భూమ్.. ఢామ్
భూమ్.. ఢామ్
Published Mon, Nov 21 2016 11:12 PM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
పొలాల ధరలు పతనం
పెద్దనోట్ల రద్దుతో నిలిచిన క్రయవిక్రయాలు
రిజిస్ట్రేషన్ల ఆదాయానికీ గండి
భీమవరం ప్రకాశం చౌక్: పెద్ద నోట్లు ప్రభావం జిల్లాలో పొలాల క్రయవిక్రయాలపై పడింది. నిన్నమొన్నటి వరకు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో పొలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఎకరా రూ.కోటి వరకు పలికిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొలాల క్రయవిక్రయాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిన వ్యాపారం పెద్దనోట్ల రద్దుతో 13 రోజులుగా ఢీలా పడింది.
కచ్చితంగా అమ్మాలంటే ఇబ్బందే..
పొలాలు కొనుగోలు చేసే నాథుడు లేకపొవడంతో తమ అవసరాలకు కచ్చితంగా పొలం అమ్మాలనుకునే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో డెల్టాతో పాటు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
పొలాల ధరలు పతనం
క్రయ విక్రయాలు నిలిచిపోవడం, పెద్దనోట్ల రద్దుతో ఎకరా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర తగ్గినట్టు తెలుస్తోంది. భీమవరం ప్రాంతంలోని గ్రామాల్లో ఎకరా రూ.30 నుంచి రూ.45 లక్షల వరకు, పట్టణానికి ఆనుకుని ఉన్న పొలాలు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పలకగా ఇప్పుడు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తగ్గినట్టు సమాచారం. పూర్తిగా వైట్ మనీతో లావాదేవీలు నిర్వహించడం, బ్యాంకుల్లో నగదు కొరత ప్రభావం కారణంగా కనిపిస్తున్నాయి.
తగ్గిన రిజిస్ట్రేషన్లు
పెద్ద నోట్లు రద్దుతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పొలాలు రిజిస్ట్రేషనులు తక్కువగా జరుగుతున్నాయి. కేవలం బ్యాంకు డీడీలు, చెక్కుల లావాదేవీలు, పంపకం రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. జిల్లాలో 27 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా గత అక్టోబర్ వరకు నెలకు ప్రతి రిజిస్ట్రార్ కార్యాలయంలో 20 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు జరగ్గా గత 13 రోజులుగా ఈ సంఖ్య 3 నుంచి 6కు పడిపోయింది.
ఒప్పందం కుదుర్చుకున్నవి..
పెద్దనోట్ల రద్దుకు ముందు కుదిరిన ఒప్పందాల మేరకు కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అంటే అక్టోబరు నెలలో పొలాలు అమ్మిన రైతులకు సొమ్ము చెల్లించినవి, ముందుగా అడ్వాన్సు ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్న లావాదేవీలు జరుగుతున్నాయి. ఆస్తుల పంపకాలు, బంధువులకు సంబంధించిన పొలాల సెటిల్‌మెంట్లు, సొమ్ములు అవసరం లేని లావాదేవీలకు సంబంధించిన విక్రయాలు కూడా తక్కువ స్థాయిలో ఉన్నాయి.
ప్రభుత ఆదాయానికి గండి
పెద్ద నోట్లు రద్దుతో పొలాల రిజస్ట్రేషన్లు భారీగా తగ్గడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడింది. పొలం ధరలో రూ.లక్షకు రూ.7,500 రిజిస్ట్రేషన్ సమయంలో ఫీజుగా చెల్లించాలి. ఈ ఆదాయానికి బ్రేకు పడింది. పొలాల రిజిస్ట్రేషన్ల ద్వారా జిల్లాలో ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి నెలకు సుమారు రూ.15 నుంచి రూ.18 లక్షల ఆదాయం వస్తుండగా ఈనెలలో మూడు వారాలు గడిచినా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు ఆదాయం పడిపోయింది.
పొలాల క్రయ విక్రయాలు లేవు:
పెద్ద నోట్ల రద్దుతో అన్ని వ్యాపారాలతో పాటు రియల్‌ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. పొలాల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. పొలాలు అమ్మేవారు, కొనేవారు కనిపించడం లేదు. పొలాలు ధరలు కూడా గతంలో కంటే కచ్చితంగా తగ్గుతాయి. ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్, పొలాలు కొనుగోలు వ్యాపారాలు నిలిచిపోయాయి.
బోడపాటి పెదబాబు, రియల్ వ్యాపారి
రిజస్ట్రేషన్ల సంఖ్య తగ్గింది
అన్ని రకాల రిజిస్ట్రేషన్ల సంఖ్య గతనెల కంటే భారీగా తగ్గింది. దీనిలో పొలాల రిజస్ట్రేషన్లు కూడా ఉన్నాయి. పంపకం, బంధువుల సెటిల్‌మెంట్, నగదురహిత లావాదేవీలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. డీడీలు, చెక్కులతో జరిగే లావాదేవీల రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. పెద్దనోట్ల రద్దు ప్రభావం దీనిపైనా పడింది.
మొహమ్మద్ సిరాజుల్లా, జిల్లా రిజిస్ట్రార్
Advertisement