
వుడా గడబిడ!
విశాఖపట్నం : దాదాపు పదేళ్ల క్రితం పరదేశిపాలెంలో ల్యాండ్ పూలింగ్ చేపట్టినప్పుడు భారీ కుంభకోణం చోటు చేసుకుంది. అప్పట్లో వుడాలో పనిచేసిన జగదీష్ అనే అధికారి సూత్రధారిగా ఆయన బినామీలు, కొంతమంది ఉద్యోగులు, మరికొందరు ఉన్నత స్థానంలో ఉన్న వారితో పాటు వ్యాపారులు కలిసి అక్రమాలు, అవకతవకలకు తెరలేపారు. పరదేశిపాలెం, కొమ్మాది, మధురవాడ, రుషికొండ తదితర ప్రాంతాల్లోని అసైన్డ్ భూములను గుర్తించి ల్యాండ్ పూలింగ్‌లో సేకరించేందుకు పథకం పన్నారు.
సంబంధిత రైతుల నుంచి డి–ఫారం పట్టా భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి బినామీల పేరిట జీపీఏ (జనరల్ పవరాఫ్ అటార్నీ) రాయించుకున్నారు. ఈ జీపీఏలతో ఆ భూములను వుడాకు అమ్మకాలు చేసి కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. ఈ వ్యవహారంలో దాదాపు రూ.500 కోట్లు అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పెను దుమారం రేపిన ఈ వ్యవహారంపై అప్పట్లో అరెస్టులు, సీఐడీ దర్యాప్తులు నడిచాయి. ఇంకా దానిపై కేసులు నడుస్తున్నాయి. బినామీల అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి.
పదేళ్ల తర్వాత వుడా మళ్లీ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమయింది. సేకరించిన భూమిని అభివృద్ధి చేయడం ద్వారా వుడా నిధులు సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. గత నవంబర్‌లో జారీ అయిన జీవోతో ల్యాండ్ పూలింగ్‌కు వుడా అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల బంధువులు, అనుచరులు, దళారులు రంగంలోకి దిగి అసైన్డ్ భూములను దక్కించుకునే పనిలో పడ్డారు. ఈ భూముల యజమానుల నుంచి తీసుకునే భూమికి కొంత అడ్వాన్సుగా ఇచ్చి వాటిని తమ పేరిట మార్చుకోవడం ప్రారంభించారు. పదేళ్ల క్రితం మాదిరిగానే రూ.కోట్లు కొల్లగొట్టేయాలన్న పథకం బట్టబయలయింది.
ఈ వ్యవహారంలో వుడాలో కొంతమంది అధికారుల పాత్రపైనా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వుడా ల్యాండ్ పూలింగ్‌లో జరుగుతున్న అక్రమాలను సాక్షి దినపత్రికలో కళ్లకు కట్టినట్టు ప్రచురితమవడంతో ఒక్కసారిగా ఇటు అధికార పార్టీలోనూ, అటు వుడా వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేగుతోంది. గతంలో పరదేశిపాలెం ల్యాండ్ పూలింగ్ కుంభకోణం నుంచి గుణపాఠం నేర్చుకోని వుడా అధికారులు మళ్లీ అక్రమాలకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో తమ పాత్రేమీ లేదని, ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని వుడా అధికారులు చెబుతున్నా తెర వెనక కొంతమంది ముదిరిపోయిన అధికారులు ఇందులో తెరవెనక పాత్ర పోషిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత ల్యాండ్‌పూలింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్ వరకు వెళ్లివచ్చిన అధికారే ఇప్పటికీ అదే స్థానంలో పదిలంగా ఉండటం వీరి వాదనకు బలం చేకూరుతోంది.
ల్యాండ్ పూలింగ్‌లో సుమారు రెండు వేల ఎకరాలను సేకరించాలన్న లక్ష్యంగా పెట్టుకున్న వుడాకు ఆ దిశగా పయనిస్తున్న తరుణంలో ఆదిలోనే హంసపాదులా తాజా వివాదం అడ్డుకట్ట వేసింది. అవినీతి, అక్రమాలు వెలుగు చూసిన నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ ఎంతవరకు ముందుకెళ్తుందో? తమ ప్రమేయం ఎక్కడ బయటకు వస్తుందోనని ఇందులో పాత్ర పోషిస్తున్న అధికారుల్లో అలజడి రేగుతోంది.