దీపం పేరుతో పాపం | Large collection of ujjwala and deepam schemes | Sakshi
Sakshi News home page

దీపం పేరుతో పాపం

Published Sun, Jun 25 2017 11:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

దీపం పేరుతో పాపం - Sakshi

దీపం పేరుతో పాపం

► దోపిడీకి తెర తీసిన అధికార పక్ష కార్యకర్తలు
► రెండు నెలల్లో రూ.11కోట్లు స్వాహా
► దీపం, ఉజ్వల పథకాల్లో భారీగా వసూళ్లు
► కనెక్షన్‌కు రూ.వెయ్యికి పైగా అదనపు బాదుడు
► జన్మభూమి కమిటీ సభ్యులదే భాగస్వామ్యం  


సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనేది పెద్దల మాట. టీడీపీ కార్యకర్తలు ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అయిపోతున్నారు. అయితే పేదింటిలో వెలగాల్సిన దీపాన్ని తమ ఇంటిలో వెలుగుకు వాడుకుంటున్నారు. దీపం, ఉజ్వల కనెక్షన్ల మంజూరులో దోపిడీ పర్వానికి తెర లేపి అందినకాడికి దండుకుంటున్నారు. వజ్రపుకొత్తూరు మండలం గోపీనాథపురం గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారుడు సాక్షితో మాట్లాడుతూ ‘జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులకు రూ.3,100 చెల్లించి దీపం పథకం కనెక్షన్‌ తీసుకున్నాను.

అంత చెల్లించే స్థోమత లేపోయినా వ్యతిరేకించలేకపోయాను. ఒకవేళ వ్యతిరేకిస్తే సంక్షేమ పథకాలు నాకు రాకుండా చేస్తారేమోనని భయం. మా గ్రామంలో చాలామంది వద్ద గ్యాస్‌ కోసం అదనంగా వసూలు చేశారు. నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీపం పేరుతో  జరుగుతున్న పాపానికి ఈ మాటలే నిదర్శనం.

రూ.11 కోట్ల దోపిడీ
జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్‌ల ముసుగులో రూ.11 కోట్ల వరకూ పేదల నుంచి గుంజేశారు. ఈ వ్యవహారంలోనూ జన్మభూమి కమిటీ సభ్యులదే ప్రధాన భాగస్వామ్యం. వాస్తవానికి జిల్లాను పొగరహితంగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంటింటా సర్వే నిర్వహించి ఏ ఇంట్లో అయితే వంటగ్యాస్‌ కనెక్షన్‌ లేదో వారికి దీపం, ఉజ్వల పథకాల్లో లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీనిలో భాగంగానే అతి తక్కువ ధరకే వంటగ్యాస్‌ కనెక్షన్‌ను లబ్ధిదారులకు మంజూరు చేయాల్సి ఉంది. దీపం పథకమైతే రూ.1,980లు, ఉజ్వల పథకమైతే రూ.700లు చెల్లించాలి. అదీ రాజకీయాలకు అతీతంగా తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరు చేయాలి.

దీని కోసం సమీపంలోని గ్యాస్‌ ఏజెన్సీ డీలరును సంప్రదిస్తే సరిపోతుంది. ఏ అధికారి సంతకం అవసరం లేదు. ఉజ్వల పథకం కింద గ్యాస్‌ సిలిండరు డిపాజిట్‌ చెల్లించనక్కర్లేదు. గ్యాస్‌ స్టౌ (చిన్నది), రెగ్యులేటర్, రబ్బరు ట్యూబు ఉచితం. వినియోగదారుల పుస్తకానికి కానీ, ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు కూడా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే 2011 సంవత్సరం జనాభా లెక్కల్లో పేరు నమోదై ఉండాలి. దీపం పథకం విషయానికొస్తే గ్యాస్‌ సరఫరా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమైనా రాయితీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. నిబంధనల ప్రకారం గ్యాస్‌ సిలిండర్‌కు డిపాజిట్‌ చెల్లించనక్కర్లేదు. రెగ్యులేటర్‌ కూడా ఉచితం. కానీ ఇవి పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యులు చేతులు తడపాల్సి వస్తోంది.

రూ.కోట్లలోనే వసూళ్లు
రేషన్‌కార్డుల ఆధారంగా జిల్లాలో 8.22 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే వివిధ పథకాల కింద 6.47 లక్షల కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి. వాటిలో సాధారణ కనెక్షన్లు 3.76 లక్షలు ఉన్నాయి. అలాగే దీపం కనెక్షన్లు 2.42 లక్షలు కాగా ఉజ్వల పథకం కింద 15,531 కనెక్షన్లు ఉన్నాయి. మరో 12 వేలు కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి. గత రెండు నెలల కాలంలో దీపం, ఉజ్వల పథకాల కింద 1.14 లక్షల కనెక్షన్లు కొత్తగా మంజూరయ్యాయి. ఇవే జన్మభూమి కమిటీలకు వరంగా మారాయి.

గ్రామస్థాయిలో ఆయా కమిటీల సభ్యులు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఒక్కో గ్యాస్‌ కనెక్షన్‌పై రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ అదనంగా వసూలు చేశారు. సగటున రూ.వెయ్యి చొప్పున లెక్క వేసినా అధికార పార్టీ వారి అక్రమ వసూళ్లు సుమారు రూ.11 కోట్ల పైమాటేనని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్‌ ఏజెన్సీలుకూడాఏమీచేయలేక టీడీపీ నాయకులు సూచిం చిన వారికే దీపం కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు.

మచ్చుకు కొన్ని...
దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ కోసం పలాస మండలం చినంచల గ్రామంలో 20 మంది మహిళల వద్ద రూ.3,500లు చొప్పున జన్మభూమి కమిటీ సభ్యులు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

వజ్రపుకొత్తూరు మండలంలో దీపం గ్యాస్‌ కనెక్షన్‌కు రూ.3,100 నుంచి రూ.4,950 వరకు జన్మభూమి కమిటీ సభ్యులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నువ్వలరేవు గ్రామంలోనే సుమారు 220 కనెక్షన్‌లు మంజూరు చేయగా, వారందరి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేయడం గమనార్హం.

వీరఘట్టం మండలంలోని నీలానగరం గ్రామంలో దీపం పథకం కింద ఒక్కో కనెక్షన్‌కు రూ. 2500 చొప్పున వసూలు చేశారు.

లబ్ధిదారులకు ఇచ్చే పరికరాలు    దీపం (ధర)    ఉజ్వల (ధర)
1. గ్యాస్‌ సిలిండర్‌ డిపాజిట్‌           ఉచితం    ఉచితం(రూ.1450)
2. రెగ్యులేటర్‌ (రూ.150)              ఉచితం       ఉచితం
3. గ్యాస్‌ ఖరీదు                           రూ.700    రూ.700
4. రబ్బరు ట్యూబు                      రూ.190     ఉచితం
5. వినియోగదారుల పుస్తకం         రూ.50      ఉచితం
6. ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు                రూ.50      ఉచితం
7. గ్యాస్‌ స్టౌ(చిన్నది)                    రూ.990    ఉచితం
 మొత్తం                                    రూ.1,980    రూ.700  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement