శ్రీవెంకటేశ్వరస్వామి ఆభరణాలు లభ్యం
కలిగిరి : కలిగిరిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి గురైన కొన్ని ఆభరణాలను దొంగలు శనివారం ఆలయం ప్రాంగణంలో వదిలి వెళ్లారు. పోలీసులు ఆలయ కమిటీ సభ్యుల సమాచారం మేరకు.. గత నెల 1వ తేదీ అర్ధరాత్రి ఆలయంలో సుమారు రూ.3 లక్షల విలువైన ఆభరణాలు, హుండీలోని నగదు చోరీకి గురైన విషయం తెలిసిందే. అదే నెల 7వ తేదీన కలిగిరి, జలదంకి సరిహద్దు పొలాల్లోని కాలువలో రెండు ప్రాంతాల్లో కొన్ని ఆభరణాలను దొంగలు పూడ్చిపెట్టిన వాటిని రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన వాటిలో మరి కొన్ని వస్తువులను శనివారం సిమెంట్ బస్తాలో మూట కట్టి ఆలయ ఆవరణలో వదిలి వెళ్లారు. ఆలయంను శుభ్రపరిచే మహిళ గమనించి పూజారికి సమాచారం ఇచ్చింది. పూజారి అందుబాటులో లేక పోవడంతో ఆలయ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఎస్సై ఎస్‌కే ఖాధర్‌బాషా ఆలయం వద్దకు చేరుకొని దొంగలు వదిలి వెళ్లిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు తాళి బొట్లు, హుండీలో నగదు దొరకాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
స్థానికుల పాత్రపై అనుమానాలు
ఆలయంలో చోరీకి పాల్పండింది మండలానికి చెందిన వ్యక్తులేననే ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి. పోలీసులు కూడా ఆ కోణంలో మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన వస్తువులు మండలంలో పరిధిలో దొరుకుతుండటం కూడా స్థానికుల పాత్ర ఉన్నది అనే అనుమానాలకు బలం చేకురుస్తున్నాయి.