గుంటనక్కలకు గులాం
గుంటనక్కలకు గులాం
Published Sun, Aug 7 2016 5:33 PM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM
రోడ్డు విస్తరణలో స్పీకర్ స్థలం జోలికి వెళ్లని కార్పొరేషన్
పక్కనే ఉన్న చర్చికి చెందిన..
గుంట గ్రౌండ్ వైపే 22 అడుగుల విస్తరణ
చక్రం తిప్పిన టీడీపీ ఎమ్మెల్యే !
గుంటూరులో ఏఈఎల్‌సీ ఆస్తులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హారతి కర్పూరంలా కరిగించేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే చర్చి స్థలాలను కారుచౌకగా కొట్టేశారు. మరో ఎమ్మెల్యే తన బినామీ పేరు లీజుకు తీసుకున్నారు. తాజాగా జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి రోడ్డు విస్తరణ సమయంలో తన స్థలాన్ని కాపాడుకునేందుకు చర్చి స్థలాన్ని టార్గెట్ చేశారు. రోడ్డుకు మరోవైపు ఉన్న చర్చికి చెందిన గుంట గ్రౌండ్ స్థలాన్ని తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చారు.
సాక్షి ప్రతినిధి, అమరావతి : ‘దీపం ఉన్నప్పుడే దేవుళ్ల ఆస్తులను స్వాహా చేయాలి..’ అన్నట్లుగా ఉంది అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరు. గుంటూరులో ఏఈఎల్‌సీ స్థలాల స్వాహా పర్వం వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. కొందరు ప్రత్యక్షంగా చర్చి ఆస్తులను కొట్టేస్తున్నారు. మరికొందరు తమ స్థలాలను కాపాడుకునేందుకు పరోక్షంగా చర్చి స్థలాలను వినియోగించుకుంటున్నారు. ఏఈఎల్‌సీకి కోట్లాది రూపాయల నష్టం కలిగిస్తున్నారు. గుంటూరులోని నాజ్ సెంటర్ నుంచి కొత్తపేట వెళ్లే రోడ్డును విస్తరించిన తీరే ఇందుకు నిదర్శనం.
రోడ్డు విస్తరణకు ఒకవైపే స్థల సేకరణ..
రోడ్డు విస్తరణ చేసేటప్పుడు సాధారణంగా రెండు వైపులా సమానంగా స్థలం తీసుకుంటారు. కానీ గుంటూరు నాజ్‌సెంటర్ నుంచి కొత్తపేట పోలీస్‌స్టేçÙన్ వైపు వెళ్లే రోడ్డు విస్తరణ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఈ రోడ్డుకు ఒకవైపు చర్చికి చెందిన గుంట గ్రౌండ్, మరోవైపు స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చెందిన స్థలం ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణ కోసం 22 అడుగులు తీసుకోవాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు రెండు వైపులా 12 అడుగుల చొప్పున రోడ్డు విస్తరించాల్సి ఉంది. కానీ ఇక్కడే నగరపాలక సంస్థ ‘పచ్చ’పాతం చూపింది. కోడెల స్థలం ఉన్న వైపు కాకుండా... ఏకపక్షంగా చర్చికి చెందిన గుంటగ్రౌండ్ వైపున 22 అడుగుల మేరకు రోడ్డును విస్తరించేసింది.
గుంట గ్రౌండ్ లీజు ఎమ్మెల్యే ఆనంద్‌బాబుకే..
గంట గ్రౌండ్‌ను ఏటా రూ.5 లక్షల లీజుకు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సొంతం చేసుకున్నారు. ఎగ్జిబిషన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే ఏటా రూ.50 లక్షలకుృపైగా ఆర్జిస్తున్నారని క్రైస్తవ సంఘాల పెద్దలు చెబుతున్నాయి. ఎగ్జిబిషన్లకు నేరుగా చర్చి తరఫునే స్థలం ఇస్తే ఆదాయం మొత్తం చర్చికే వస్తుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అంతా ఎమ్మెల్యే హవా..!
ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి గుంట గ్రౌండ్‌కు చెందిన స్థలాన్ని సేకరించే విషయమై చర్చించేందుకు కలెక్టర్ అధ్యక్షతన ఈ ఏడాది మే 12న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు కూడా పాల్గొన్నారు. వేమూరు ఎమ్మెల్యే అయిన ఆనంద్‌బాబుకు ఈ వ్యవహారంతో సంబంధం లేదు. అయినా అధికార పార్టీ తరఫున మధ్యవర్తిత్వం చేయడానికే సమావేశంలో పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. అదే నెల 18న జరిగిన చర్చి కౌన్సిల్ సమావేశంలో రోడ్డు విస్తరణకు గుంట గ్రౌండ్ స్థలంలో 12 అడుగులు ఇచ్చేందుకు తీర్మానం చేశారు. చర్చి కౌన్సిల్ తీర్మానాన్ని నగరపాలక సంస్థ పట్టించుకోలేదు. ఏకపక్షంగా రోడ్డును గుంట గ్రౌండ్ వైపే 22 అడుగుల మేర విస్తరించింది. కార్పొరేషన్ వైఖరిని వ్యతిరేకిస్తూ చర్చి పెద్దలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు.
Advertisement
Advertisement