ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని నమ్మించి ఇంటిని అమ్ముతానని అడ్వాన్స్ తీసుకొని ముఖం చాటేసిన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐ తండ్రీకొడుకులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీకి చెందిన మామిడి చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు మామిడి హరీష్‌రెడ్డి యూఎస్‌ఏలో స్థిరపడ్డారు. అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళ్తుండే చంద్రశేఖర్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.2లోని ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీలో తన కుమారుడు హరీష్ పేరు మీద ఉన్న 500 గజాల స్థలంలోని ఇంటిని అమ్ముతానంటూ ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్న వ్యాపారి వట్టి్టకూటి శ్రీకాంత్‌ను నమ్మించాడు.
చదవండి: వ్యభిచారానికి ఒప్పుకోలేదని సొంత చెల్లిని హతమార్చిన అక్క
తన కుమారుడు పేరుతో ఉన్న ఈ ఇంటిపై ఎలాంటి వివాదాలు లేవని, తనకు జీపీఏ ఉందని బ్యాంకుల్లో కూడా రుణాలు లేవని, క్లియర్ టైటిల్‌తో ఉందని నమ్మించాడు. ఇందుకోసం రూ.7.75 కోట్లకు బేరం కుదుర్చుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో అడ్వాన్స్‌గా రూ.25 లక్షలను కుమారుడి ఖాతాలో వేయించుకున్నాడు. నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీకాంత్ ఆరా తీయగా సదరు ఇంటిపై బ్యాంకులో రుణంతో పాటు పలు కేసులు కూడా ఉన్నాయని తేలింది. తాను మోసపోయినట్లు గుర్తించి డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరగా తండ్రీకొడుకులు ముఖం చాటేశారు.
ఇదిలా ఉండగా ఇదే ఇంటిని రాజేష్‌రెడ్డి అనే వ్యక్తికి అధిక ధరకు అమ్మేందుకు నిబంధనలకు విరుద్ధంగా మరో ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా రూ.2 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడని తేలడంతో తండ్రీకొడుకులు ఉద్దేశపూర్వకంగానే తనను మోసం చేశారంటూ గుర్తించిన శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రశేఖర్‌రెడ్డి, హరీష్‌రెడ్డిలపై పోలీసులు ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment