భూముల విలువకు రెక్కలు
- ఆగస్టు 1వ తేదీ నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు
- ఆదేశాలిచ్చిన సర్కారు
- కసరత్తులో రిజిస్ట్రేషన్ అధికారులు
- 10 నుంచి 25 శాతం వరకు పెరుగుదల
- గ్రామాల్లో 25 శాతం వరకు పెంపు ?
భూములు, భవనాల విలువలకు త్వరలో రెక్కలు రానున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పెంపుదల ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఆ దిశగా ఇప్పటికే జిల్లా రిజిస్ట్రేషన్ యంత్రాంగం కసరత్తు చేపట్టింది. ప్రస్తుత విలువపై 10 నుంచి 25 శాతం వరకు భూముల విలువ పెరగనున్నట్టు అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం వరకు పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. పట్టణ భూములు విలువ పెంచిన సర్కారు తాజాగా పల్లెలపై కన్నేసింది. ఉదాహరణకు మండపేటలో భూముల పెంపుదలను పరిశీలిద్దాం. సంపన్న వర్గాల వారు నివసిస్తున్న విజయలక్ష్మి నగర్‌లోని ఓ రోడ్డులో గజం విలువ రూ.11,000ల వరకూ పెంచగా...అదే ప్రాంతంలోని పక్క రోడ్డులో రూ.4,500 మాత్రమే పెంచారు. పట్టణంలోని పేదవర్గాల వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన సంఘం పుంత కాలనీలో రూ.1800 ఉన్న గజం విలువను రూ.11,000లకు పెంపుదల చేశారు. ఆలమూరు రోడ్డులో రూ.1800లు ఉన్న గజం విలువను రూ.10,500లకు పెంచేశారు. - మండపేట
జిల్లాలో 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా కాకినాడ, రాజమహేంద్రరం, అమలాపురం ప్రధాన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు దాదాపు వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఆయా రిజిస్ట్రేషన్ల ద్వారా సుమారు రూ. 2.1 కోట్లు ఆదాయం వస్తోంది. గత ఏడాది భూముల విలువ పెంపులో అనాలోచిత నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాల్జేశాయి. చాలాచోట్ల ప్రధాన రహదారిని ఆనుకుని భూములు, భవనాల విలువతో సమానంగా వాటి వెనుక ఉన్న వాటి విలువను పెంచేశారు. ఉదాహరణకు మండపేటలో సంపన్న వర్గాల వారు నివసిస్తున్న విజయలక్ష్మి నగర్‌లోని ఒక రోడ్డులో గజం విలువ రూ.11,000లు వరకు పెంచగా, అదే ప్రాంతంలోని పక్క రోడ్డులో రూ. 4,500 మాత్రమే పెంచారు. పట్టణంలోని పేదవర్గాల వారికి ఇళ్లస్థలాలు పంపిణీ చేసిన సంఘంపుంత కాలనీలో రూ.1800 ఉన్న గజం విలువను రూ. 11,000లకు పెంపుదల చేయడం గమనార్హం. ఆలమూరు రోడ్డులో రూ.1800లు ఉన్న గజం విలువను రూ.10,500లకు పెంచేశారు. విలువలేని చోట ఇష్టారాజ్యంగా భూముల ధరలు పెంచేయ్యడంపై అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ ప్రతిపక్షనేత రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు) పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో ధ్వజమెత్తారు. లేని విలువను పెంచి చూపడంతో రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో పేద వర్గాల వారు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉండటంతో పలువురు బాధితులు అప్పట్లో కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు సైతం చేశారు. అయిన వాటిపై ఏ విధమైన స్పందన లేకపోయింది. తాజాగా మరోమారు భూముల విలువ పెంచేందుకు కసరత్తు చేస్తుండటంతో ఆందోళనకు గురిచేస్తోంది.
గ్రామీణంపై మరింత భారం...
గత ఏడాది పట్టణ ప్రాంతాల్లో అధికంగా భూముల విలువ పెంచగా ఈసారి గ్రామీణ ప్రాంతాలపై అధికార యంత్రాంగం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 10 శాతానికి పైగాను, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మేర భూముల విలువ పెంపుదలకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఏఏ ఏరియాల్లో ఎంత పెరిగేదీ రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. జిల్లా మొత్తంగా 25 శాతం వరకు భూముల విలువ పెరగవచ్చునని తెలుస్తోంది.
మూలిగే నక్కపై తాటికాయ...
పెద్దనోట్లు రద్దుతో ఇప్పటికే కుదేలైన నిర్మాణ రంగానికి తాజాగా రిజిస్ట్రేషన్ విలువ పెంపు నిర్ణయం మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద నోట్లు రద్దు ప్రభావంతో జిల్లాలో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయింది. ప్రసుతం రోజుకు 60 శాతం మేర మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తాజాగా భూముల విలువ పెంపుదల చేయనుండటం విమర్శలకు తావిస్తోంది. లేని విలువను చూపించి రిజిస్ట్రేషన్ల చార్జీల రూపంలో భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. పెంపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు.