
‘స్థిరాస్తి’ రంగం జోరు!
సాక్షి, సిటీబ్యూరో: మహానగర శివార్లలో కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాటుతో స్థిరాస్తి రంగం జోరందుకుంటోంది. ఒకేసారి క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. కేవలం ఆరు మాసాల్లో రెండు లక్షలకు పైగా స్థిరాస్తుల దస్తావేజులు నమోదైనట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. స్థిరాస్తి వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలు పరుగులు తీస్తున్నాయి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు వెంచర్లుగా మారుతున్నాయి.
వాస్తవంగా రాష్ట్ర విభజన అనంతరం స్థిరాస్తి రంగం జీవం పోసుకుంది. అప్పటివరకు నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి మంత్రంతో కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు. కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు. కార్యాలయాలు తరలి రావడం స్థిరాస్తి రంగానికి మరింత కలిసి వచ్చినట్లయింది. తాజాగా నగర శివారులో శంషాబాద్(రంగారెడ్డి), మల్కాజిగిరి (మేడ్చల్) జిల్లా కేంద్రాల ఏర్పాటు దృష్ట్యా రహదారులు, ఇతర మౌళిక వసతులు అభివృద్ధికి అస్కారం ఉండటంతో భూములు, ప్లాట్లకు డిమాండ్ పెరిగినట్లయింది.
కాసుల పంట..
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖకు కాసుల పంట పండుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరం..మొదటి ఆరు మాసాల్లో రాష్ట్రం మొత్తం మీద రూ.1935.30 కోట్ల ఆదాయం లభించగా, అందులో రూ.1359 కోట్లు మహానగరం నుంచే రాబడిగా నమోదు కావడం విశేషం. గత ఆరు మాసాల నుంచి వరుసగా నెలసరి ఆదాయం రెండువందల కోట్లకు తగ్గడం లేదు.
గతేడాదితో పోల్చితే ఈసారి 35 శాతం పైగా ఆదాయం వృద్ధి పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా నగర శివార్లలోని ఉప్పల్, మేడిపల్లి, నారపల్లి, ఘట్‌కేసర్, కీసర, నాగారం, షామీర్‌పేట, మేడ్చల్, మహేశ్వరం, ఎల్‌బీనగర్, ఇబ్రాహీంపట్నం తదితర ప్రాంతాల్లో భూములపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. దీంతో క్రయవిక్రయాలు పెరగడంతోపాటు ధరలు సైతం రెట్టింపయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాబడి పరిస్థితి
జిల్లా 2014–15 2015–16 2016–17
ఆదాయం ఆదాయం ఆదాయం (రూ.కోట్లలో)
హైదరాబాద్ రూ.359.77 రూ. 327.49 రూ.445.77
రంగారెడ్డి రూ.479.53 రూ.714.34 రూ.953.71