అవకతవకలకు పాల్పడితే చర్యలు
-
డ్వామా చీఫ్ విజిలెన్స్ అధికారి రమాంజనేయప్రసాద్
కలిగిరి: ఉపాధిహామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డ్వామా చీఫ్ విజిలెన్స్ ఆఫిసర్ బి.రామాంజనేయప్రసాద్ హెచ్చరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం సామాజిక తనిఖీ, మండల స్థాయి బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015- సెప్టెంబర్ 1 నుంచి 2016- ఆగష్టు 31వరకు మండలంలోని 23 పంచాయతీల పరిధిలో రూ.8.86 కోట్ల విలువ చేసే 3,107 పనులకు గ్రామస్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కొలతలు, చెక్‌డ్యాంలు (అలుగు) నిర్మాణాలపై ఉపాధిహామీ సిబ్బంది ఇచ్చిన వివరణపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. టీఏ నుంచి రూ.19.353 రికవరికి ఆదేశించారు. ఆరు చెక్‌డ్యామ్‌ల నాణ్యత, ప్రమాణాలు పరిశీలించాలని క్వాలీటీ కంట్రోల్‌కు సిఫార్సు చేశారు.
వందల్లో రికవరి:
ఉపాధిహామీ పథకం పనుల్లో సామాజిక తనిఖీలో పలు పంచాయతీల్లో రూ.వందల రికవరీలు వచ్చాయి. గ్రామాల్లో రూ.లక్షల్లో జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయని బలంగా ఆరోపణలు ఉన్నప్పటికీ రికవరీ వందల్లో ఉండటం విశేషం. డ్వామా ఏపీడీ ( ఫైనాన్స్ మేనేజర్ ) బీవీ ప్రభాకర్, జిల్లా విజిలెన్స్ అధికారి టి.శ్రీనివాసులురెడ్డి, ఏపీడీ వెంకటరావు, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి ఓవీ విజయ్‌కుమార్, ఎంపీపీ మద్దసాని వెంకటేశ్వరరావు, ఏపీఓ జ్యోతిరెడ్డి, పాల్గొన్నారు.