
దర్జాగా కబ్జా
రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై టీడీపీ నాయకుల కన్ను
ప్రభుత్వ స్థలమే అని కోర్టు చెప్పినా నిర్మాణాలు చేపడుతున్న వైనం
ధర్మవరం : అదో ప్రభుత్వ స్థలం. కొందరు నాయకులు ఆక్రమిస్తున్నారని ప్రజాప్రతినిధులు చెప్పినా..అధికారులు పట్టించుకోలేదు. కబ్జాదారులు లెక్కచేయలేదు. కోర్టు సైతం ఆ స్థలం ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పినా.. అధికారం మాది అంటూ హస్తలాఘవం చూపుతున్నారు..ముదిగుబ్బ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు. వివరాలిలా ఉన్నాయి.
ముదిగుబ్బ మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములు, స్థలాలు చాలా విలువ చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సెంటు భూమి దాదాపు రూ.20లక్షల మేర పలుకుతోంది. స్థానిక ముదిగుబ్బ పోలీస్‌స్టేçÙ¯ŒS ఎదురుగా రోడ్డు పక్కనే (సర్వే నెంబర్ 905 బీ9. బీ10. బీ11. బీ12లో) 12సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. 11ఏళ్ల క్రితం ఈ స్థలంలో ఇద్దరు రెవెన్యూ ఆర్‌ఐలు, ఒక విశ్రాంత వీఆర్‌ఓ, మరికొందరు నాయకులు కలిసి ఈ స్థలానికి ప్రభుత్వం నుంచి పట్టా తెచ్చుకున్నట్లు దొంగ పట్టాలు వారి పేర్లమీద సృష్టించుకుని అందులో భవన నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారంటూ 2005లో కొందరు టీడీపీ నాయకులు తెర వెనక ఉండి స్థానికులతో హైకోర్టులో పిల్ వేయించారు. ఈ వివాదాన్ని పూర్తిగా విచారించిన కోర్టు పట్టాలు నకిలీవని, ఆ స్థలం ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో సదరు వ్యక్తులు సుప్రీం కోర్టులో సైతం మళ్లీ కోర్టుకు వెళ్లగా అక్కడ కూడా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. దీంతో సదరు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను ఆపి వేసి మిన్నకుండిపోయారు. నాటి నుంచి ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది.
అయితే ఈ స్థలంపై కన్నేసిన అధికార పార్టీ మండల నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మండలంలో కీలకంగా వ్యవహరించే ముగ్గురు టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రాత్రికి రాత్రే ఆ స్థలంలో రాళ్లు, ఇసుకు తోలి గతంలో అర్ధంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలపై కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఈ కబ్జాల పర్వాన్ని మండల ప్రజలు ముదిగుబ్బ ఎంపీపీ వేలూరి మాలతి దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఎంపీపీ కబ్జా విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోయింది. దీంతో ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ కోన శశిధర్ ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, అక్కడ నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అయినా సరే.. ఆక్రమణదారులు పట్టపగలే ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడతున్నారు. ఇది తెలిసినా అధికార పార్టీ నేతలతో కుమ్మక్కైన స్థానిక రెవెన్యూ అధికారులు కన్నెత్తికూడా చూడలేదు. ఇప్పటిౖకెనా ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.