జనగామలో రిటైర్డ్‌ ఎంపీడీఓ సుపారీ హత్య!? | - | Sakshi
Sakshi News home page

జనగామలో రిటైర్డ్‌ ఎంపీడీఓ సుపారీ హత్య!?

Jun 18 2023 6:02 AM | Updated on Jun 18 2023 12:38 PM

రామకృష్ణయ్య (ఫైల్‌)  - Sakshi

రామకృష్ణయ్య (ఫైల్‌)

బచ్చన్నపేట/జనగామ: జనగామ జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన రిటైర్డ్‌ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య (70) దారుణ హత్యకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. అయినా మృతదేహం ఆచూకీ లభించలేదు. మూడు రోజులుగా మిస్టరీకి తెరపడినట్లు పోలీసులు సూచనప్రాయంగా అంగీకరిస్తున్నా.. క్లారిటీ ఇవ్వడం లేదు. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో... వరంగల్‌ కమిషనర్‌ రంగనాథ్‌ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్‌పై స్థానిక పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్‌ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో..

రామకృష్ణయ్య హత్య సమాచారం శనివారం సాయంత్రం బయటకు వచ్చింది. జనగామ మండలం సరిహద్దు చినరామన్‌చర్ల–పెదరామన్‌చర్ల శివారు చెరువు వద్ద మృతదేహం ఉన్నట్లు మొదటగా పుకార్లు వినిపించగా... ఆ తర్వాత చంపక్‌హిల్స్‌ క్రషర్‌ సమీపంలోని లోయ(చెరువు) వద్ద ఉందని తెలిసింది. ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు రాత్రి వరకు ఆరా తీశారు. దీనిపై అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో... మృతదేహం ఆచూకీ లభ్యమైనప్పటికీ పోలీసులు గోప్యత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు రోజులుగా విచారణ
బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన నల్లా రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పనిచేశారు. రిటైర్డ్‌ అయిన తర్వాత ఇంటి వద్ద ఉంటూ.. ఆర్టీఏ కార్యకర్తగా యాక్టివ్‌గా పని చేస్తున్నాడు. అతను ఈ నెల15న మధ్యాహ్నం మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్‌ కేశ్వాపురం వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించి, ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

కిడ్నాప్‌ చేసే సమయంలో రామకృష్ణయ్య సెల్‌ఫోన్‌ దారిలో పడిపోయింది. సెల్‌ సిగ్నల్‌ను ట్రాక్‌ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ జిల్లా ప్రజా ప్రతినిధి భర్తతోపాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కిడ్నాప్‌నకు పాల్పడింది అధికార పార్టీకి చెందిన వ్యక్తి అని బాధితులు ఫిర్యాదు చేయడంతో.. సీపీ రంగనాథ్‌ స్వయంగా రంగంలోకి దిగారు. టాస్క్‌ఫోర్స్‌ టీం సీఐతోపాటు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి లోతుగా విచారణ జరిపిస్తున్నారు. ఆయన హత్యకు ముందస్తు ప్లాన్‌ వేసి, సుపారీ గ్యాంగ్‌కు పెద్దఎత్తున ముట్టజెప్పినట్లు భావిస్తున్నారు.

హత్యకు దారితీసిన ఉదంతం?
ఇటీవల గోపాల్‌నగర్‌ శివారులోని ఓ సర్వే నంబర్‌లోని భూమిలో నిరుపేదలు గుడిసెలు వేశారు. తన భూమిలో గుడిసెలు ఎలా వేస్తారని ఓ బీఆర్‌ఎస్‌ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు భూమి ప్రభుత్వ/అసైన్డ్‌ పరిధిలో ఉందని రామకృష్ణయ్య వారికి భరోసా ఇస్తుండడంతో.. గుడిసెలు వేశారని సదరు బీఆర్‌ఎస్‌ నేత అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తమ విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.

పోలీసులు పట్టించుకోలేదు..
తమ తండ్రి రామకృష్ణయ్యను కిడ్నాప్‌ చేసిన రోజు నే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, దర్యాప్తు ఆలస్యం చేయడంతోనే ఇంతపని జరిగిందని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. జెడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త, బీఆర్‌ఎస్‌ నేత అంజయ్యనే హత్య చేయించారని కుమారులు అశోక్‌, శ్రావణ్‌, భరత్‌ తెలిపారు. ఎమ్మెల్యే కూడా వెనకుండి నడిపించారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement