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొండ్రెడ్డి సుబ్బారెడ్డి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సానా సుబ్బారెడ్డికి భార్య ఉంది. కుటుంబాల పెద్దలను కోల్పోవడంతో ఆ కుటుంబాలు దిక్కులేని అవుతున్నాయని బందువులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రెజ్లింగ్‌లో కేజీబీవీ విద్యార్థినుల సత్తా
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక కలిగిరి : కలిగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో జరిగిన రెజ్లింగ్(కుస్తీ) పోటీల్లో సత్తాచాటారు. స్థానిక కేజీబీవీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు గురువారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఈటీ కే.కిరణ్మయి మాట్లాడుతూ విజయవాడ సమీపంలోని పేళ్లప్రోలులో ఈ నెల 12 నుంచి 14 వరకు రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు జరిగాయని, 66 కేజీల విభాగంలో పి.అన్విత, 43 కేజీల విభాగంలో ఎస్కే తస్లీమ ప్రథమ స్థానంలో, 38 కేజీల విభాగంలో ఎన్సుజిత ద్వితీయ స్థానంలో, 49 కేజీల విభాగంలో ఆర్.వెంగమ్మ తతీయ స్థానంలో నిలిచారని తెలిపారు. నవంబర్‌లో పుణేలో నిర్వహించే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనడానికి పి.అన్విత, ఎస్కే.తస్లీమ ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
ఫోర్జరీ సంతకాలపై పోలీసుల విచారణ
కలిగిరి : తహసీల్దార్, వీఆర్వోల స్టాంపులు, సంతకాలు ఫోర్జరీ చేసిన కేసుపై ఎస్సై ఎస్కే ఖాధర్‌బాష ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆయన తహసీల్దార్ రవీంద్రనాథ్ను కలిసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన మార్తులవారిపాలెంకు చెందిన మూలి పెంచలయ్య వీఆర్వో స్టాంపు, సంతకాలు ఫోర్జరీ చేసి కలిగిరిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో రుణాలు పొందడానికి ప్రయత్నించాడరన్నారు. ఏపీజీబీ బ్రాంచ్ మేనేజర్ మేనేజర్ ప్రదీప్ ఈ విషయాన్ని గుర్తించారన్నారు. ఎస్సై మాట్లాడుతూ ఫోర్జరీ సంతకాలతో రుణాల పొందడానికి ప్రయత్నించిన వ్యక్తితో పాటు అధికారుల స్టాంపులు తయారుచేసిన వారిపై, సంతాకాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ సూత్రదారులను వెలుగులోకి తీసుకువస్తామన్నారు. -
నకిలీలలు
కలిగిరి కేంద్రంగా నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీల తయారీ అధికారుల సంతకాలు ఫోర్జరీ బ్యాంకు రుణాల కోసం అడ్డదారులు తొక్కుతున్న రైతులు కలిగిరి: నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్, 1బీల తయారీకి కలిగిరి మండలం అడ్డాగా మారింది. అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు, మీసేవ నిర్వాహకుల సహకారంతో కొందరు పెద్దమొత్తంలో నగదు తీసుకుని నకిలీలను తయారు చేసి ఇస్తున్నారు. కొందరు రైతులు నకిలీల సాయంతో యథేచ్ఛగా బ్యాంకు రుణాలు పొందుతున్నారు. బ్యాంకుల్లో రుణాల్లో పొందే సమయంలో ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్తగా వెబ్‌ల్యాండ్‌లో తాత్కాలికంగా పేర్లు నమోదు చేస్తున్నారు. రుణాలు పొందిన అనంతరం వాటిని తొలగిస్తున్నారు. ఇందుకు మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లు సహకరిస్తున్నారు. కలిగిరిలో నకిలీ అడంగల్, 1బీ తయారీకి సహకరించారని కంప్యూటర్ ఆపరేటర్, మీసేవ నిర్వాహకునిపై తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. వెలుగులోకి వచ్చిన నకిలీ సంఘటనలు –గత ఏడాది జూన్ 24న కలిగిరిలోని ఏపీజీబీ బ్యాంకులో నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీలతో రుణాలు పొందేందుకు నలుగురు రైతులు ప్రయత్నించారు. అప్పటి తహసీల్దార్ లావణ్య ఫిర్యాదు మేరకు సదరు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. –గతేడాది జూన్ 27న కలిగిరి ఏపీజీబీ బ్యాంకులో మరో 9 నకిలీ పాసుపుస్తకాలను గుర్తించి ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. జూలై 6న జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్ తయారీదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ నకిలీలు చలామణి అవుతున్నాయి. –ఈ ఏడాది జూలై 12న కంప్యూటర్ ఆపరేటర్, మీసేవ నిర్వాహకుని సహకారంతో నకిలీ 1బీ, అడంగల్ తయారు చేసి కొందరు బ్యాంకులో రుణాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారని తెల్లపాడు గ్రామస్తులు తహసీల్దార్ రవీంద్రనాథ్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన తహసీల్దార్ కంప్యూటర్ ఆపరేటర్, మీసేవ నిర్వాహకుడు, మరికొందరిపై కేసు నమోదు చేయించారు. – తాజాగా ఈ నెల 8న మార్తులవారిపాళేనికి చెందిన మూలి పెంచలయ్య రెవెన్యూ అధికారుల సంతకాలు, స్టాంపులు ఫోర్జరీ చేయడం వెలుగులోకి వచ్చింది. దీనిపై తహసీల్దార్ పోలిసులకు ఫిర్యాదు చేశారు. సూత్రదారులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం మండలంలో యథేచ్ఛగా నకిలీ పాసుపుస్తకాలను తయారు చేస్తున్నా సూత్రధారులను పట్టుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నకిలీల తయారీదారులు మీసేవ కేంద్రాల నుంచి ఖాళీ సర్టిఫికెట్లను కొనుగోలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారుల స్టాంపులు, సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సష్టిస్తున్నారు. బ్యాంకు రుణాలను పొందవచ్చనే ఆశను చూపుతూ అమాయకులైన రైతులకు ఎరవేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ పత్రాలు బయటపడి కేసులు నమోదు చేస్తే నకిలీదారులు తప్పించుకుంటున్నారు. రైతులు మాత్రం బలవుతున్నారు. నకిలీలకు కొందరు అధికారులు, నాయకులు సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నారు. పోలీసులు సైతం నకిలీ పత్రాల తయారీదారులను పట్టుకోవడంలో చొరవచూపడం లేదు. కేసును సీఐడీకి బదిలీ చేశామని చెబుతూ తప్పించుకుంటున్నారు. నకిలీ పత్రాల తయారీదారులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం లేదని తహసీల్దారే ఆవేదన వ్యక్తం చేస్తుండడం చూస్తే వారికి ఉన్న అండదండలు ఏ పాటివో అర్ధమవుతోంది. -
శ్రీవెంకటేశ్వరస్వామి ఆభరణాలు లభ్యం
కలిగిరి : కలిగిరిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి గురైన కొన్ని ఆభరణాలను దొంగలు శనివారం ఆలయం ప్రాంగణంలో వదిలి వెళ్లారు. పోలీసులు ఆలయ కమిటీ సభ్యుల సమాచారం మేరకు.. గత నెల 1వ తేదీ అర్ధరాత్రి ఆలయంలో సుమారు రూ.3 లక్షల విలువైన ఆభరణాలు, హుండీలోని నగదు చోరీకి గురైన విషయం తెలిసిందే. అదే నెల 7వ తేదీన కలిగిరి, జలదంకి సరిహద్దు పొలాల్లోని కాలువలో రెండు ప్రాంతాల్లో కొన్ని ఆభరణాలను దొంగలు పూడ్చిపెట్టిన వాటిని రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన వాటిలో మరి కొన్ని వస్తువులను శనివారం సిమెంట్ బస్తాలో మూట కట్టి ఆలయ ఆవరణలో వదిలి వెళ్లారు. ఆలయంను శుభ్రపరిచే మహిళ గమనించి పూజారికి సమాచారం ఇచ్చింది. పూజారి అందుబాటులో లేక పోవడంతో ఆలయ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఎస్సై ఎస్కే ఖాధర్‌బాషా ఆలయం వద్దకు చేరుకొని దొంగలు వదిలి వెళ్లిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు తాళి బొట్లు, హుండీలో నగదు దొరకాల్సి ఉందని పోలీసులు తెలిపారు. స్థానికుల పాత్రపై అనుమానాలు ఆలయంలో చోరీకి పాల్పండింది మండలానికి చెందిన వ్యక్తులేననే ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి. పోలీసులు కూడా ఆ కోణంలో మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన వస్తువులు మండలంలో పరిధిలో దొరుకుతుండటం కూడా స్థానికుల పాత్ర ఉన్నది అనే అనుమానాలకు బలం చేకురుస్తున్నాయి. -
లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పోలంపాడు వద్ద లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులు మండంలోని వీరారెడ్డి పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
కలిగిరి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ ముగ్గురు వ్యక్తులు గ్రామస్తులకు పట్టుబడ్డారు. వీర్నకల్లు గ్రామ చెరువులో మంగళవారం రాత్రి తవ్వకాలు జరుపుతున్న ముగ్గురు వ్యక్తుల్ని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా తాము మొత్తం ఏడుగురమని, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నామని వారు విచారణలో వెల్లడించారు. దీంతో మిగతా నలుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పట్టుబడిన వారిలో ఇదే మండలానికి చెందిన శ్రీరాములు, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. -
రెండు ఆటోలు ఢీ: నలుగురు మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెదపాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండో ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. వీరంతా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు
భూప్రకంపనలు నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసులను వణికించాయి. స్వల్పంగా భూమి కంపించడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. నెల్లూరు జిల్లా కొండాపురం, కలిగిరిలో బుధవారరం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచెర్ల, బలిజిపాలెం గ్రామాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందారు. నివాసాల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. మళ్లీ భూమి కంపిస్తుందేమోన్న భయంతో ఇళ్ల బయటే ఉన్నారు.