అంతా..గంభీరం
-
భూవివాదంలో హతుల బంధువుల విచారణ
-
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలింపు
-
ఏడుగురిపై కేసు నమోదు
కలిగిరి :
భూ వివాదంలో ముగ్గురి హత్యతో రణరంగమైన కలిగిరి పంచాయతీ పాపనముసిలిపాళెంలో శనివారం గంభీర వాతావరణం నెలకొంది. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటనలో గ్రామానికి చెందిన వారు బయటకు రాలేదు. స్థానికంగా ఉన్న హతుల బంధువులు సంఘట స్థలానికి చేరుకున్నారు. వారిని కావలి డీఎస్పీ ఎస్ రాఘవరావు విచారించారు. సానా మహేంద్రరెడ్డి (38), కొండ్రెడ్డి సుబ్బారెడ్డి (42), సానా సుబ్బారెడ్డి (45) మృతదేహాలను డీఎస్పీ ఎస్.రాఘవరావు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలం నుంచి నిందితులు హత్యకు ఉపయోగించిన కర్రలు, కారం పొడి ఫ్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఏడుగురు నిందితులు గుర్తింపు
హతుడు సానా మహేంద్రరెడ్డి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రాఘవరావు తెలిపారు. పాపనముసిలిపాళెంకు చెందిన గణేశం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, లక్ష్మీదేవమ్మ, సుబ్బమ్మ, పద్మ, రాజశేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి హతుల కళ్లల్లో కారం చల్లి, కర్రతుమ్మ కర్రలతో కొట్టి చంపినట్లు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు.
ఇలా.. తప్పించుకున్న ఇద్దరు
ముసిలిపాళెం పొలాల్లో శుక్రవారం జరిగిన హత్యల ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో తప్పించుకున్నారు. హతులు ముగ్గురు నెల్లూరులోని సత్యనారాయణపురానికి చెందిన అట్ల చినపెంచలరెడ్డిని తమ కారులో రాజుపాళెంలో పని ఉందని తీసుకువచ్చారు. అనంతరం కలిగిరిలోని పొలాల వద్దకు వెళ్లి వద్దామని శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో బయలు దేరారు. మధ్యలో వీరారెడ్డిపాళెంలో మరో వ్యక్తిని ఎక్కించుకున్నారు. కారులో ఐదుగురు పొలాల వద్దకు చేరుకున్నారు. పొలంలోకి కారు వెళ్లకపోవడంతో కాలినడక బయలు దేరారు. ముందుగా హతులు ముగ్గురు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న నిందితులు వారిపై దాడి చేయడాన్ని దూరం నుంచి చూసిన పెంచలరెడ్డితో మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. పెంచలరెడ్డి పరారవుతూ పొలంలోకి వస్తున్న హతుల్లోని ఒకరి బావమరిది కాకునూరు మల్లికార్జున్‌కు దాడి విషయం చెప్పి వెళ్లిపోయాడు. ఇలా పెంచలరెడ్డి ప్రాణాలతో తప్పించుకుని శనివారం సంఘటన స్థలానికి చేరుకున్నాడు. దాడిలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు పాల్గొనడం చూశానని పోలీసులకు చెప్పాడు. పెంచలరెడ్డి నుంచి పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో విచారణ :
హత్యకు దారి తీసిన భూవివాదంపై తహసీల్దార్ రవీంద్రనాథ్‌తో కావలి డీఎస్పీ రాఘవరావు చర్చించారు. భూవివాదానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. భూమి వివరాల సమాచారాన్ని తీసుకున్నారు. ఆయన వెంట కావలి టౌన్, కావలి రూరల్, ఉదయగిరి సీఐలు ఏవీ రమణ, టి.అశోక్‌వర్దన్, జి. శ్రీనివాస్, ఎస్‌ఐలు ఖాదర్‌బాషా, రమేష్‌బాబు, ప్రతాప్, సిబ్బంది ఉన్నారు.